ఎవరి వెర్రి వారికి..

Gollapudi Maruthi Rao Guest Column On Political Parties - Sakshi

జీవన కాలమ్‌

ఎన్నికైన రాజకీయ పార్టీలే తప్పుడు ప్రతిష్ట కోసం అనవసరమైన ‘రంగుల వల’లో తమ ప్రత్యేకతల్ని చాటుతుండగా–అంబేడ్కర్‌కీ, వివేకానందకీ రంగులు నిర్ణయించే నా దేశంలో ఈ మాత్రం ‘వెకిలితనా’నికి నాకు హక్కు లేదా?

నాకు తెలిసి– ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ రాజ కీయ పార్టీ, నాయకులు ‘రంగు’ గురించి మాట్లాడిన సందర్భం తెలీదు. ఎవరైనా తోవ తప్పినప్పుడు మనకో నానుడి ఉంది: ‘ఇన్నాళ్లకి అతని అసలు రంగు బయట పడింది’ అనడం. ఇప్పుడు అక్షరాలా మన రాజకీయ నాయకుల రంగు బజారు కెక్కింది. అహంకారం, అధికారం, తప్పుడు ప్రాథ మ్యాలు తమ తమ అసలు రంగుల్ని భూతద్దంలో చూపు తున్నాయి.
మా ఆవిడకి ఓ అలవాటు ఉంది. ఏదైనా ఆమెకి నచ్చనిది జరిగిందనుకోండి: ఆవిడ సమీక్ష ఆ నచ్చక పోవడం మీద ఉండదు. ‘మొన్న మీరు ఎర్రట్ట పుస్తకం ఒళ్లో పెట్టుకుని గంటలకొద్దీ చదివారు కదా? అందుకూ కడుపునొప్పి’ అంటుంది. దీనికి ఒక వివరణ ఉంది. జరిగే ప్రతీ అనర్థానికీ తనకి ‘నచ్చని’ అంశాన్ని జొర బెట్టడం ఆవిడ ప్రత్యేకత. ఇది సరిగ్గా ప్రస్తుత రాజకీయ వర్గాలకు వర్తిస్తుంది. కాంగ్రెస్‌ హయాంలో– దాదాపు 65 సంవత్సరాలలో ఏనాడూ– కాంగ్రెస్‌ చేసిన ఏ అన ర్థాన్నీ.. వారి పార్టీ– చిహ్నం కాంగ్రెస్‌ జెండాలోని కాషా యం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్ని ఎత్తిచూపుతూ మన మేధావులు, పాత్రికేయ మిత్రులు తప్పుపట్టలేదు. మరి ఇవాళ మంత్రిగారు తుమ్మారనుకోండి. అందులో ‘కాషాయ’ ఛాయలు కనిపిస్తాయి. రంగు పదవిలోకి వచ్చి నాలుగేళ్లయింది. కర్ణాటకలో బస్సు యాక్సిడెంట్‌ జరిగితే ‘ఫలానా చోట జరిగింది’ అంటారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగితే ‘యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్రంలో ఇప్పటికి 165వ యాక్సిడెంట్‌’ అంటారు.

ఇప్పుడు ‘రంగు’ విజృంభించింది. పశ్చిమ బెంగాల్‌ దీదీ మమతా బెనర్జీ రెచ్చిపోయి రాష్ట్రంలో ఉన్న ప్రతీ స్కూలుకీ తెలుపు, నీలిరంగు పులమాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ఖర్చు కేవలం రూ. 500 కోట్లు. ‘ఇంత కంటే ఆ రూ. 500 కోట్లతో పిల్లల చదువులకు ఉపయోగపడే ఏ ప్రణాళికనయినా పూనుకోరాదా? అని కలర్‌ బ్లైండ్‌నెస్‌ ఉన్న ఒకాయన అన్నారు. అయ్యా! ఇది ముఖ్యమంత్రిగారి దూరదృష్టికి ఉదాహరణ కాదు. కాషాయం మీద వారికున్న ఏహ్యతని ప్రదర్శించుకునే అవకాశం. దానికి ఇంత ఖర్చా అని మరొక ప్రశ్న. దాని దేముంది. తమరు కోపంతో చెప్పుతో కొట్టారు. మరొ కాయన కోపంతో రత్నాల హారంతో కొట్టారు.
దీదీకి వివేకానంద అంటే విముఖత ఉన్నదనీ, తత్కారణంగానే ప్రపంచ ప్రఖ్యాతిని గడించి ఎందరికో విద్యా దానం చేస్తున్న రామకృష్ణ మిషన్‌ రంగును కూడా మారుస్తున్నారని కొందరి విమర్శ. ఈ రంగు మార్పిడిని రామకృష్ణ మిషన్‌ సంస్థ వ్యతిరేకించింది. ఇప్పుడు దీదీకి నాదొక సలహా ‘అమ్మా! తమరు రామకృష్ణ మిషన్‌ సంస్థల రంగు మార్చకుండా ఏకంగా స్వామి వివేకా నంద ‘రంగు’నే మారిస్తే తమ అంతర్జాతీయ కీర్తి ద్విగు ణీకృతమౌతుంది. ఒక ఆర్డినెన్స్‌ ద్వారా స్వామి కాషాయ బట్టల రంగుని ఊదారంగుగా మార్చండి. వారి తల పాగాకు తెల్లరంగు వేయించండి. అప్పుడు చచ్చినట్టు రామకృష్ణ మిషన్‌ తన రంగుని మార్చుకుంటుంది. లేదా రాష్ట్రంలో ఏకంగా కాషాయ రంగుని బహిష్కరించండి’.

అలాగే కేరళ ప్రభుత్వం వారిచే నెహ్రూకి ఎర్ర రంగు దుస్తుల్ని నిర్దేశించండి. రాష్ట్రంలో గవర్నమెంటు కార్యాలయాలన్నింటికీ ఎర్ర రంగును పూయించమ నండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశం రంగులు మార్చుకుంటూ ఉంటుంది.ఈ మధ్యలో ఒకాయన అంబేడ్కర్‌ రంగు నీలి రంగుగా వక్కాణించారు. ఆ లెక్కన దేశ పిత గాంధీకి నీలిరంగు ధోవతి, గులాబీ రంగు చేతికర్రనూ నిర్దేశిం చవచ్చు. ఈ దేశంలో కళ్లముందు కనిపించే రంగు అప్పటి పాలక  వ్యవస్థ అసలు రంగుని ప్రతిఫలిస్తూ ఉంటుంది.

ఇప్పుడు వచ్చిన చిక్కల్లా బీజేపీ నాయకుల ‘రంగు’ ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్‌ రంగూ కాషా యం కావడం. మోదీ పదవిలోకి వచ్చిన కారణానికి ఈ దేశంలో ప్రతి టీ కొట్టువాడికీ కొత్త ప్రాధాన్యం వచ్చి నట్టు– బీజేపీ ఛాయలు తమ మాతృసంస్థల రంగు అయిన కారణానికి ‘కాషాయం’ కషాయంలాగ తయా రైంది. మోదీ పదవిలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో సమూలమైన మార్పులు చేసినట్టు– కరెన్సీ రద్దులాగ రాత్రికి రాత్రి గవర్నమెంటు రంగుని మార్చేస్తే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. చక్కగా కాకి నలుపు రంగుని వాడమనండి. లేదా పచ్చరంగుని వాడ మనండి.

ఎవరు బాబూ! తమరు ఏదో అంటున్నట్టున్నారు? ‘ఏమిటి ఈ అర్థంలేని ప్రేలాపన అనా? బాబూ! ఈ దేశంలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, మేధా వులైన పాత్రికేయులు ప్రణాళికలను వదిలి ‘రంగు’ బాధలు పడుతుండగా, ఎన్నికైన గొప్ప రాజకీయ పార్టీలే నేల విడిచి తప్పుడు ప్రతిష్ట కోసం అర్థంలేని, అనవసరమైన ‘రంగుల వల’లో తమ ప్రత్యేకతల్ని చాటుతుండగా– అంబేడ్కర్‌కీ, వివేకానందకీ రంగులు నిర్ణయించే నా దేశంలో ఈ మాత్రం ‘వెకిలితనా’నికి నాకు హక్కు లేదా? తమరు చిత్తగించండి.


వ్యాసకర్త
గొల్లపూడి మారుతీరావు
సినీ  విశ్లేషకులు, నటులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top