ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. ఒకే నేత!

ABK Prasad Article On One Nation One Election - Sakshi

రెండో మాట

రాజ్యాంగం దేశ పౌరులకు హామీ పడిన సప్త స్వాతంత్య్రాలను, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛ సహా పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా పౌర స్వేచ్ఛను కుదించడాన్ని నియంతృత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక సంప్రదాయంగా పేర్కొన్న రాజ్యాంగ వ్యవస్థలను నీరుకార్చే దిశగా పాలకవర్గాలు వేగవంతంగా కదలబారుతున్నాయి. 2019లో లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికల పేరిట నరేంద్ర మోదీ – అమిత్‌ షాల నాయకత్వంలో నిర్వహించిన ఎన్నికలను శ్రద్ధగా పరిశీలించేవారికి – రానున్న రోజుల్లో, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వ్యూహాన్ని అమలు జరిపే ఉద్దేశం మోదీకి ఉందని అర్థమవుతుంది. తద్వారా 72 ఏళ్లనాడు భారత ప్రజలు అశేష త్యాగాలతో రూపొందించుకున్న గణ (జన)తంత్ర రిపబ్లిక్‌ వ్యవస్థ రూపురేఖలనే మార్చి ‘‘హిందూ రిపబ్లిక్‌’’ రాజ్యాంగ చట్టంతో బలవంతంగా ముందుకు నెట్టుకుపోయే సూచనలు కన్పిస్తున్నాయి.

‘‘ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే ప్రధాని మోదీ నినాదం, ప్రతిపాదన బహుళ రాష్ట్రాలతో కూడిన ఫెడరల్‌ (సమాఖ్య) రాజ్యాంగ స్ఫూర్తినే నాశనం చేస్తుంది. అలాంటి చట్రం భిన్న దృక్పథాలతో కూడిన ప్రాంతీయ రాజకీయ పక్షా లను సమాఖ్య స్ఫూర్తినుంచి గెంటేయడానికి దారితీస్తుంది. మోదీ ప్రతి పాదన స్వభావంతోనే ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది’’
                                                      – ప్రజాస్వామ్య సంస్కరణల సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు జగదీష్‌ చొక్కార్, రాజ్యసభ డీఎంకే సీనియర్‌ సభ్యుడు తిరుచి శివ ఇంటర్వూ్య (హిందూ 28–06–2019)
‘‘దేశంలో అన్ని వ్యవస్థలూ విధ్వంసమయ్యాయి. అలా జరిగిన చోటే మళ్లీ జనంలో విశ్వాసం కూడగట్టే ప్రయత్నం జరగాలి. ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయిన ప్రభుత్వాలు కొత్త తరహా ప్రచారయంత్రాంగాన్ని ఎంచు కుని ముందుకు సాగుతున్నాయి. ప్రశ్నించే గొంతును నులిమేసే ఉద్దేశం తోనే ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్రంలో మోదీ ఏం చేస్తున్నారో, రాష్ట్రాల్లో కొందరు ముఖ్యమంత్రులూ అవే చర్యలకు దిగు తున్నారు. భారతదేశం విభిన్న సంస్కృతులకు కేంద్రం కానీ బీజేపీ ప్రభుత్వం దేశమంతా ఒకే సంస్కృతిని రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. బహుపరాక్‌’’
                                                                                                                             – ప్రముఖ సామాజిక కార్యకర్త స్వరాజ్‌ అభియాన్‌ పార్టీ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్‌ (14–07–2019)

ఇటీవల దేశంలో ఎన్నికలు జరిగిన తీరు 2019లో లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికల పేరిట నరేంద్ర మోదీ–అమిత్‌ షాల నాయకత్వంలో నిర్వహించిన ఎన్నికలను శ్రద్ధగా పరిశీలించేవారికి – రానున్న రోజుల్లో, అనతికాలంలోనే రాబోయే పరిణామాలకు సూచీగా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వ్యూహాన్ని అమలు జరిపే ఉద్దేశం మోదీకి ఉందని అర్థమవుతుంది, తద్వారా 72 ఏళ్లనాడు భారత ప్రజలు అశేషత్యాగాలతో రూపొందించుకున్న గణ (జన)తంత్ర రిపబ్లిక్‌ వ్యవస్థ రూపురేఖలనే మార్చి ‘హిందూ రిపబ్లిక్‌’ రాజ్యాంగ చట్టంతో బలవంతంగా ముందుకు నెట్టుకుపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇందుకు వివిధ మార్గాల్లో వ్యూహాలతో, సమీకరణాలతో పదవుల ఎర చూపి ప్రతిపక్షాలను చీల్చి ముక్కలు చేసి తాను పెంచుకున్న లోక్‌సభ, కొన్ని అసెంబ్లీలలో పెంచు కున్న కృత్రిమ బలం ద్వారా– 2019 తర్వాత 2024 నాటికి అసలు ఎన్ని కలు అంటూ ఉండకపోవచ్చు! కారణం? తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తా మన్న ధీమా బీజేపీ నాయకత్వంలో కొరవడటమే అయివుండాలి. ఈ పరిణామాన్ని సూచనప్రాయంగా 2019 ఎన్నికల సమయంలోనే బీజేపీ సీనియర్‌ నేతలలో ఒకరైన సాక్షీ మహరాజ్‌ ‘2019 ఎన్నికల తర్వాత ఇక దేశంలో ఎన్నికలు ఉండకపోవచ్చు’నని బాహాటంగా ముందస్తు హెచ్చరి కగా ప్రకటించనే ప్రకటించాడని మరవరాదు! కాంగ్రెస్‌లో, దేశ ప్రతిపక్షా లలో ఎన్నడూ ప్రజలు చూడనంత అనైక్యతకు కారణం – సిద్ధాంత ప్రాతిపదిక లేకపోవడం, ఎన్డీఏకు దీటైన సమీ కరణ కొరవడటం,  సైద్ధాంతికంగానైనా ఒకటిగా ఉండవలసిన వామపక్షాలు నిరంతర చీలు బాటలలో ప్రయాణించడం– బీజేపీకి, మోదీకి అప్పనంగా కలిసొచ్చిన నెగటివ్‌ గాలి! ఆ ‘గాలే’ ప్రతిపక్షాలకు ఎదురుగాలిగా పరిణమించింది.

దేశ ఆర్థిక విధాన రూపకల్పనలో కీలక పాత్ర వహించవలసిన బ్యాంకింగ్‌ వ్యవస్థ రిజర్వ్‌ బ్యాంకు ప్రతిపత్తిని దిగజార్చడం ద్వారా దానిస్థానే బీజేపీ పాలకులే బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వహణను చేతుల్లోకి తీసుకుని రిజర్వ్‌ బ్యాంకు విధానాలను తారుమారు చేసి, నోట్ల రద్దు, కార్యక్రమాన్ని ఆర్బీఐ సలహాలను కాలదన్ని మరీ ప్రవేశపెట్టారు. ఫలితంగా పేద మధ్యతరగతి రైతాంగ, వ్యవసాయం కార్మిక, చేతి వృత్తుల వారికి బ్యాంకుల వద్ద పరపతి పుట్టకుండా పోయింది. తీరా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పేరిట జరిగిన నోట్లరద్దు కార్యక్రమం వల్ల 125 మంది బ్యాంకుల వద్ద కుప్పకూలి చని పోయారు. అయినా మోదీ ఆ 125 మృతుల సంఖ్యను ఉపేక్షిస్తూ, ‘125 కోట్లమంది ప్రజలు నోట్ల రద్దు చర్యను సమర్థించార’ని గొప్పలు చెప్పుకున్నా జనం ఉలకలేదు, పలకలేదు! దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్య, పేద, మధ్యతరగతి, విభిన్న దళిత వర్గాలకు ఆర్థిక విధానాల వల్ల కలిగిన కష్టనష్టాలకు ఎలాంటి సవరణలు మోదీ పెట్టకపోయినా, వారు భరించి పడి ఉండటానికి మరో కారణం–ప్రతిపక్షాల చెండితనమూ, బహుశా దేశ పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూప స్వభావాలను ఇప్పటికైనా అర్థం చేసుకుని వ్యూహరచన చేసుకోవడంలో విఫలం కావడమూ.

చివరికి రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్లు ఒక్కరొక్కరుగా ముగ్గురు, నలుగురు మోదీ పాలన ప్రారంభమైన రోజుల నుంచి రెండవసారి పాలన మొదలైన నాటి దాకా గవర్నర్‌ పదవులు వదులుకుని పోవలసిన దుర్గతి పట్టింది. అయినా మన ప్రజాస్వామ్యం (బ్రాండ్‌ ఏదైనా) వర్ధిల్లుతూనే ఉంది. అంతేకాదు, ఎన్ని లోటుపాట్లున్నా స్వాతంత్య్రానంతర దశలో దేశ ఆర్థిక వ్యవస్థను పెట్టుబడి వ్యవస్థ మధ్యనే ప్రజాహితం చేయడానికి ప్రభుత్వ రంగానికి వెన్నుదన్నుగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని మోదీ రద్దు చేసి, ముక్కూ ముఖం లేని, ఉన్నా ప్రజల అనుభవంలోకి రాని నీతి ఆయోగ్‌ సంస్థను ఏర్పాటు చేస్తే అదీ అవినీతి విధానాల కేంద్రంగా మారింది. 

బహుశా మోదీ ఏకపక్ష విధానాలతో పొసగకనే ఆ సంస్థ నుంచి కూడా అయిదేళ్లలో ముగ్గురు ఉన్నతాధికారులు జారుకోవలసి వచ్చింది. ఇలాంటి పరిణామం గత 72 ఏళ్ల దేశ స్వాతంత్య్ర చరిత్రలో జరగలేదు. అయినా మనలో చలనం లేదు! పైగా, మరోవైపున రిపబ్లిక్‌ రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా– పార్లమెంటరీ విభాగాలు, న్యాయ, శాసన వేదికల స్వతంత్ర ప్రతిపత్తులను కోల్పోతున్నాయి. న్యాయ వ్యవస్థ నిర్వహణలో జోక్యం నానాటికి పెరిగిపోయింది. కేంద్ర పాలకుల జోక్యం ఎంతవరకు పాకిందంటే– సొంత పార్టీ (బీజేపీ) అగ్రనేతలలో ఒకరికి తన మాట వినని సీబీఐ స్పెషల్‌ కోర్టు జడ్జి హత్య కేసుతో సంబంధముం దన్న తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తినా సుప్రీం ధర్మాసనం ముందుకు ఆ కేసు వచ్చినా, చివరికి ఆ నేతను కేసునుంచి తప్పించాల్సి వచ్చింది.

దేశ ‘ఆర్థిక వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో రూ. 340 లక్షల కోట్ల (5 లక్షల కోట్ల డాలర్లు) స్థాయికి పెంచేస్తామని’ ప్రకటించారు. కాని గడచిన ఐదేళ్లలో వృద్ధి 7.5 శాతం నుంచి 5–6 శాతానికి ఎందుకు పడిపోయిందో మాత్రం చెప్పరు. అంతేగాదు పారిశ్రామిక, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల, నోట్ల ముమ్మరం) గణాంకాలు కూడా మనకన్నా ప్రపంచ గణాంక సంస్థలే తరచుగా ముందు ప్రకటిస్తుంటాయి. ‘మరిన్ని పెట్టుబడులు వస్తేనే’ మన ఆర్థిక వ్యవస్థకు ఊపూ, ఊతం అని ఆర్థిక మంత్రి నిర్మలమ్మే చెబుతున్నారంటే నమ్మాల్సిందేనట. ఇక ‘సంస్కరణ’ల పేరిట కార్మిక సంఘాలకు, లేబర్‌ మార్కెట్‌కు రానున్న కష్టాలనూ ఊహించుకోవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే– గతంలోకన్నా బీజేపీ హయాంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు దేశ సంపదను తరలించుకుపోవడానికీ పెద్ద పీటలు వేయబోతున్నారు. 

మోదీ తొలి హయాంలోనే దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో లేనంతగా పెరిగిపోయిందని ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ వెల్లడిస్తోంది. మరో మాటగా చెప్పాలంటే 1972–75తో పోల్చితే నిరు ద్యోగం 6.1 శాతం పెరిగింది. అంతేగాదు, భారత ప్రజలు, ప్రతిపక్షాల చేతగానితనంవల్ల ఎంతగా అవమానాలు భరించవలసి వస్తోందంటే ‘ఉద్యోగాల కోసం వేచిఉంటే, బజ్జీలు అమ్ముకోండి’ అని మోదీ ఇటీ వలనే వ్యాఖ్యానించినా గానీ మనం ‘మన్నుతిన్న పింజారుల’ల్లే పడి ఉండటానికి అలవాటు పడ్డాం. అయినా, రాజ్యాంగం దేశ పౌరులకు హామీ పడిన సప్త స్వాతం త్య్రాలను, భిన్నాభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛ సహా పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ద్వారా పౌర స్వేచ్ఛను కుదించడాన్ని నియంతృత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక సంప్రదాయంగా పేర్కొన్న రాజ్యాంగ వ్యవస్థలను నీరుకార్చే దిశగా పాలకవర్గాలు వేగవంతంగా కదలబారుతున్నాయి. కొందరు న్యాయ మూర్తులలో కొన్ని బలహీనతల ఆధారంగా పాలకుల తమ నిర్ణయాలకు అనుకూలంగా ముద్ర వేయిం చుకోడానికి జరిగిన ప్రయత్నాలు చరిత్రకు తెలుసు. 

ప్రజాస్వామ్య సంస్కృతికి ప్రతిబింబాలుగా ఉన్న కల్బుర్గి, పన్సారే లాంటి విద్యాధికుల్ని లంకేష్, వరవరరావు లాంటి సామాజిక కార్యకర్త లపై దారుణ నిర్బంధ విధానాన్ని పాలకులు కొనసాగిస్తూనే ఉన్నారు. దళిత, పేద, బలహీన వర్గాల, మైనారిటీల సమైక్య భావనకు గండి కొడు తూనే గత ఐదేళ్ల పాలనలో బీజేపీ ‘గోసంరక్షణ’ ముసుగులో 69 మంది హత్యలకు బలైనారని ప్రజాస్వామ్య ఉద్యమ పరిరక్షణా జాతీయ సంస్థ ప్రకటించింది. రఫేల్‌ సంస్థ పంపిన ముడుపులపై ఎవరూ నోరెత్తకుండా ఉండటానికి, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌పై ఆరోపణలను కోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేసినందుకు సుప్రీంకోర్టు సుప్రసిద్ధ న్యాయ వాది ఇందిరా జైసింగ్, తీస్తా నెతల్‌వాడ్‌లపై కేసులో ఆమెను సమర్థిం చినందుకు ఇందిర భర్త ఆనంద్‌ గోవ్రర్‌ ఇళ్లపై సీబీఐచే కేంద్రం దాడులు జరిపించింది. పోలీసులు, ప్రాసిక్యూటర్లు, విచారణ సంస్థలు మూకుమ్మ డిగా పౌరహక్కుల్ని కాలరాస్తుంటే నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుండే ఉదా హరణలు ఎన్నో, ఎన్నెన్నో’’. ఈ విపరిణామం– మన దేశ ప్రజలకు సహితం ఒక హెచ్చరికగా భావించాలి, రేపటి కోసం!
abkprasad2006@yahoo.co.in

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top