ఒకే పతాకం కిందకు వస్తారా?

Can The CPM And CPI Merge - Sakshi

హైదరాబాద్‌ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్‌ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’ అన్న లెనిన్‌ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్‌ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు?

హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు కార్యకర్తలలో, అభిమానులలో కొత్త ఆశలను చిగురింపచేశాయి. ఏ మహాసభ అయినా విజయవంతమైనదా, లేదా అని తేల్చుకోవడానికి పాల్గొన్న ప్రతినిధులు, చర్చల స్థాయి, చర్చించుకున్న అంశాల ప్రాముఖ్యం, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం, తదుపరి మహాసభల వరకు ప్రధాన కార్యదర్శి సహా వివిధ స్థాయిలలో ఎన్నికైన కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో, వాటి పొందిక వంటి అంశాలను గమనిస్తాం. చివరిరోజు బహిరంగ సభ, అది ఇచ్చిన ఉత్సాహం, ప్రదర్శన తీరుతెన్నులు సామాన్య ప్రజానీకంలో, అభిమానులలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విధంగా చూస్తే హైదరాబాద్‌ సభలు నిర్ణయాత్మకమైనవే. ఇందుకు తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాలి. 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న ‘సమైక్య’ నినాదం సీపీఎంను ప్రజలకు దూరం చేసింది. ఫలితం ఏదైనా, సిద్ధాంతపరంగా పార్టీ వ్యవహరించిందని నాయకత్వం జబ్బులు చరుచుకోవచ్చు. కానీ ఆపరేషన్‌ విజయవంతమైనా, రోగి దక్కలేదన్న చందంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి తయారైంది. కానీ పార్టీ ఆ∙నినాదానికైనా కట్టుబడి ఆంధ్రలో, హైదరాబాద్‌ పరిసరాలలో జన సమీకరణ కూడా చేయలేదు. ఒక నినాదం ఇచ్చి ఆపై ఇంత నిష్క్రియాత్వంతో పార్టీ వ్యవహరించడం ఇదే మొదటిసారి. పైగా సుందరయ్యగారి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’నినాదాన్ని సమైక్య ఆంధ్ర వాదనకు పునాదిగా చూపడం మరీ చిత్రం. సుందరయ్యగారిది అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ (1946) వైఖరి. తెలుగు ప్రజలంతా కలసి నూతన ప్రజాస్వామిక (ప్రజా) రాజ్యం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. సుందరయ్యగారి చివరిదశలో వెంట ఉండి కొన్ని అంశాలను నేరుగా వారి నుంచే గ్రహించే అవకాశం నాకు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం తరువాత, ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలంగాణకు మేలు జరగలేదు. ప్రాజెక్టులు, ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలలో ఆ ప్రాంతం వెనుకబడిపోవడం ఆయనను బాధించింది. మద్రాస్‌ అపోలో ఆస్పత్రిలో ఉండగా కలుసుకోవడానికి వచ్చిన తెలంగాణ నేతలతో ఆ ప్రాంత వెనుకబాటు తనం మీద పోరాడాలని సూచించారు. 

అంతటి దయనీయ స్థితి నుంచి అక్కడి సీపీఎం శాఖ కోలుకోవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవం పొందగలదన్న విశ్వాసం కూడా మహా సభల ద్వారా కల్పించారు. ఇందుకు పార్టీ విభాగం, కార్యదర్శి వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయమైనది. మనం చెప్పేది నాయకత్వం వినిపించుకోదని భావిస్తూ పార్టీ పట్ల నిరాశా నిస్పృహలతో ఉన్న మేధావులను కలసి చర్చించారు. త్యాగనిరతిలో, ప్రజలకు రక్షణగా కార్యకర్తలు ఎలా ఉండాలో మీకు తెలుసు. లోపాలు ఉంటే చెప్పండి. పొరపాట్లు ఉంటే చెప్పండి. సాధ్యమైనంతవరకు సరిదిద్దుకుందాం అని చెప్పారు. ఆ పార్టీ నేత చేపట్టిన విస్తృత మహాజన పాదయాత్ర ఫలితంగా ప్రస్తుతం టీమాస్‌ (తెలంగాణ ప్రజాసంఘాల వేదిక), బీఎల్‌ఎఫ్‌ (బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌) వంటి రాజకీయ నిర్మాణాల ద్వారా ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కమ్యూనిస్టుల జైత్రయాత్రకు బాటలు వేస్తుందనీ, పార్టీని మళ్లీ ప్రజల వద్దకి చేరుస్తుందనీ విశ్వసిద్దాం. లాల్‌–నీల్‌ నినాదం వేళ్లూనుకుంటుందని ఆశిద్దాం. 

మీడియాలో వచ్చిన మేరకు మహాసభల చర్చల ధోరణి ఇలా ఉంది. లాల్‌–నీల్‌ ఐక్యత ఆవశ్యకత గురించి ప్రతినిధుల మధ్య కొంత చర్చ జరిగింది. అంతకంటే ప్రధానంగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవచ్చునా, చేసుకోకూడదా? లేదా ఈ రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయంగా మరొక సంఘటనను ప్రజాస్వామిక, లౌకిక శక్తులతో కలసి ఏర్పాటు చేయాలా? లేదా? అనే అంశంపైనే చర్చ జరిగింది. ఈ అంశం మీదే ప్రస్తుత, మాజీ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారత్‌ల మధ్య పోటీ వచ్చిందనీ, బలాబలాలు గత ఆరుమాసాలుగా మారుతున్నాయనీ మీడియా ప్రచారం చేసింది. ఓటింగ్‌ జరుగుతుందని, ప్రధాన కార్యదర్శి మార్పు కూడా ఉండవచ్చునని కూడా కథనాలు వెలువడినాయి. మీడియాకు ఇలాంటి అంశాల మీద ఉన్న దృష్టి వాస్తవికతపై ఉండకపోవచ్చు. నిజానికి ఇలాంటి ప్రశ్న నాలుగు దశాబ్దాల క్రితమే తలెత్తింది. అత్యవసర పరిస్థితిని విధించి, నియంతృత్వంతో పాలించిన ఇందిరా గాంధీనీ, ఆమె పార్టీనీ ఓడిం చేందుకు అనుసరించవలసిన విధానం గురించి సీపీఎం అఖిల భారత వ్యవస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య చొరవ, దూరదృష్టి కారణంగా జలం ధర్‌ మహాసభలో తీవ్ర చర్చ జరిగింది. మతతత్వ బీజేపీతో ఎన్నికల అవగాహనకు కూడా రావాలని మిగిలిన పొలిట్‌బ్యూరో భావించింది. చివరకు ఏకీకృత ప్రతిపాదన ద్వారా అవగాహనకు వచ్చి పదో మహాసభ పార్టీ ఐక్యతను కాపాడుకుంది. 

నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఈ 22వ మహాసభలు చర్చ తీవ్ర స్థాయిలోనే జరిగి, తుదకు మతతత్వం, నేటి మోదీ–షా దుష్టపాలనను అంతం చేయడమే అత్యంత కీలకమన్న విషయంలో ప్రతి నిధుల విజ్ఞత పుణ్యమా అని ఏకీకృత అంగీకారానికి నాయకత్వం రాగలిగింది. అలాగే ఎన్నికలలో అనుసరించవలసిన విధానం గురించి కూడా. కాంగ్రెస్‌తో అవగాహన, వివిధ రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను గమనించుకుంటూ కీలక కర్తవ్యాన్ని నిర్వహించి ఎన్నికల తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. ఇది కూడా అభినందనీయమే. 
నేడు దేశంలో దాదాపు మూడు డజన్లుగా చీలి పోయిన కమ్యూనిస్టు ఉద్యమ సంస్థల గురించి మహాసభలు లోతుగా చర్చించి ఉండవలసింది. కమ్యూనిస్టుల ఐక్యత ఎందుకు సాధ్యం కావడం లేదో, కనీసం పార్లమెంటరీయేతర పోరాటాలను సమన్వయం చేసుకుని పురోగమించాలన్న అవగాహనతో విభేదాలు అంతగా లేని సీపీఐ, సీపీఎంలు విలీనం దిశగా ఎందుకు ముందడుగు వేయలేక పోతున్నాయో వామపక్ష మేధావులకు సైతం అంతుపట్టడం లేదు. దశాబ్దం క్రితమే నల్లగొండలో నాటి సీపీఐ రాష్ట్ర మహాసభలలో సౌహార్ద్ర సందేశం ఇచ్చిన నేటి సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు ‘సీపీఎం, సీపీఐలు విడివిడిగా జరుపుకునే మహాసభలు ఇవే. వచ్చే రాష్ట్ర మహాసభలు ఒకే మహాసభగా జరుగుతాయ’ని ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించినట్టు గుర్తు. కానీ హైదరాబాద్‌ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్‌ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’అన్న లెనిన్‌ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్‌ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు?

మరొక ప్రధాన అంశం ప్రస్తావించడం కూడా అవసరం. సుందరయ్యగారు కార్యదర్శిగా ఉండగా నాటి కార్యదర్శి వర్గ సభ్యులు లావు బాలగంగాధరరావును సహాయ కార్యదర్శిగా నియమించాలని ఒక సూచన వచ్చింది. అది అనవసరమని, సుందరయ్య కార్యదర్శిగా ఉండగా కార్యదర్శివర్గంలోని వారంతా సహకరించగలరని ఉద్దరాజు రామం వాదించారు. కానీ సుందరయ్యగారే, సహాయ కార్యదర్శి అని పేరు పెట్టడంలో తదుపరి కార్యదర్శి ఆయనే అనీ కాదు. ఆయననే కార్యదర్శిగా చేయకూడదని కూడా కాదు అని చెప్పారు. ఎల్‌బీజీ తరువాత కార్యదర్శి అయ్యారు (అప్పటికి సుందరయ్య కన్నుమూశారు). ఆ తరువాత అఖిల భారత మహాసభ సందర్భంగా పొలిట్‌బ్యూరోలోకి ఎల్‌బీజీనే తీసుకున్నారు. ఎల్‌బీజీ కంటే మోటూరి హనుమంతరావు అన్ని విధాలా అర్హుడనీ, ఆయనను కాదని ఎల్‌బీజీని ఎందుకు తీసుకున్నారని నేను పొలిట్‌బ్యూరోకి లేఖ రాశాను. ‘ఎల్‌బీజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి. పొలిట్‌బ్యూరో సాధికారితకోసం తీసుకున్నాం’అని నాకు సమాధానం వచ్చింది. 22వ మహాసభల అనంతరం కూడా సీపీఎంను అలాగే అడగవలసి ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సభలు దిగ్విజయంగా జరిగాయి. అలాంటి విభాగానికి పొలిట్‌బ్యూరోలో సాధికారతకు సభ్యత్వం ఇచ్చి ఉంటే బాగుం డేది. బీవీ రాఘవులు ఆంధ్రప్రదేశ్‌ తరఫున పొలిట్‌బ్యూరోలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సాధికార ప్రతినిధి కాలేడు కదా! పైగా వీరభద్రం కూడా అందుకు అర్హుడే! పార్టీ నిర్మాణం, కార్యక్రమాల సక్రమ నిర్వహణ సాఫీగా సాగేందుకు ఇలాంటి సున్నిత అంశాలను కూడా పార్టీ దృష్టిలో ఉంచుకోవడం అవసరం.


డాక్టర్‌ ఏపీ విఠల్‌ 
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top