స్వయంకృత పరాభవం

IYR Krishna Rao Article On TDP defeat - Sakshi

విశ్లేషణ

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు ఎన్నికల వెంటనే వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌ చాలా వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు పేర్కొన్నప్పటికీ చాలామంది ఇంత అనూహ్యమైన విజయం వైఎస్సార్‌సీపీకి,  తెలుగుదేశానికి పరాజయం ఊహించలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒక సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎన్నికలలో బాబు గారు ఊహించలేనంత  పరాజయాన్ని చవిచూడబోతున్నారు  అని నిర్ధారించింది. ఆ సంస్థ అధిపతి ఎన్నికల ముందే నాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించి రాకపోవచ్చని, బాబు గారు ఊహించనంత పరాజ యాన్ని చవిచూడబోతున్నాడు అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు దరిదాపులలో వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 151 స్థానాలు, తెలుగుదేశానికి 23 స్థానాలు, జనసేనకు ఒక స్థానం వచ్చాయి. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశానికి 23 స్థానాలు వచ్చాయి కానీ అదే జరగకుండా ఉంటే పది స్థానాలు మించి ఉండేవి కావు. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 

ప్రథమ కారణం గత ఐదు సంవత్సరాల్లోని ప్రభుత్వ అవినీతి పాలన. బాబు గారు 2009, 2014 ఎన్నికలను అధికారంలో లేకుండా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో  ఎన్నికల ఖర్చులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నం కావడం సహజం. 2014లో అధికారానికి వచ్చినప్పటినుంచి పాలన 2019 ఎన్నికలను ధనబలంతో ఎలా గెలవాలనే ఆలోచనతోనే సాగింది. దీనితో అవినీతి విశృంఖలంగా అయింది. ఏదో ఒక స్థాయిలో కాక వివిధ స్థాయిల్లో అవినీతి పెరిగిపోయింది. ఇసుక నుంచి మట్టి దాకా కాదేది అవినీతికి అనర్హం అన్న స్థాయిలో పరిపాలన నడిచింది. ఇదే ఈనాటి తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నేను భావిస్తున్నాను. 

మొదటినుంచీ బాబు గారికి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని కమ్యూనిస్టుల సంస్థాగత విధానం అంటే చాలా అభిమానం. కార్యకర్తల సహాయంతో వారు రాష్ట్రాన్ని అప్రతిహతంగా 30 సంవత్సరాలు పాలించారు అనేది ఆయన మనసులో బాగా నాటుకున్నది. అదే విధమైన క్యాడర్ను తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చేయాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన మరిచిన ఒక ముఖ్య విషయం ఏందంటే మౌలిక సిద్ధాంతాలు లేని ఏ కేడర్‌ అయినా లాభం కన్నా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కార్యకర్తలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఈ కమిటీల చేతుల్లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీలు చేసిన నష్టం ఇంతా అంతా కాదు. అర్హత లేని వాళ్లకు లబ్ధి కల్పించడం ద్వారా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పెంపొందించటంలో ఈ కమిటీలు ప్రధాన పాత్ర వహించాయి. 

బాబుగారి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక వర్గానికి పెద్దపీట వేశారనేది సొంత పార్టీలోనే ఒక ప్రధాన చర్చకు దారితీసింది. ఇక సాధారణ ప్రజల విషయంలో చెప్పనవసరం లేదు. ఈ ప్రభుత్వం ప్రజల వలన ప్రజల చేత కొందరి కొరకు అన్న ధోరణిలో పాలన సాగించింది. ఈ సంకుచిత ఎజెండా ప్రజలకు నచ్చలేదు. పైపెచ్చు ఈ వర్గంలో కొందరు ప్రదర్శించిన అహంభావ ధోరణులు తీవ్ర ప్రజా వ్యతి రేకతకు కారణాలయ్యాయి. 

2004 ఓటమికి ప్రధాన కారణం బాబు గారి దృష్టిలో ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత. దీనిని రూపుమాపటం కోసం 2014 నుంచి ప్రయత్నం ప్రారంభించారు. కానీ ఆయన ఎన్నుకున్న విధానం లోపభూయిష్టం. ఉద్యోగ సంఘాల నేతలను వశపరచుకోవడం ద్వారా ఉద్యోగస్తులను తన వైపు తిప్పుకోవచ్చని భావించారు. సంఘ నేతలు స్థాయికి మించిన ప్రాధాన్యాన్ని ప్రభుత్వంలో పొంది తమ సొంత ఎజెండాను ముందుకు తీసుకొనిపోయినారు కానీ వారి వల్ల ఉద్యోగస్తులు ఏవిధంగానూ ప్రభావితం కాలేదు. 

కేవలం అభివృద్ధిని ఒక ప్రాంతాల్లో కేంద్రీకరించడం ద్వారా ఇతర ప్రాంతాలలో వ్యతిరేక భావం ప్రబలింది. రాయలసీమ మొత్తానికి రెండే రెండు సీట్లు బాబు గారికి, బాలకృష్ణ గారికి రావటమే ఇందుకు నిదర్శనం. 
క్షేత్రస్థాయిలో పనులకు.. చేసిన ప్రచారానికి ఎక్కడా పొంతన లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల సమయంలో ఉన్నది. విభజన అంశాలను ప్రధాన ఎజెండాగా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి మోదీ గారిని, జగన్‌ గారిని రాష్ట్ర వ్యతిరేకులుగా చూపెట్టడానికి బాబు గారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 

అన్నిటికీ మించి తాను ప్రత్యేకంగా ఏరికోరి ఏర్పాటు చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం పరిపాలన అంశాలలో ఆయనకు మద్దతుగా ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలలో అదే విధంగా ఏర్పాటు చేసు కున్న పార్టీ కార్యదర్శి, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ కమిటీ చైర్మన్‌ సహాయం చేయటానికి ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఓటమి చెందటానికి అంతగా బయట శత్రువుల అవసరం లేకపోవచ్చు.

ఐవైఆర్‌ కృష్ణారావు 
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్‌ : iyrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top