గోదావరి జలాలతోనే కరువు ప్రాంతాలకు సిరిసిరి!

Imam Article On Godavari Water Distribution - Sakshi

అభిప్రాయం

తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఉభయ రాష్ట్రాల ప్రజలను పులకింపజేసింది. ఒక యువ నాయకుడు ఇరురాష్ట్రాల సేద్యపునీటి ప్రాజెక్టులపై ఇంతటి లోతైన అధ్యయనం చేయడం ఆ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించడం, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జల యజ్ఞం కొనసాగింపుగా భావించాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతను ఏర్పరుచుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతికి నడుం బిగించడం సేద్యపునీటి సౌకర్యాల కల్పనకై చాలాకాలంగా పోరాడుతున్న మాలాంటి కార్యకర్తలకు ఎంతో ఉత్సాహం, ఆనందాన్ని కలిగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 301 టీఎంసీల జలాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 80 టీఎంసీల జలాలు వినియోగించుకోవడం, దుమ్ము గూడెం, నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల గోదా వరి జలాలను నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు తరలించడం లాంటి అంశాలు జలయజ్ఞంలో ఉన్నాయి. తెలంగాణలోని అనేక ప్రాజెక్టులను.. ప్రాణహిత, చేవెళ్లలాంటి ఎత్తిపోతల పథకాన్ని, హంద్రీ–నీవా లాంటి ఎత్తిపోతల పథకాన్ని దివంగత సీఎం వైఎస్సార్‌ చేపట్టి జలయజ్ఞం ద్వారా ఏమి చేయ వచ్చో నిరూపిస్తూ 86 ప్రాజెక్టుల్ని ప్రారంభించారు.

ఏపీ ఓటర్లు 23 అసెంబ్లీ స్థానాలకు తనను ఎందుకు పరిమితం చేశారో నేటికీ చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి తగు విధంగా ప్రతిపక్షనేతగా బాధ్యతలు నెరవేర్చకుండా కేసీఆర్‌ను ఒక ఆయుధంగా చూపించి తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోనే గోదావరి జలాల ఎత్తి పోతలు జరగాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ అపోహలు, సందేహాలు కల్పించే విధంగా అసెం బ్లీలో ప్రభుత్వానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ గతంలో.. హంద్రీ–నీవా నుంచి 10 టీఎంసీల జలాలను అనం తపురం జిల్లాకు తరలించి పోతిరెడ్డిపాడు వైశాల్యం 44 వేల క్యూసెక్కులకు పెంచిన సందర్భంలో  వైఎస్‌ కృషి పట్ల సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబు చేతిలో ఆయుధంగా మారి ఈ జిల్లా ప్రజలకు తీరని నష్టం కలిగించేందుకు ప్రయత్నించారు. అదే పద్ధ తిలో నేడు కేశవ్‌ బాబుతో కలిసి గోదావరి జలాల మళ్లింపుపై వ్యతిరేకత వ్యక్తపరుస్తూ సభలో గందర గోళం సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ సంద ర్భంలోనే వైఎస్‌ జగన్‌ గతంలో ఏ సీఎంకి లేనంత అవగాహనతో గోదావరి జలాల మళ్లింపుపై మనల్ని పులకరింపజేసే ఉపన్యాసాన్ని ఇచ్చారు.

నిజానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో రాయలసీ మకు ఓ పెద్దద్రోహం జరిగింది. అదేమంటే శ్రీబాగ్‌ ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడం, కృష్ణా పెన్నార్‌ ప్రాజెక్టును వ్యతిరేకించి నాగార్జున సాగర్‌ చేపట్టడం, అలాగే నేటి శ్రీశైలం స్థానంలోనే సిద్ధేశ్వరం ప్రాజెక్టుపై కోస్లా కమిటీ సూచనలను అమలు పరచక పోవడం జరిగింది. ఈ పొరపాటును నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా  సవరించడా నికి చూశారు. వైఎస్సార్‌ పట్టుదలతో తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి, హంద్రీ–నీవా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు తాగునీటికి, సాగునీటికి నోచుకోని ప్రాంతాల కోసం వినుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించి పరుగులు పెట్టించారు. బాబు నిర్లక్ష్యం వల్ల అవి నీటి కేటాయిం పులు లేకుండా కొనసాగుతున్నాయి. అవతల తెలం గాణలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌ సాగర్, స్టేజ్‌–1, స్టేజ్‌–2కు నీటి కేటాయింపులు లేకుండా ఇసుకలో లభించే మిగులు జలాలతో ముడిపెట్టి చేపట్టింది. వీటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సేద్యపునీటి సాధికారత కల్పించారు. 

గోదావరి నుంచి వృథాగా వెళుతున్న నీటినుంచి ఈ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించి వైఎస్సార్‌ ఆశయాల కొనసాగింపునకు కృషి చేయ వచ్చు. నేడు గ్రేటర్‌ రాయలసీమ.. కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు రక్షణ పేరుతో గోదావరి జలాల మళ్లింపుపై చర్చలు జరుపుతున్నారు. నిజంగా గోదా వరి ఆయకట్టు స్థిరీకరణ, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల స్థిరీకరణ జరిపి ఎగువన శ్రీశైలం నుండి చేపట్టిన సాగు, తాగునీటి పథకాలకు గోదావరి జలాల మళ్లింపులే శరణ్యం. వైఎస్‌ జగన్‌కి ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలు ఏకంగా గొంతెత్తి ఆహ్వానించాలి.


ఇమామ్‌ 
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్‌ : 99899 04389

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top