మహాసంప్రోక్షణా... నిర్బంధమా?

Guest SV Badri Column On Cancellation Of Srivari Darshanam - Sakshi

సంప్రోక్షణ సమయంలో భక్తుల రాకను నిరోధిస్తూ తిరుమల ఆలయాన్ని పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఏముంది? తాజా వివాదంపై డాక్టర్‌ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించడమేగాక, దేన్నో కప్పిపుచ్చుకోవడానికే టీటీడీ తాజా చర్యలకు ఉపక్రమించిందని అనుమానిస్తున్నారు. గర్భగుడికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాములవారి మేడ వరకూ 500 రంధ్రాలు వేయడం గురించి జనం మాట్లాడుకుంటున్నారు. రహస్య నిధి అన్వేషణకు శాస్త్రీయ పద్ధతిలో ఏమైనా పరిశోధన జరుగుతోందా? అసలు టీటీడీ పథకం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబులు అవసరం.

అన్ని ప్రధాన హిందూ దేవాలయాల్లో మహా సంప్రోక్షణం (వైష్టవాల యాల్లో) లేదా కుంభాభిషేకం (శివాలయాలు, ఇతర గుడుల్లో) పన్నెండేళ్లకోసారి చేయాలనే సంప్రదాయం ఉంది. తిరుమల గుడిలో వైఖానస ఆగమ సంప్ర దాయం పాటిస్తారు కాబట్టి 12 ఏళ్లకు ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని వైఖానస భృగులో ‘మహానిమితే సంప్రాసే మహాసంప్రోక్షణం మాచరితే’ అని సూచించారు. మహానిమితే అంటే– ఆలయంలో దోపిడీ జరిగినపుడు, పద్మపీఠంపై విగ్ర హం ఊగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా కార ణాల వల్ల నైవేద్యం, పూజలు లేదా ఆరాధన ఆగి పోతే మహాసంప్రోక్షణం తప్పనిసరి అని అర్థం. కాని, తిరుమలలో మిరాసీ అర్చకులు నిర్ణయం మేరకు పన్నెండేళ్లకోసారి మహాసంప్రోక్షణం జరిపిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది నిర్వహించడం జరుగుతోంది. ఆలయం లోపల, కొన్నిసార్లు చిన్న, పెద్ద మరమ్మతులు జరపడానికి, అలంకారంలో భాగంగా కొన్నాళ్లకు నగల బరువు వల్ల విగ్రహం పద్మపీఠంపై కదిలే పరిస్థితి వచ్చినప్పుడు ఇది నిర్వహిస్తారు. ఏ గుళ్లో అయినా భక్తులు పెద్ద సంఖ్యలో చేరి ఆనందంతో గడిపే సందర్భం మహా సంప్రోక్షణం. గర్భగృహ గోపురంపైనున్న కుంభం నుంచి జాలువారే పవిత్ర సంప్రోక్షణ తీర్థం కోసం వారు పోటీపడతారు. తీర్థం చుక్కలు పడితే తలలు పవిత్రమవుతాయనేది వారి నమ్మకం. ఈసారి ఆగస్టు 9 సాయంత్రం నుంచి 17 ఉదయం 6 గంటల వరకూ శ్రీవారి ఆలయం మూసివేయాలని తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయిం చింది. ఇలాంటి సంప్రోక్షణ గురించి టీటీడీ బోర్డుకు తెలియదనే అభిప్రాయంతో నేను తిరుమలలో 1800 సంవత్సరం నుంచి ఈ విషయంపై నేను అధ్య యనం చేశాను. అప్పటి నుంచి సంప్రోక్షణ జరిగిన ఏ సందర్భంలోనూ ఇప్పటి బోర్డు నిర్ణయించినట్టు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిరాకరించలేదు. ఇలా చేయడం మహా నిర్బంధమే.

1800 నుంచి మహా సంప్రోక్షణాలు
1800లో మిరాసీ అర్చకుడు శ్రీనివాస దీక్షితులు శ్రీవారి రెండు హస్తాలకు బంగారు పూత కోసం ఈ కార్యక్రమం జరిపించిన సమయంలో ప్రజలను మూలవిరాట్టు దర్శనానికి అనుమతించారు. 1908 సెప్టెంబర్‌ 30న ఆనంద నిలయంలో కొత్త బంగారు కలశం అమర్చినప్పుడు భక్తులకు దర్శనం కొన సాగించారు. ఇంకా 1934, 1946లో శ్రీవారికి కొత్త నగలతో ఇతర అలంకారాలు జరిగిన సందర్బంగా కూడా మూలవిరాట్టు దర్శనంపై ఆంక్షలేవీ లేకుండా మామూలుగానే భక్తులను అనుమతించారు. 1958  ఆగస్టులో పెద్ద స్థాయిలో జరిగిన బంగారు తాపడం పని సందర్బంగా మూల విరాట్టు దర్శనాన్ని మధ్యా హ్నం 12 నుంచి 3 గంటల మధ్యే కొనసాగించారు.

1970లో కూడా తిరుమల గుడిలో భారీ అదనపు ఏర్పాట్లు చేసినప్పుడు కూడా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారుగాని కొన్ని గంటలకు కుదించారు. 1982లో బంగారు తాపడంతో కొత్త ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు కూడా కొన్ని నిర్ణీత వేళల్లో మూలవిరాట్టును దర్శించుకోవడానికి అనుమ తించారు. 1994, 2006లో చేపట్టిన సంప్రోక్షణ సందర్భంగా ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కుంభం నుంచి పవిత్ర తీర్థాన్ని భక్తులపై స్వయంగా చల్లారు. ఈ రెండుసార్లూ సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి ఆటంకం కలగలేదు. 2006లో సర్వ దర్శనం ఆపకుండా దాన్ని కొన్ని గంటలకే పరిమితం చేశారు. ఈ వాస్తవాలు గమనిస్తే 1800 నుంచి 2006 వరకూ సంప్రోక్షణ జరిగిన సందర్భాల్లో మూల విరాట్టు దర్శనం ఆగలేదు గాని నిర్ణీత సమయాలకే పరిమితం చేశారనే విషయం స్పష్టమౌతోంది. 

దర్శనంతో పాటు హోమాలూ చూశారు!
సంప్రోక్షణకు సంబంధించిన అన్ని పనులూ ఆనంద నిలయ ప్రాకారంలోని పాత కల్యాణ మండపం లోనే(ప్రస్తుత పరకామణి) గతంలో నిర్వహించారు. ప్రదక్షిణ చేస్తూ దేవుడి దర్శనంతోపాటు భక్తులకు యాగశాలలో జరిగే హోమాలు చూసే అవకాశం కూడా దక్కింది. సంప్రోక్షణ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 70 మంది రుత్విక్కులను ఎంపిక చేసి వారితో హోమాలు జరిపిస్తారు. వేద మంత్రా లతో చేసే దివ్య హోమాలు చూడటానికి భక్తులు కిట కిటలాడతారు. ఇంకా వేదాలు, మహాభారతం, భాగ వతం పారాయణం కూడా వారిని ఆకట్టుకునేలా సాగుతుంది. అయితే, ఈ ఏడాది ఇవన్నీ జరిగే సమ యంలో ఆలయంలోకి భక్తులను టీటీడీ అనుమతిం చడం లేదు.

ఈ కార్యక్రమాలు చూడడానికి, పురా ణాల పఠనం వినడానికి భక్తులను విమాన ప్రదిక్షణ సమయంలో యాగశాల మీదుగా నడవడానికి అవ కాశం లేకుండా చేశారు. ఏకాంతంలో తప్ప బహిరం గంగా నిర్వహించే అన్ని ఇలాంటి పవిత్ర కార్యక్ర మాల్లో భక్తులు పాల్గొనడాన్ని మిరాసీ అర్చకులు ప్రోత్సహించేవారు. ప్రస్తుత ప్రధాన అర్చకుడు పూర్వపు ప్రధాన మిరాసీ అర్చకుల్లాంటి వ్యక్తి కాదు. టీటీడీ బోర్డు అంటే ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను నియమించింది. ఇతర అర్చ కులు టీటీడీ ఉద్యోగం కారణంగా కాంట్రాక్టుపై ఉన్న వారు. ఈ కారణంగా వారు సంప్రోక్షణ వంటి పవిత్ర కార్యక్రమాల్లో టీటీడీ అధికారుల జోక్యాన్ని అడ్డు కోలేరు. ఆలయ నిర్వహణ, అర్చనపై పూర్తి పట్టు, నియంత్రణ సంపాదించడానికి ఈ అధికారులు ఎప్పుడూ ఉవ్విళ్లూరుతుంటారనేది వాస్తవం. టీటీడీ నిర్వహణ సక్రమ మార్గంలో నడిచేలా మిరాసీ అర్చ కులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా వారు రాజకీయ కారణాలతో నియమితులైన టీటీడీ పాలకవర్గం లక్ష్యాలకు అవరోధంగా మారారు.

భక్తులకు దర్శనభాగ్యం లేకుండా చేస్తారా?
సంప్రోక్షణ సమయంలో భక్తుల రాకను నిరోధిస్తూ ఆలయాన్ని పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఏముంది. భక్తుల రద్దీని తట్టుకోవడం కష్టమని చెబు తున్న కారణం సహేతుకంగా లేదు. సెప్టెంబర్, అక్టో బర్‌ మాసాల్లో వచ్చే పురత్తాసి శనివారాల్లో ఎప్పుడూ లేనంత సంఖ్యలో భక్తులు వస్తారు. చాలా మంది ఈ సమయంలో మందిరం బయటి నుంచే వరాహ స్వామి, బేడీ ఆంజనేయ స్వామి దర్శనంతోపాటు గోపుర దర్శనం చేసుకుంటారు. ఆనంద నిలయాన్ని కూడా చూస్తారు. తన దర్శనంపై నిర్ణయాధికారం వేంకటేశ్వరస్వామికి మాత్రమే ఉంటుందని అత్యధిక ప్రజానీకం నమ్ముతారు. ఒక వేళ ఎవరికైనా దర్శన భాగ్యం కలగకపోతే ఇది తమ ప్రాప్తమని భావిస్తారు.

తాజా వివాదంపై డాక్టర్‌ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించడమేగాక దేన్నో కప్పిపుచ్చుకోవడా నికే టీటీడీ తాజా చర్యలకు ఉపక్రమించిందని అను మానిస్తున్నారు. గర్భగుడికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాములవారి మేడ వరకూ 500 రంధ్రాలు వేయడం గురించి జనం మాట్లాడుకుంటు న్నారు. రహస్య నిధి అన్వేషణకు శాస్త్రీయ పద్ధతిలో ఏమైనా పరిశోధన జరుగుతోందా? ఇందులో ఏమైనా నిజం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబులు అవసరం.  తిరుమలలోని మూడు ప్రదేశాల్లో రహస్య నిధులున్నాయనే నమ్మకం విస్తృతంగా వ్యాపించింది. ఈ మూడింటిలో మొదటిది వేయి కాళ్ల మండపం. గతంలో మాస్టర్‌ ప్లాన్‌ పేరిట దాన్ని పద్ధతి లేకుండా తొలగించారు.

రెండోది వకుళ మాత పోటు. ఇక్కడే శ్రీవారికి అన్న ప్రసాదాలు, నైవేద్యం తయారు చేస్తారు. ఇటీవల ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారు. నేలను, గోడ పలకలను మార్చేశారు. మూడోది గర్భ గృహానికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాము లవారి మేడ వరకూ ఉన్న ప్రదేశం. దీనికి, ఆగస్టు 9 నుంచి 16 వరకూ భక్తులకు దర్శనం నిలిపివేయడా నికి ఏమైనా సంబంధం ఉందా? ఈ సందర్భంగా అనేక మంది మందిరం ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్టు కూడా చెబు తున్నారు. అంతేగాక సంప్రోక్షణ సమయంలో సీసీ టీవీ కెమేరాలు పనిచేయవని కూడా కొందరంటు న్నారు. ఈ అంశాలపై టీటీడీ వివరణ ఇస్తుందా? గతంలో కొత్త ఏర్పాట్లు, అలంకారాల కోసం మరమ్మ తులు జరిపిన సందర్భంగా చేసిన సంప్రోక్షణల సమ యంలో భక్తులను మూలవిరాట్టు దర్శనానికి అను మతించినప్పుడు ఈ ఏడాది జరిపే ఈ కార్య క్రమంలో ప్రజలు రాకుండా గుడిని పూర్తిగా ఎందుకు మూసేయాల్సి వస్తోంది? అంతటి గొప్ప ఆలయ నవీకరణ, మరమ్మతులు ఏం జరుగుతాయి? గుడిలో పాతవాటి స్థానంలో కొత్తవి ఏమేమి ఏర్పాటు చేస్తారు? స్వయంభూ సాలగ్రామ విగ్రహాన్నే మారు స్తున్నారా? సంప్రోక్షణ జరిగే రోజుల్లో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రహదారిని ఎందుకు మూసేస్తు న్నారు? ఈ కాలంలో ఎటువంటి తనిఖీలు లేకుండా టీటీడీ వాహనాలు కిందికి, పైకి పోవడానికి ఎలా అనుమతిస్తారు? అసలు టీటీడీ పథకం ఏంటి? 

టీటీడీ ధర్మాచార్యులు నిలదీయాలి! 
వీటినే కాకుండా, మరిన్ని ముఖ్య ప్రశ్నలతో మన ధర్మాచార్యులు టీటీడీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకమండలి నుంచి జవాబులు రాబట్టే స్థాయి, అర్హత వారికున్నాయి. అలాగే హిందూ సమాజం సంక్షేమం కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. అందుకే వారు ప్రజల సమ క్షంలో ఈ ప్రశ్నలు లేవనెత్తాలి. హిందూ సమాజం కూడా స్పష్టమైన బాధ్యతతో నడుంబిగించాలి. మహాసంప్రోక్షణ సమయంలో లోపలికి అనుమతిం చకపోవడంపై నిరసన తెలుపుతూ టీటీడీ ఈఓకు లేఖలు రాసే అవకాశం ఉపయోగించుకోవాలి. తాజాగా ఏపీ సీఎం బాబు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నిరసనతో దిగిరాక తప్పలేదు. టీటీడీ బోర్డు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం గురించి ఆయనకు తెలి యదనుకోలేం. గత మహాసంప్రోక్షణాల కాలాల్లో మాదిరిగానే భక్తులను శ్రీవారి దర్శనానికి పరిమిత సమయాల్లో అనుమతించాలని సోషల్‌ మీడియా కారణంగా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది.

వ్యాసకర్త ఎస్‌వీ బద్రి
తమిళనాడు ఆలయ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక సభ్యులు
contact@globalhinduheritagefoundation.org

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top