బారోట్రామా

Guest Column By Sri Ramana Over Chandrababu Administration - Sakshi

అక్షర తూణీరం

మునుపు ఏ విపరీతం జరిగినా, ఇందులో విదేశీ హస్తం ఉందని, ఒక వర్గం ఆరోపించింది. చాలాసార్లు ఆ హస్తం విదేశీ గూఢచార సంస్థది అయి ఉండేది. ఉప్పెనలొచ్చినా, పంటల మీద తెగుళ్లొచ్చినా, గాలి వాన కురిసినా విదేశీ హస్తం మీదకే తోసేసేవారు. చాలా రోజుల తర్వాత తిరిగి ఇన్నాళ్లకు చంద్రబాబు, ఎక్కడ ఏం తేడా జరిగినా మోదీ ఖాతాలో జమ వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వైఫల్యాలన్నిటికీ ఒకే ఒక కారణం మోదీ. ఏడాది క్రితం దాకా ప్రధాన మంత్రి ఏ మాత్రం వంకలేని పెద్దమనిషి. ఈ మధ్య కాలంలో ఇద్దరికీ పూర్తిగా చెడింది. అక్కడ్నించి మోదీ అంత రాష్ట్ర ద్రోహి ఇంకోడు లేకుండా పోయాడు. కిందటివారం నించి నరేంద్ర మోదీ బ్రిటిష్‌ పాలకులని మించిన దేశద్రోహిగా మారాడు. ఆయన ఆ స్థాయిలో చేసిన జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతాలేమిటో తెలియదు.

సాధారణ ప్రజ అనుకునేదేమిటంటే– చంద్రబాబు మానిఫెస్టోలని మోదీ ఎందుకు తలకెత్తుకుంటాడని?! ఎవడి జెండాలు, ఎజెండాలు వాడికి ఉంటాయి కదా? రైతుల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని స్థానిక పార్టీలు ఇంటింటా తిరిగి, చెవుల్లో మైకులు పెట్టి చెబుతారు. తీరా పవర్లోకి వచ్చాక ఆ మాట పీకలమీదికి తెస్తుంది. బ్యాంకులు సహకరించడం లేదని పవర్లోకొచ్చిన పార్టీ నస మొదలుపెడుతుంది. అది ఎవరి సొమ్ము బాబూ చేతికి ఎముక లేకుండా ధారపొయ్యడానికి? నగరాల్లో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ పన్ను చెల్లించేవారు ఈ మాఫీ అన్నప్పుడల్లా పరిపరి విధాల తిట్టుకుంటారు. రైతులకి న్యాయం చెయ్యా ల్సిందే. వారిని ఉద్ధరించాల్సిందే. దానికి అనేక మార్గాలున్నాయండీ అంటూ ఒక బంగారు ఫ్రేమ్‌ కళ్లద్దాలాయన ఎయిర్‌పోర్ట్‌లో క్లాసు తీసుకున్నాడు.

‘ఒకప్పుడు అందరం రైతులమే కాదంటే రైతు కూలీ లమే. ఇప్పుడు చెల్లాచెదరై ఇట్లా టౌన్లకొచ్చాం. అవి పెరిగి పెరిగి సిటీలైనాయ్‌. అయితే మనదా తప్పు? ఇప్పుడూ పెట్రోలు మండిపోతోంది. డీజిల్‌ కాలి పోతా ఉంది. రైతులు ఎడ్లతో చాకిరీ చేయించడం ఎప్పుడో మర్చిపోయారు. ట్రాక్టర్లే అన్నింటికీ. లీడ ర్స్‌కి రైతులమీద అభిమానం ఉంటే, ఎకరాకి ఓ వంద లీటర్లు డీజిల్‌ సగానికో పావలాకో సప్లయ్‌ చెయ్యాల. కావాలంటే ఎగస్ట్రా క్లాస్‌ కార్లకి కొట్టే చమురు మీద ఇంకో పదో పరకో వడ్డించు కోమనండి’ అంటూ గోల్డ్‌ ఫ్రేం నవ్వుని శ్రోతల మీదికి తిప్పాడు. ఆయన ఊహించినంత ప్రతిస్పం దన కన్పించలేదు. పైగా శ్రోతల ధ్యాసంతా ఎయిర్‌ పోర్ట్‌ మైకులమీద ఉంది.

ఇంతలో నిన్న ఢిల్లీ–జైపూర్‌ విమానీకులు ముంబై నించి వస్తున్నారు. నలుగురైదుగురు మన ప్రాంతంవాళ్లు. అందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు. తరచుగా పేపర్లో, టీవీల్లో వాళ్ల ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడివారు ఇట్టే గుర్తించారు. పలకరించి, చచ్చి బతికినందుకు అభినందించారు. అక్కడ చేరిన వారంతా ఎవరి అనుభవాలు వాళ్లు కక్కుతున్నారు. ‘ఏవండీ, బ్లీడ్‌ స్విచ్‌ని మర్చిపోవడంవల్ల, బారోట్రామా సంక్ర మించి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తస్రావం అయిందటగా.. ఏమిటి మీ పరిస్థితి’ అంటూ వారి ముఖాల్లోకి పరీక్షగా చూస్తూ అడిగారు. ఆ ముగ్గురూ చాలా తేలిగ్గా తీసుకుని చప్పరించేశారు. ఆ జెట్‌ విమానంలో మాతో కలిపి 171 మంది ఉన్నారు. మేం తప్ప అంతా వొణికిపోయిన వారే. గాల్లోకి వెళ్లాక విమానంలో ప్రెషర్‌ లేకపోతే ఏమవుతుంది? అదే అయింది. అంటూ వాళ్లు ఒకర్నొకరు చూసుకు న్నారు.

శ్రోతలకేమీ అర్థం కాలేదు. ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత, ‘మీరు చాలా అదృష్టవంతులు’ అన్నారంతా అభినందన పూర్వకంగా. వాళ్లు అదేం కాదన్నట్టు చూశారు. ‘మేం నాలుగేళ్లకి పైగా ఏపీ స్టేట్‌ సర్వీస్‌లో ఉన్నాం. అందుకని ఎఫెక్ట్‌ కాలేదు’ వాళ్ల మాటలెవరికీ అర్థం కాలేదు. ముగ్గుర్లో ఒకా యన అందుకుని ‘గడిచిన యాభై నెలలుగా మా సీఎంగారు వివిధ అంశాల మీద, టెక్నాలజీలపైన, మోదీ రాక్షసత్వంమీద, చారిత్రక అవసరాల మీద చేసిన భారీ నుంచి అతి భారీ ప్రసంగాలని వినడా నికి మా శరీరాలు అలవాటు పడ్డాయి. ఈ బోడి బోయింగ్‌ ప్రెషర్‌ మమ్మల్నేమీ చేయలేకపోయింది. నవరంధ్రాలు ఆ విధంగా పనిచేసే స్థితిలో స్థిరంగా ఉన్నాయి. డాక్టర్లు మమ్మల్ని పరీక్షించి, మీకు ‘బారోట్రామా ఇమ్యూనిటీ’ వందశాతం వచ్చేసింద న్నారు. ఈ సీఎం థెరపీని విమానయాన శాఖ ప్రవే శపెడుతుందేమో..’నంటూ బయటకు నడిచారు.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top