ఆపిల్‌తో కుకీస్‌ టేస్టు.. మస్తు మస్తు | Tasty Snack Recipe Items On Funday Magazine In Sakshi | Sakshi
Sakshi News home page

ఆపిల్‌తో కుకీస్‌ టేస్టు.. మస్తు మస్తు

Nov 3 2019 8:48 AM | Updated on Nov 3 2019 8:55 AM

Tasty Snack Recipe Items On Funday Magazine In Sakshi

ఆపిల్‌ కుకీస్‌
కావలసినవి : ఓట్స్‌ – 2 కప్పులు, కొబ్బరి తురుము – 1 టేబుల్‌ స్పూన్‌, బ్రెడ్‌ పౌడర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, చీజ్‌ – 2 టేబుల్‌ స్పూన్‌, యాపిల్‌ గుజ్జు – 1 కప్పు, గుడ్లు – 3, ఆలివ్‌ నూనె – 1 టేబుల్‌ స్పూన్‌, వాల్‌నట్స్‌ గుజ్జు – అర కప్పు, దాల్చిన చెక్కపొడి – పావు టీ స్పూన్‌, ఉప్పు – తగినంత
తయారీ:
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఓట్స్, కొబ్బరి తురుము, బ్రెడ్‌ పౌడర్‌ వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు చీజ్, గుడ్లు, వాల్‌నట్స్‌ గుజ్జు, యాపిల్‌ గుజ్జు, ఆలివ్‌ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కపొడి, ఉప్పు కూడా ఆ మిశ్రమంలో వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న కుకీస్‌లా చేసుకుని ఓవెన్‌లో 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్టీ కుకీస్‌ రెడీ అయిపోతాయి.

మొక్కజొన్న ఢోక్లా


కావలసినవి : మొక్కజొన్న పిండి – 2 కప్పులు, వేరుశనగ పేస్ట్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, పచ్చి బఠానీ – పావు కప్పు(నానబెట్టుకోవాలి), కరివేపాకు పొడి – 2 టేబుల్‌ స్పూన్లు, అల్లం పేస్ట్‌ – పావు టేబుల్‌ స్పూన్‌,పచ్చిమిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి), రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తురుము – పావు కప్పు, పెరుగు – ఒకటిన్నర కప్పులు (1 లేదా 2 రోజుల నిలువ చేసినది), ఉప్పు – తగినంత, నూనె – 1 టీ స్పూన్‌, బేకింగ్‌ సోడా – 1 టీ స్పూన్‌, ఆవాలు – 1 టేబుల్‌ స్పూన్‌, జీలకర్ర – అర టీ స్పూన్‌, ఇంగువ – చిటికెడు
తయారీ:
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, వేరుశనగ పేస్ట్, కరివేపాకు పొడి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, రవ్వ, కొత్తిమీర తురుము, పచ్చి బఠానీ, పెరుగు, ఉప్పు, బేకింగ్‌ సోడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కూడా కలుపుకుని కేక్‌ ట్రేలో వేసుకుని, ఇరవై ఐదు నిమిషాల పాటు ఓవెన్‌లో ఉడికించుకోవాలి. తర్వాత కావల్సిన షేప్‌లో ముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని ఒక పాత్రలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర వేయించుకుని, ఉడికిన కార్న్‌ కేక్‌ మీద వేసుకోవాలి. 

కోకోనట్‌ పాన్‌ కేక్‌


కావలసినవి : ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కొబ్బరి పాలు – 5 టేబుల్‌ స్పూన్లు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె – పావు టేబుల్‌ స్పూన్, గుడ్లు – 4,
తేనె – 2 టేబుల్‌ స్పూన్లు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – అర టీ స్పూన్, నిమ్మకాయ తొక్క పొడి – పావు టీ స్పూన్, బాదం పాలు – అర కప్పు, నెయ్యి – పాన్‌కేక్స్‌ వేసుకునేందుకు సరిపడా

తయారీ :
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ఎండు కొబ్బరి తురుము, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, నిమ్మకాయ తొక్క పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి నూనె, తేనె, గుడ్లు, కొబ్బరి పాలు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పాన్‌ వేడి చేసుకుని నెయ్యి వేసుకుని, ఆ మిశ్రమంతో చిన్న చిన్న పాన్‌కేక్స్‌లా వేసుకుని, రెండువైపులా దోరగా వేయించుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే అరటి పండు ముక్కలు, ఇతర డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement