లాలీ... లాలీ... లాలీ... లాలీ...

లాలీ... లాలీ... లాలీ... లాలీ...


పసిపిల్లలకు ఆకలి తీరితే చాలు, అమ్మ పాడే లాలి పాటలకు వారు తేలికగానే ఆదమరచి నిద్రలోకి జారుకుంటారు. వయసు పెరిగే కొద్దీ సవాలక్ష సమస్యలు మొదలవుతాయి. కొన్ని సమస్యలు కంటికి కునుకు పట్టనివ్వనంతగా పట్టి పీడిస్తాయి. నిద్రా ప్రాధాన్యాన్ని ప్రాచీనులు వేల ఏళ్ల కిందటే గుర్తించారు. ఆధునిక పరిశోధకులు ఏకంగా నిద్రాశాస్త్రాన్నే (సోమ్నాలజీ) అభివృద్ధి చేశారు. విచిత్రమేమిటంటే శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినా, ప్రపంచంలో ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాణుల అతిముఖ్యమైన కనీసావసరాల్లో ఒకటైన నిద్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ‘వరల్డ్‌ స్లీప్‌ డే’ సందర్భంగా...



నిద్ర సుఖమెరుగదని అంటారు. నిజమే. నిద్ర ముంచుకొచ్చినప్పుడు ఎవరూ హంసతూలికా తల్పాల కోసం వెదుకులాడరు. నవారు మంచమైనా సరే, అదీ లేకుంటే చెట్టు నీడైనా సరే... నడుం వాల్చడానికి కాస్త చోటుంటే చాలు... నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారు. కష్టించి పనిచేసిన మనుషులు కడుపు నిండా తిన్న తర్వాత ఆదమరచి నిద్రపోతారు. చీకూ చింతా లేకుండా జీవించే వాళ్లకు అత్యంత సహజంగా నిద్రపడుతుంది. భయాందోళనలు, దిగులు, గుబులు, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి ప్రతికూల భావనలేవీ మనసులో లేనివారికి నిద్రాదేవత త్వరగా కరుణిస్తుంది. ప్రతికూల భావనలు మనసును అతలాకుతలం చేస్తున్నప్పుడు హంసతూలికా తల్పాలు, ఏసీ గదులు వంటి సౌకర్యాలు ఎన్ని ఉన్నా, ప్రశాంతమైన నిద్ర గగన కుసుమమే అవుతుంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది’ అని ‘మనసుకవి’ ఏనాడో సెలవిచ్చారు. కునుకు పడితే మనసు కుదుటపడటం ఎంత వాస్తవమో, మనసు కుదురుగా ఉన్నప్పుడే కంటినిండా నిద్ర పడుతుందనేది కూడా అంతే వాస్తవం. కొందరు అదృష్టవంతులు సందడి సందడిగా జరిగే సభా సమావేశాల్లో సైతం కుర్చీలో కూర్చున్న స్థితిలోనే కునుకు తీయగలరు. ఇంకొందరు దురదృష్టవంతులు సకల సౌకర్యాలూ అందుబాటులో ఉన్నా, నిద్ర పట్టక గింజుకుంటారు.



నిద్రాపురాణం

అష్టాదశ భారతీయ పురాణాల్లో నిద్రాపురాణం అంటూ ఏదీ లేదు గానీ, భారతీయ పురాణాలు కొన్నింటిలో నిద్రాదేవత ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకులకు, రోమన్లకు నిద్రా దేవుళ్లున్నారు. గ్రీకుల నిద్రా దేవుడు హిప్నోస్‌. రోమన్ల నిద్రాదేవుడు సోమ్నస్‌. మన భారతీయుల నిద్రాదేవతకు విగ్రహాలు, ఆలయాలు ఉన్న దాఖలాలేవీ లేవు గానీ గ్రీకులు, రోమన్ల నిద్రా దేవుళ్లకు విగ్రహాలు కూడా ఉన్నాయి. రోమన్లకు కలల దేవుడు ‘మార్ఫియస్‌’ ఉంటే, గ్రీకులకు పగటి కలలకు, పీడకలలకు వేర్వేరు దేవుళ్లున్నారు. వారి పగటి కలల దేవుడు ‘ఫాంటసోస్‌’, పీడకలల దేవుడు ‘ఫోబెటర్‌’. ఇంగ్లిష్‌లో పగటి కలలకు ‘ఫాంటసీ’ లనే పేరు, మిథ్యాభయాలకు ‘ఫోబియా’లనే పేరు ఈ దేవుళ్ల వల్ల వచ్చినవే. గ్రీకు, రోమన్‌ పురాణాల ప్రకారం వారికి రాత్రికి, చీకటికి కూడా దేవతలు, దేవుళ్లు ఉన్నారు.



నిద్రాలయాలు... తొలినాటి ఆస్పత్రులు

వివిధ ప్రాచీన నాగరికతలలో మానవులు నిద్రా ప్రాధాన్యాన్ని గుర్తించారు. ప్రాచీన ఈజిప్షియన్లు దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే నిద్రాలయాలను (స్లీప్‌ టెంపుల్స్‌) నిర్మించారు. వీటినే స్వప్నాలయాలు (డ్రీమ్‌ టెంపుల్స్‌) అని కూడా అంటారు. వీటిని చరిత్రలో తొలినాటి ఆస్పత్రులుగా చెప్పుకోవచ్చు. నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడేవారికి, వివిధ శారీరక సమస్యల కారణంగా నిద్రలేమితో బాధపడే వారికి ఈ నిద్రాలయాల్లో రకరకాల చికిత్స చేసేవారు. నిద్రలేమితో బాధపడేవారికి ఔషధంగా నల్లమందు ఇచ్చేవారు. ధ్యానం, రకరకాల స్నానాలు, ఉపవాసాలు చేయించేవారు. వీటికి తోడు దేవతలు శాంతిస్తారనే నమ్మకంతో జంతుబలులు చేయించేవారు. పీడకలలు పీడిస్తున్న వారికి రకరకాల విరుగుడు పూజలు చేయించేవారు. ఈజిప్షియన్ల తర్వాత ప్రాచీన గ్రీకులు, రోమన్లు, పశ్చిమాసియా ప్రాంతాల వారు కూడా ఇలాంటి నిద్రాలయాలను నిర్మించారు.



కునుకు పట్టనివ్వని ఒత్తిళ్లు

ఆధునిక ప్రపంచం ఒకవైపు వివిధ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నా, మరోవైపు అంతకు మించిన ఒత్తిళ్లు ఆధునిక మానవులను కుంగదీస్తున్నాయి. మితిమీరిన ఒత్తిళ్లు కంటికి కునుకు పట్టనివ్వకుండా సతమతం చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలోని ఈతిబాధలు, పనివేళల్లో తరచు మార్పులు, ఉద్యోగ సమస్యలు, మితిమీరిన పనిభారం, భవిష్యత్తుపై భయాందోళనలు వంటి సమస్యలతో చాలామంది ప్రశాంతంగా నిద్రపట్టక సతమతమవుతున్నారు. నిద్రలేమితో బాధపడేవారిలో చాలామంది నిద్రమాత్రలను ఆశ్రయిస్తున్నారు.



 ఇంకొందరు మద్యం, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అంతర్జాతీయ సర్వేల ప్రకారం నిద్రలేమితో బాధపడేవారిలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య రెట్టింపుగా ఉంటోంది. అయితే, ఉద్యోగాలు చేస్తున్న వారిలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా నిద్రలేమి సమస్య దాదాపు ఒకేలా ఉంటోంది. ఉద్యోగ ఒత్తిళ్ల కారణంగా దాదాపు 56 శాతం మంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. ఆధునిక కాలంలో చదువుల ఒత్తిడి కారణంగా చిన్నారులు సైతం తగినంత నిద్ర పొందలేకపోతున్నారు. చిన్నారుల్లో దాదాపు 30 శాతం మందికి తగినంత నిద్ర ఉండటం లేదు. ఇక వివిధ ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ కోసం వాడే మందుల ప్రభావం వల్ల వృద్ధుల్లో దాదాపు 60 శాతం మంది నిద్రలేమికి గురవుతున్నారు. మానసిక కుంగుబాటుతో బాధపడేవారిలో సుమారు 90 శాతం మంది నిద్రలేమితో సతమతమవుతున్నారు.



ఎంత నిద్ర కావాలి?

నిద్రలేమితో బాధపడుతున్న వారి గణాంకాలు భయపెట్టేలా ఉంటున్నాయి కదా ఇంతకీ ఎంత నిద్ర కావాలంటారా? వయసును బట్టి నిద్ర పరిమాణం మారుతూ ఉంటుంది. పసిపిల్లలకు ఎక్కువసేపు నిద్ర అవసరమవుతుంది. ఎదిగే కొద్దీ నిద్రపోవాల్సిన సమయం తగ్గుతూ వస్తుంది. నిద్రపోవాల్సిన కనీస సమయం కంటే బాగా తక్కువగా నిద్రపోయినా, అంతకు మించి బాగా ఎక్కువగా నిద్రపోయినా నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నట్లే భావించాలి. ఏయే వయసుల్లో ఎంత నిద్ర అవసరం అంటే...



వయసు        నిద్రా సమయం

0–1 సంవత్సరం      14–17 గంటలు

1 సంవత్సరం          12–14 గంటలు

2 సంవత్సరాలు      11–14 గంటలు

3–5 సంవత్సరాలు      10–13 గంటలు

6–13 సంవత్సరాలు       9–11 గంటలు

14–17 సంవత్సరాలు       8–10 గంటలు

18 సంవత్సరాలు నిండాక       7–9 గంటలు




అతినిద్ర... అదో సమస్య

రామాయణంలో రావణాసురుడి సోదరుడు కుంభకర్ణుడు, లక్ష్మణుడి భార్య ఊర్మిళ అతినిద్రకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా కనిపిస్తారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువే పాలకడలిలో శేషశయ్య మీద యుగాల తరబడి యోగనిద్రలో సేదదీరినట్లుగా కూడా పురాణ వర్ణనలు ఉన్నాయి. విదేశీ సాహిత్యంలో కూడా అతినిద్రలో కుంభకర్ణుడిని, ఊర్మిళను తలపించే పాత్రలు కనిపిస్తాయి. అమెరికన్‌ రచయిత వాషింగ్టన్‌ ఇర్వింగ్‌ రాసిన ‘రిప్‌ వాన్‌ వింకిల్‌’ కథలో రిప్‌ వాన్‌ వింకిల్‌ అనే భార్యాబాధితుడు ఇంటిపోరు తట్టుకోలేక అడవి బాట పడతాడు. దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద కూలబడి నిద్రలోకి జారుకుంటాడు.



అలా ఏకంగా ఇరవయ్యేళ్లు నిద్రలోనే గడిపేస్తాడు. అతడికి మెలకువ వచ్చేసరికి దేశంలోని పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయి ఉంటాయి. ఇక ఫ్రెంచ్‌ రచయిత చార్లెస్‌ పెరాల్ట్‌ రాసిన జానపద కథలో కనిపించే స్లీపింగ్‌ బ్యూటీ రామాయణంలో ఊర్మిళను తలపించే పాత్ర. అందులో దుష్టశక్తి శాపానికి గురైన రాకుమారి ఏకంగా వందేళ్లు నిద్రలోనే గడిపేస్తుంది. నిద్రలేమి మాదిరిగానే అతినిద్ర కూడా ఆరోగ్య సమస్యే. అతినిద్రతో బాధపడేవారు పురాణ పాత్రలు, జానపద గాథల్లోని పాత్రల్లా ఏళ్ల తరబడి నిద్రలో గడిపేయకున్నా, రోజులో అధికభాగం నిద్రలోనే గడిపేస్తూ ఉంటారు. రకరకాల శారీరక, మానసిక పరిస్థితుల ఫలితంగా కొందరు అతినిద్రతో ఇబ్బంది పడుతూ ఉంటారు.



నిద్ర... కొన్ని నిజానిజాలు...

సంపూర్ణమైన ఆరోగ్యం కోసం సమతుల ఆహారం, శారీరక వ్యాయామంతో పాటు తగినంత నిద్ర కూడా అత్యవసరం. తిండి కరువైన వారి కంటే నిద్ర కరువైన వారు త్వరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



నిద్రను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసే శక్తి ప్రాణికోటిలో మనుషులకు మాత్రమే ఉంది. పశుపక్ష్యాదులు అలా కాదు. వాటికి ఎప్పుడు ఎక్కడ నిద్ర వచ్చినా వెంటనే నిద్రలోకి జారుకుంటాయి.



గాఢనిద్రలోకి జారుకునే ముందు దశను ‘ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌ (ఆర్‌ఈఎమ్‌) స్లీప్‌’ అంటారు. ఆ స్థితిలో కళ్లు మూసుకున్నా, కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. అలాంటి సమయంలోనే కలలు వస్తాయి. అయితే, దాదాపు 12 శాతం మందికి బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కలలు వస్తాయట.’



మనం కనే కలలన్నీ మనకు గుర్తుంటాయనే గ్యారంటీ లేదు. నిద్ర నుంచి మేలుకున్న ఐదు నిమిషాల్లోనే  సగానికి సగం కలలు మన స్మృతిపథం నుంచి చెరిగిపోతాయి.



నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయులుగా మారే అవకాశాలు ఎక్కువ. నిద్ర కరువైన వారికి శరీరంలో ఆకలిని నియంత్రించే ‘లెప్టిన్‌’ హార్మోన్‌ పరిమాణం తగ్గిపోతుంది. ఫలితంగా ఆకలి పెరిగి అవసరానికి మించి తినేస్తారు. క్రమంగా లావెక్కిపోతారు.



సాధారణంగా ఆరోగ్య సమస్యలేవీ లేనివారు నిద్రకు ఉపక్రమించి పడుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల్లోగా నిద్రలోకి జారుకుంటారు. నిద్ర పట్టడానికి అంతకు మించిన సమయం పడితే నిద్రకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నట్లే లెక్క.



తరచుగా మారే షిఫ్టుల్లో పనిచేసేవారు ఎక్కువగా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు గురవుతారు. నిద్రకు విఘాతం కలిగే ఉద్యోగాలు చేసేవారు ఎక్కువగా గుండెజబ్బులు, ఇతర దీర్ఘవ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.



జీవితంలో వెంటాడే భయాలు ఉన్నప్పుడు నిద్రలో కొందరికి పీడకలలు వస్తుండటం సహజమే. అయితే, అరుదుగా కొందరు నిద్రపోవాలంటేనే భయపడతారు. ఇదొక మానసిక వ్యాధి. నిద్ర అంటేనే భయపడే ఈ మానసిక వ్యాధిని ‘సోమ్నిఫోబియా’ అంటారు.



జాగారంలో రికార్డు

శివరాత్రికి జాగారం ఉండటం మనదేశంలో చాలామంది పాటించే ఆచారం. రోజు రోజంతా ఉపవాసం చేసి, నిద్రపోకుండా పూజా పునస్కారాల్లో మునిగి తేలుతారు. విదేశాల్లో అలాంటి ఆచారమేదీ లేకున్నా, 1964లో ఒక పదిహేడేళ్ల అమెరికన్‌ కుర్రాడు జాగారంలో గిన్నిస్‌ రికార్డు సాధించాడు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతానికి చెందిన రాండీ గార్డెనర్‌ అనే ఆ కుర్రాడు నిద్ర పోకుండా ఏకంగా 11 రోజుల 24 నిమిషాలు (264.4 గంటలు) గడిపాడు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top