అచ్చమైన భారత రత్నం

Bandaru Srinivasa Rao Analysis On PV Narasimha Rao Administration - Sakshi

ఆర్థిక రంగంలో సంస్కరణలకు ఆద్యుడు, దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన యోధుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా నేటి నుంచి ఒక ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ముదావహం. అత్యంత అదృష్టవంతుడు, బహు దురదృష్టవంతుడు అయిన  రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే చప్పున తట్టే పేరు  పీవీ నరసింహా రావు. ఆయన  ప్రధానిగా ఉన్నంతకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తిం చారు. సంఖ్యాబలం  బొటాబొటిగా వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై వుంచిన ‘అపర చాణక్యుడ’ని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయి, పదవి నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయనను  తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. 

అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. గాంధీ, నెహ్రూల కుటుం బానికి చెందని ఒక కాంగ్రెస్‌ నాయకుడు  భారత ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో, మేధస్సుతో పూర్తికాలం అయిదేళ్ళు నడపడమే కాదు, అప్పటికే ఆర్థికంగా కునారిల్లుతున్న దేశాన్ని ఒడ్డున పడేసిన కృతజ్ఞత కూడా ఆయనకు తన సొంత పార్టీ నుంచి లభించలేదు. ఇదీ కాంగ్రెస్‌ పార్టీలో కృతజ్ఞతకు ఉన్న స్థానం. ఒక సాధారణ నాయకుడు చనిపోయినా అతడి పార్థివదేహాన్ని  పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు దర్శించి  కడపటి వీడ్కోలు ఇచ్చేందుకు వీలుగా పార్టీ ఆఫీసులో కొంతసేపు ఉంచడం అనేది అన్ని పార్టీలు అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం. కానీ కాంగ్రెస్‌ అధిష్టానానికి ఆయన పట్ల ఆ మాత్రం కనీస మర్యాద చూపాలన్న సోయికూడా లేకుండాపోయింది. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాద్‌ వచ్చారు.

మాజీ ప్రధాని హోదాలో రాజ్‌భవన్‌ గెస్టు హౌస్‌లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావుడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీమార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయ నాయకులు. ఆ వైభోగం వర్ణించతరమా? అన్నట్టు ఉండేది. మాజీ ప్రధానిగా పీవీ  రాజభవన్‌లో ఉన్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్‌ కొలీగ్‌ ఆర్వీవీ కృష్ణారావుగారు గవర్నర్‌ రికార్డింగ్‌ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్‌భవన్‌ గెస్ట్‌హౌస్‌ మీదుగా తిరిగివెడుతూ అటువైపు తొంగి చూశాం. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావుడి కనిపించకపోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా  ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగుపెట్టాం. అడుగుపెట్టిన తరువాత, మా ఆశ్చర్యం రెట్టింప యింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌బాల్‌  మ్యాచ్‌ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్‌ చేశామేమో అన్న ఫీలింగ్‌తోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నావైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది.

ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీగారు  ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని ఒంటిచేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరువాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్‌ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచినా ఈ చక్కని జ్ఞాపకం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.

మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్ర మంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నీరవ నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి  వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.‘మాస్కో ఎందుకయ్యా!

వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. కనీసం ఆయన శత జయంతి సంవత్సరంలో అయినా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటిస్తే, ఆ అత్యున్నత పురస్కారానికే శోభస్కరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా  ఆ మహనీయుడికి జాతి యావత్తూ కృతజ్ఞత తెలిపినట్టవుతుంది కూడా. వ్యాసకర్త, సీనియర్‌ జర్నలిస్టు: బండారు శ్రీనివాసరావు, మొబైల్‌ : 98491 30595 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top