సభావేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన సీపీఐ
తెలంగాణ సాయుధ పోరాటం, విద్యుత్ ఉద్యమాల్లో కీలక పాత్ర
నేడు ఖమ్మంలో సీపీఐ శత వసంతాల ముగింపు సభ
హాజరుకానున్న జాతీయస్థాయి నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ముగింపు ఉత్సవాలకు కమ్యూనిస్టుల ఎర్రకోట ఖమ్మం ముస్తాబైంది. కాలపరీక్షకు తట్టుకొని రెపరెపలాడుతున్న ఎర్రజెండా నూరేళ్ల పండక్కి కమ్యూనిస్టు శ్రేణులు కదంతొక్కుతున్నాయి. ఆదివారం నుంచి ఈనెల 21 వరకు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను ఖమ్మంలో నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఖమ్మంలో నిర్వహిస్తున్న ర్యాలీ, భారీ బహిరంగసభ ద్వారా ఎర్రజెండాకు పూర్వ వైభవం తీసుకురావాలని సీపీఐ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. బహిరంగసభకు ఆ పార్టీ జాతీయస్థాయి నేతలతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు. ఈనెల 19 నుంచి 21 వరకు జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎంఏ బేబీ సహా 40 దేశాలకు చెందిన వామపక్ష పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు.
భారత గడ్డపై ప్రస్థానం
ఎంఎన్ రాయ్, అబానీ ముఖర్జీ వంటి నేతలు 1920లోనే తాష్కెంట్‌లోనే కమ్యూనిజానికి పునాదులు వేయగా, భారత గడ్డపై సత్యభక్త నేతృత్వంలో 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో పార్టీ రూపుదిద్దుకుంది. ’సంపూర్ణ స్వరాజ్’ కావాలని కాంగ్రెస్ కంటే ముందే డిమాండ్ చేసిన ఘనత కమ్యూనిస్టులదే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సీపీఐ రాజకీయంగా బలమైన పార్టీగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది. 1957లో కేరళలో ఈఎంఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఇది భూ సంస్కరణలు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 1964లో పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిన తరువాత నుంచి ఎర్రజెండా బలహీనపడటం మొదలైంది. రాజకీయ ప్రాధాన్యతలో క్రమక్రమంగా పార్టీ క్షీణిస్తూ వచ్చినప్పటికీ, పోరాటాల్లో ఆ పార్టీ ముద్ర ఇప్పటికీ బలంగా కనిపిస్తుంది.
తెలంగాణ సాయుధ పోరాటం
తెలుగు నేలపై కమ్యూనిస్టుల చరిత్ర అంటే అది రక్తం చిందించిన పోరాటాల చరిత్ర. నిజాం నవాబు ఆగడాలకు, దొరల గడీల అరాచకత్వానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం (1946–1951) కమ్యూనిస్టుల అతిపెద్ద విజయం. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి వంటి ఉద్ధండులు ఈ పోరాటాన్ని ముందుండి నడిపారు. 1946 జూలై 4న కడివెండిలో దొడ్డి కొమరయ్య అమరత్వం ఈ పోరాటానికి నిప్పుకణిక అయింది. చాకలి ఐలమ్మ భూమిని కాపాడటానికి ’సంఘం’ (కమ్యూనిస్టులు) అండగా నిలిచింది. 3000 గ్రామాలను విముక్తం చేయడం, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. దేశ చరిత్రలోనే అతిపెద్ద రైతాంగ పోరాటంగా నిలిచింది. దీనికి నాయకత్వం వహించింది కమ్యూనిస్టు పార్టీయే.
ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ప్రస్థానం
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులోనూ, విశాలాంధ్ర ఉద్యమంలోనూ కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారు. 1952 ఎన్నికల్లో రాష్ట్రంలో కమ్యూనిస్టులు భారీ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఏళ్లపాటు సీపీఐ బలమైన ప్రతిపక్షంగా పనిచేసింది. చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి, సురవరం సుధాకరరెడ్డి వంటి దిగ్గజ నాయకులు ఇక్కడి నుంచే జాతీయ స్థాయికి ఎదిగారు. సీహెచ్ రాజేశ్వర్ రావు, దేశిని చినమల్లయ్య, చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు వంటి నాయకులు రాష్ట్రంలో సీపీఐ ఎదుగుదలలో తమ వంతు పాత్ర పోషించారు. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ బలమైన రాజకీయశక్తిగా కొనసాగింది. పొత్తు రాజకీయాల్లో పార్టీ కుంచించుకుపోయినా, రాజకీయంగా పల్లెలు, పట్టణాల్లో ఎర్రజెండా ఉనికి ఇప్పటికీ చాటుతోంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా సీపీఐ తనదైన ముద్ర వేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో కూడా సీపీఐ కీలక పాత్ర పోషించింది.
లౌకికవాదాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా..
వందేళ్ల వేళ ఖమ్మం నగరం ఎర్రకోటను తలపిస్తోంది. దేశంలో మితవాద శక్తులు బలపడుతున్న తరుణంలో, లౌకికవాదాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సభ జరుగుతోంది. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభంపై గళమెత్తడం. రాబోయే రోజుల్లో వామపక్ష ఐక్యతను చాటడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం.
––కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
పుదుచ్చేరి నుంచి సైకిల్‌పై..
ఖమ్మంమయూరి సెంటర్: సీపీఐ వందేళ్ల సభలో పాల్గొనేందుకు తమిళనాడుకు చెందిన పార్టీ నాయకులు సైకిల్ యాత్రగా ఖమ్మం చేరుకున్నారు. తమిళనాడు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవసహాయం, కార్యవర్గ సభ్యుడు శరవణన్ పుదుచ్చేరి నుంచి ఈనెల 8న సైకిళ్లపై బయలుదేరారు. రోజుకు 90 కి.మీ. మేర 750 కి.మీ. ప్రయాణించి శనివారం ఖమ్మం వచ్చారు. వీరికి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ స్వాగతం పలికారు.


