విద్యా విధానం అమలుకు తొందరేల?

Article On National Education Policy 2019 - Sakshi

అభిప్రాయం  

భారత ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం జాతీయ విద్యా విధానం 2019 అనే నివేదిక ముసాయిదాను విడుదల చేసింది. దాని మీద ప్రజల అభిప్రాయాలను తెలపాలని కోరింది. అయితే ఈ నెలాఖరుకల్లా అభిప్రాయాలు తెలపాలని విద్యాశాఖ కోరినట్లు తెలుస్తున్నది. ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఇస్రో పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ కె. కస్తూరి రంగన్‌ అధ్యక్షులుగా, ఎనిమిది మంది సభ్యులుగా భారత ప్రభుత్వం నియమించిన కమిటీ 2018 డిసెంబర్‌ 15వ తేదీన నివేదిక సమర్పించింది. వెంటనే ఎన్నికలు వచ్చినందువల్ల ఈ నివేదికను ప్రభు త్వం అప్పుడు విడుదల చేయలేదు. ఎన్నికలు పూర్తయిన ఈ నెల మొదట్లోనే విడుదల చేసింది. 

ఈ ముసాయిదా చాలా పెద్దది. 480 పుటలున్నాయి. నివేదిక ఆంగ్ల, హిందీ భాషలలో మాత్రమే ఉంది. ప్రతి పౌరుడినీ చర్చలో పాల్గొనమని ప్రభుత్వం కోరింది. అందరూ చర్చలో పాల్గొనాలంటే, ఈ ముసాయిదా అన్ని భారతీయ భాషలలో అనువాదమై భారతీయులందరికీ అందుబాటులోకి రావాలి. అందువల్ల ఈ ముసాయిదాను నామమాత్రపు చర్చకు పెట్టి గబగబా అమలు చేయాలని ప్రభుత్వం తొందరపడవద్దు. ముసాయిదా అన్ని భారతీయ భాషలలోకి అనువాదమై రావాలి. అప్పుడు దానిని చర్చకు పెట్టాలి. ముసాయిదాను అర్థం చేసుకోవడానికి అవసరమైనంత సమయం ఇవ్వాలి. తర్వాతనే ప్రజల అభిప్రాయాలకనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈ ప్రణాళికలు అమలు చేయాలి. 

ఈ ముసాయిదాలో నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి. మొత్తం 23 అధ్యాయాలు, 14 అనుబంధాలున్నాయి. ప్రతి అధ్యాయానికీ ఆకర్షణీయమైన శీర్షిక ఉంది. అందమైన వివరణ ఉంది. ఉత్సాహం కలిగించే నిర్వచనాలు ఉన్నాయి. నిర్మాణాత్మకమైన భాష ఉంది. ప్రాథమిక విద్య నుంచి అత్యున్నత స్థాయి విద్య దాకా విద్యా సంస్థల ప్రస్తుత స్థితిగతులను పేర్కొంటూ, ఆయా అంశాలలో ఇప్పుడు ఏమి చేయబోతున్నారో నివేదిక ముసాయిదా చెబుతున్నది. అధ్యాపకులు, వారికి శిక్షణ, విద్యార్థులు, వారికి సౌకర్యాల కల్పన, పాఠ్యాంశాల పునర్నిర్మాణం, ఇంటర్‌ సప్లిమెంటరీ విద్య, లిబరల్‌ ఆర్ట్స్‌వంటి అనేక విషయాలను ఈ ముసాయిదా ప్రతిపాదించింది. పైపైన చూస్తే ఈ ముసాయిదాను ఆమోదించడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదనిపిస్తుంది. కానీ లోపలకు వెళితే, దీనిలో లోతుగా చర్చించాల్సినవి చాలా ఉన్నా యని తెలుస్తుంది. ఈ ముసాయిదాలోని పదజాలం చాలా ప్రజాస్వామికంగా ఉన్నట్లు కని పిస్తుంది. కానీ, ఆ పదాల పరమార్థం వేరుగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ ముసాయిదాలో గతంపట్ల వ్యామోహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సైన్సుకు, మతానికి ముడివేసే ప్రయత్నం కనిపిస్తుంది. అన్నీ వేదాల్లో ఉన్నాయని రుజువు చేసే సంకల్పమూ కనిపిస్తుంది. చరిత్ర పట్ల భ్రమలు పెంచే దృష్టి తొంగిచూస్తున్నది. చాలా చోట్ల అశాస్త్రీయ, అచారిత్రక ఆలోచనలు కనిపిస్తున్నాయి. 

అందువల్ల ఈ ముసాయిదా మీద దేశ వ్యాప్తంగా అనేక స్థాయిలలో చర్చ జరగాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో చర్చ జరగాలి. ప్రతిపౌరుడూ చర్చలో పాల్గొనాలని కోరినందున పౌరులందరికీ వాళ్లకు తెలిసిన భాషలోకి ఈ ముసాయిదా అనువాదమై రావాలి. గ్రామస్థాయి దాకా ఈ చర్చ జరగాలి. ఈ చర్చ లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. చర్చలలో వ్యక్తమయ్యే అభిప్రాయాలను ప్రభు త్వం నిజాయితీగా స్వీకరించి తన ప్రణాళికలో చేర్చుకోవాలి. ఈ ముసాయిదా మీద ప్రసార, ప్రచార మాధ్యమాలలో విస్తృతంగా చర్చలను ఏర్పాటు చెయ్యాలి. ఈ చర్చలలో అధ్యాపకులను, విద్యారంగ నిపుణులను, మేథావులను నిమగ్నం చేయాలి. చర్చలు సమగ్రంగా జరిగేదాకా, ప్రజాభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తం అయ్యే దాకా ఆగాలి. అప్పటి దాకా ప్రభుత్వం ఓపిక పట్టాలి. ముసాయిదాను త్వరత్వరగా అమలు చేయకుండా నెమ్మదిగా వ్యవహరించాలి.


రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి

వ్యాసకర్త ఎస్కే యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top