భారత వజ్రం మరాఠి రత్నం

Special story to gopal krishna gokhale - Sakshi

ధ్రువతారలు

‘ఇంగ్లీషువారు చేసిన వాగ్దానాలు మా జాతికి అమూల్యమైన ఉన్నతాదర్శాలను ప్రసాదించాయి. వారే ఆ వాగ్దానాలను భంగపరిస్తే, బ్రిటిష్‌ ప్రభుత్వం ఎడల మాకు ఉండవలసిన అభిమానం కనుమరుగు కావడానికి అదే కారణం కాగలదు.’ భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర మీద పరుచుకున్న ఒక సుదీర్ఘ జాడ గోపాలకృష్ణ గోఖలే. గాంధీగారు గోఖలేను తన రాజకీయ గురువుగా సంభావించారు. గాంధీజీ బద్ధశత్రువు మహమ్మదలీ జిన్నా కూడా గోఖలేనే ఆదర్శంగా తీసుకున్నారు. తాను ముస్లిం గోఖలేగా వెలుగొందాలని జిన్నా  బహిరంగంగానే కోరుకోవడం ఒక వాస్తవం. వీఎస్‌ శ్రీనివాసశాస్త్రి కూడా గోఖలేను ఆదర్శంగా తీసుకుని దేశసేవ కోసం ముందుకొచ్చారు. తొలినాటి స్వాతంత్య్రోద్యమం మీద ఆయన జాడ, తరువాత కాంగ్రెస్‌ను శాసించిన నాయకుల ఆలోచనల మీద ఆయన నీడ అంత సుస్పష్టంగా కనిపించినా గోఖలే స్వయం ప్రకాశం కలిగిన చరిత్ర పురుషునిగా ఉద్యమ చరిత్రలో కానరారు. ఆయన గాంధీజీకి రాజకీయ గురువు. అలాగే జిన్నా, వీఎస్‌ శ్రీనివాసశాస్త్రిలకు కూడా గురువు. ఇంకా, అతివాదులను అడ్డుకున్నవాడు. ఈ విధమైన పరోక్ష ప్రస్తావన ద్వారానే ఆయన చరిత్ర పుటలలో దర్శనం ఇస్తారు. గోఖలే జీవితాన్నీ, సాధించిన నిర్మాణాత్మక విజయాలనూ గమనిస్తే గోఖలే స్వయం ప్రకాశం కలిగిన మహనీయుడిగా స్థానం సాధించుకోకపోవడం వింత అనిపిస్తుంది. అధునిక భారత దేశ చరిత్రలో కనిపించే పలు చారిత్రక వైచిత్రులలో ఇదొకటి అనిపిస్తుంది. 

గోఖలే (మే 9, 1866– ఫిబ్రవరి 19, 1915) ఉదారవాది. రాజ్యాంగబద్ధ ఉద్యమ సిద్ధాంతానికి నిబద్ధుడు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఆయన చేసినవన్నీ విన్నపాలే. కానీ వాటి వెనుక బ్రిటిష్‌ ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోక తప్పని హెచ్చరికలూ, వాస్తవాలూ ఉండేవి. నిజం చెప్పాలంటే గోఖలే మెత్తని పులి. ‘ఉత్కంఠతాభరిత రాజకీయ గాలివానలో దేశ పునర్వ్యవస్థీకరణ జరగడం సరికాదు’ అంటారాయన. దేశ పునర్నిర్మాణం లేదా పునర్వ్యవస్థీకరణకు ఆయన వ్యతిరేకం కాదు. కానీ అది జరగవలసిన తీరు మీద ఆయన అభిప్రాయాలు ఆయనవి. ఆ తరం కాంగ్రెస్‌ నాయకులలో మితవాదులని ముద్రపడినవారు అలాంటి అభిప్రాయానికి అగ్రతాంబూలం ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. మొదటి కారణం– ప్రథమ స్వాతంత్య్రం సంగ్రామం మిగిల్చిన అనుభవం. రెండు – ఇంగ్లిష్‌ ప్రభుత్వంతో ఉన్న గౌరవనీయమైన వ్యతిరేకత. ఇంగ్లిష్‌ విద్య ద్వారా వచ్చిన రాజనీతిజ్ఞత. నిజానికి ఈ వ్యక్తిత్వం ఒక సంఘర్షణ నుంచి అలవడింది. దాని ఫలితమే దౌత్యభాషను మరిపించే సంభాషణా చతురత కూడా. ‘గోఖలే ఎంత కఠినమైన మాటనైనా కూడా అత్యంత మార్దవమైన భాషలో చెప్పగల సమర్థులు’ అంటారు భోగరాజు పట్టాభిసీతారామయ్య, తన ‘కాంగ్రెసు చరిత్ర’లో. 

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఒక పేద కుటుంబంలో పుట్టారు గోఖలే. వ్యవసాయం కలసి రాకపోవడంతో తండ్రి గోఖలేకు ఇంగ్లిష్‌ విద్య నేర్పించారు. అలా విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అభ్యసించిన తొలితరం భారతీయులలో ఆయన ఒకరిగా ప్రసిద్ధిగాంచారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ప్రయాణించి పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో చరిత్ర, రాజకీయార్థశాస్త్ర ఆచార్యునిగా చేరారు. తరువాత ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన పదవికి రాజీనామా చేసి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అలహాబాద్‌ సమావేశాలలో (1899)  మొదటిసారి పాల్గొని సభ్యులయ్యారు. అవే సమావేశాలలో ఆయనతో పాటే చేరినవారు బాలగంగాధర తిలక్‌. 

కాంగ్రెస్‌లో చేరక ముందు నుంచే ఆయన శ్వేత ప్రభుత్వ విధానాల గురించి వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది. ‘అత్యున్నత ఉద్యోగాలన్నీ శాశ్వతంగా యూరోపియన్లకే ఉండాలి’ అని 1894లో ఒక ఆదేశం జారీ అయింది. ఈ వ్యాసం ఆరంభంలో ఉటంకించిన వాక్యాలు ఈ ఆదేశం మీద గోఖలే స్పందనే. ఫెర్గూసన్‌ కళాశాలను వీడి వచ్చిన తరువాత గోఖలే 1902లో బొంబాయి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులయ్యారు. అప్పటి నుంచి ఆయన ఒక అవిశ్రాంత పోరాటం చేశారు. భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం అనదగిన మాంటెగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ చట్ట రూపకల్పనలో ఆయన తనదైన సేవ అందించారు. బెంగాల్‌ విభజన జరిగిన సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రలోను, బ్రిటిష్‌ ఇండియా చరిత్రలోను ఎంతో ముఖ్యమైనది. ఆ సంవత్సరం (1905) కాంగ్రెస్‌ వార్షిక సభలు కాశీలో జరిగాయి. ఆ సభలకు అధ్యక్షునిగా గోఖలే ఎంపికయ్యారు. విదేశీ వస్తు బహిష్కరణ వంటి కీలక నిర్ణయం తీసుకున్న సభలు అవే. ఆ సంవత్సరమే గోఖలే సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థను స్థాపించారు. విభజన పరిణామాల గురించి వివరించేందుకు 1906లో గోఖలే ఇంగ్లండ్‌లో పర్యటించారు. కానీ 1907లో సూరత్‌ కాంగ్రెస్‌ బహుశా గోఖలే జీవితంలో ఒక చేదు అనుభవం అవుతుంది. ఆ సభలకు అధ్యక్షుడు అరవింద్‌ ఘోష్‌. ఈ సభలలో మితవాద వర్గానిది ఎట్టి పరిస్థితులలోను పైచేయి కానవ్వరాదనే కుటిలత్వంతో ఫిరోజ్‌షా మెహతా చేసిన పనికి బాలగంగాధర తిలక్‌ బలయ్యారు. ప్రసంగించే అవకాశం ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞాపనను నిర్వాహకులు తోసిపుచ్చారు. అయినా తిలక్‌ వేదిక ఎక్కడంతో ఫిరోజ్‌షా వర్గీయుడు ఒకరు బూటు విసిరారు. అది తృటిలో తప్పింది. కానీ వేదిక మీదే ఉన్న సురేంద్రనాథ్‌ బెనర్జీకి తగిలింది. ఇంతలో తిలక్‌ లక్ష్యంగా కుర్చీలు గాలిలోకి లేచాయి. ఆ సందర్భంలో తిలక్‌కు రక్షణ కవచంగా నిలిచిన వారిలో ప్రథములు గోఖలేయే. 

గోఖలేకు, తిలక్‌కు అభిప్రాయభేదాలు ఉన్నాయి. అవి రహస్యం కాదు. గోఖలే మొదట సంస్కర్త. తరువాత రాజకీయవాది. తిలక్‌ కూడా అంతే. వయోపరిమితి బిల్లుకు గోఖలే అనుకూలుడు. తిలక్‌ కూడా అనుకూలుడే. కానీ ఇద్దరికీ విభేదం వచ్చింది. వివాహ వయో పరిమితిని పదేళ్ల నుంచి పన్నెండేళ్లకు పెంచడానికి ఉద్దేశించిన ఆ బిల్లును దేశం స్వాతంత్య్రం సాధించిన తరువాత ఆమోదించుకోవాలన్నది తిలక్‌ అభిమతం. భారతీయ సామాజిక, సాంస్కృతిక జీవనంలో; వాటి రూపురేఖలను తీర్చిదిద్దుకోవడంలో ఆంగ్లేయుల ప్రమేయం సరికాదన్నదే తిలక్‌ అసలు ఆలోచన. కానీ బ్రిటిష్‌ జాతి నుంచి పూర్తి విముక్తిని కోరుకుంటున్నవారు కారు మితవాదులు. తిలక్‌ ‘స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించుకుని తీరుతాను’ అని నినదించినవాడు. ఈ సిద్ధాంతమే అసలు విభేదం.   1910లో గోఖలే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యునిగా కూడా ఎంపికయ్యారు. అదే సంవత్సరం బొంబాయి ప్రెసిడెన్సీ ముస్లిం ప్రతినిధిగా మహమ్మదలీ జిన్నా కూడా సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు  ఎంపికయ్యారు. 

సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో గోఖలే నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనది. అప్పుడు ఆ సభ కలకత్తాలో ఉండేది. బడ్జెట్, విద్య అంశాలలో ఆయన లేవనెత్తిన అంశాలు ప్రత్యేకమైనవి. ‘ఎండకెండి, వానకు తడిసి, ఉదయం నుంచి సాయంకాలం వరకు గుప్పెడు మెతుకుల కోసం చెమటోడ్చి పనిచేస్తూ అంతులేని ఓర్పుతో మానవుడు పెట్టే కష్టాలను, దేవుడు పెట్టే కష్టాలను కూడా భరిస్తూ చెప్పుకునే దిక్కులేక కిక్కురు మనకుండా ప్రభువులకు పన్నులిచ్చుకునే రైతును’ చూసి కొంచెం జాలి చూపించవలసిందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు (కాంగ్రెస్‌ చరిత్ర, భోగరాజు). బస్తా ఉప్పు మూడు పైసలు. అది విపణిలో ఐదు అణాలకు (30 పైసలు) ఎందుకు అమ్ముతున్నారో చూడాలని కూడా గోఖలే కోరడం విశేషం. కరెన్సీ అయినా కళంక రహితంగా ఉండాలన్నది ఆయన సిద్ధాంతం. 

కానీ ఇంతటి శాంతమూర్తి కూడా కర్జన్‌ చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేయక తప్పలేదు. తన మితవాద వ్రతాన్ని కాస్త సడలించక తప్పలేదన్నా వాస్తవదూరం కాదు. బెంగాల్‌ విభజన, కలకత్తా కార్పొరేషన్‌ అధికారాలకు కత్తెర, యూనివర్సిటీ సెనేట్లను ఉద్యోగుల పరం చేయడం వంటి చర్యలతో గోఖలే కూడా ఖిన్నుడయ్యారు. ‘ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వంతో సహకరించే పనికి ఇక స్వస్తి పలకక తప్పదు’ అని హెచ్చరించారు. అంతేకాదు, ‘వంగదేశంలో ఇటీవల అతి తీవ్రంగా పొంగి పొరలెత్తిన జల ప్రవాహం అక్కడక్కడ గట్లు తెగి అతిక్రమించి పోవడం అసంభవ విషయమేమీ కాదు. పెద్ద సమూహంలో ఒక్కసారి ఆకస్మిక సంచలనం కలిగినప్పుడు ఇట్టి చిన్నచిన్న మర్యాద అతిక్రమణలు తప్పవు. ముఖ్యంగా ఆ సంచలనం చీకట్లో నుంచి వెలుతురులోకి, నిర్బంధంలో నుంచి స్వాతంత్య్రంలోకి అయినట్లయితే మరీ తప్పవు.’ అని పరోక్షంగా చాలా తీవ్రంగానే ఆయన సర్కారును హెచ్చరించారు. 

నిజానికి చరిత్ర పుటల ద్వారా గోఖలే అనగానే మన దృష్టికి వచ్చే ఓ వ్యక్తిత్వానికీ, ఈ స్థాయి ప్రకటన ఇచ్చిన గోఖలే చిత్రానికీ మధ్య పెద్ద అంతరమే కనిపిస్తుంది. ప్రత్యేకించి చెబితే తప్ప ఇది గోఖలే ప్రకటన అని మనకు తెలియదు. ఈ విషయంలో గొప్ప మితవాదిగా చరిత్రలో ముద్ర పడిన గోఖలేలో అతివాదులైన తిలక్, అరవిందుడు, బిపిన్‌పాల్, లజపతిరాయ్‌ వంటివారి స్వర తీవ్రత కనిపిస్తుంది. ఉగ్ర తాత్వికత దర్శనమిస్తుంది. తరువాత కూడా, ‘ప్రభుత్వంవారు అంతకంతకు ఎక్కువ స్వార్థపరులువుతున్నారు. జాతీయాశయాలకు నానాటికీ ఎక్కువ విరోధులుగా మారుతున్నారు. పూర్వం ఇంత వ్యతిరేకత లేదు’ అని వ్యాఖ్యానించడం కూడా ఆయనలో కరుగుతున్న మితవాద ధోరణికి అద్దం పడుతుంది. గాంధీజీ, గోఖలే అనుబంధం కాంగ్రెస్‌ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికీ, మలుపునకూ కారణమైంది. 1912లో ఆయన గాంధీజీ ఆహ్వానం మేరకు దక్షిణాఫ్రికాలో పర్యటించారు. భారతీయుల దుస్థితిని గమనించారు. ఆ సమయంలో టాల్‌స్టాయ్‌ ఆశ్రమంలో మంచం ఏర్పాటు చేయడానికి గాంధీజీ పడిన కష్టం ఇవన్నీ ‘గోఖలే: మై పొలిటికల్‌ గురు’ అన్న చిన్న పుస్తకంలో అద్భుతంగా వర్ణించారు. గోఖలే పిలుపు మేరకే గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికాను వీడి శాశ్వతంగా భారతదేశానికి వచ్చారు. కానీ గాంధీజీ వచ్చిన దాదాపు నెలరోజులకే తీవ్రమైన మధుమేహ వ్యాధితో గోఖలే తుదిశ్వాస విడిచారు. యాభయ్‌ ఏళ్లు కూడా రాకుండానే గోఖలే తనువు చాలించడం ఒక శూన్యాన్ని మిగిల్చింది. ఆ సందర్భంలో తిలక్‌ అన్నమాట చాలు గోఖలే గొప్పతనాన్ని ఆవిష్కరించడానికి. ‘ఈ భారతీయ వజ్రం, ఈ మరాఠి రత్నం చితి మీదకు చేరింది.’
- ∙డా. గోపరాజు నారాయణరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top