
మాట్లాడుతున్న రాంచందర్‌రావు. చిత్రంలో కాసం వెంకటేశ్వర్లు తదితరులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
కేంద్రం యూరియా సరఫరాను ఎక్కడా ఆపలేదు
కాంగ్రెస్ సర్కార్ కృత్రిమ కొరత సృష్టించింది
కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు నిలపలేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి యూరియా సరఫరాలో ఎలాంటి కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం యూరియా ఇవ్వడం లేదు కాబట్టే రాష్ట్రంలో కొరత నెలకొందని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని, వాస్తవానికి కేంద్రం యూరియా సరఫరాను ఎక్కడా ఆపలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులతో చర్చకు సిద్ధమని తాను గతంలోనే సవాల్ విసిరితే, దానిపై స్పందించడానికి ఆ పార్టీ నాయకులు ధైర్యం చేయలేదన్నారు. కేంద్రం 2025 రబీ సీజన్ (అక్టోబర్ 2024 – మార్చి 2025)లో తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని చెప్పారు.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మినది 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని, మిగిలిన 2.04 లక్షల టన్నులు ఖరీఫ్ సీజన్ ఓపెనింగ్ స్టాక్‌గా ఉందని చెప్పారు. ‘ఈ ఖరీఫ్ సీజన్ (ఆగస్టు 2025 వరకు)లో కావాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు 5.18 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం సరఫరా చేసింది. కాబట్టి ఈ రోజు వరకు మొత్తం అందుబాటులో ఉన్న యూరియా 7.22 లక్షల మెట్రిక్ టన్నులు’అని తెలిపారు. తాను తెలిపిన ఈ వివరాలు తప్పని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రాంచందర్‌రావు సవాల్ విసిరారు.
అలా నిరూపించలేకపోతే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామాకు సిద్ధం కావాలన్నారు. మంత్రి తుమ్మల ముందుగానే ‘స్టాక్ లేదు’అని అబద్ధాలు చెప్పడం.. ‘మిస్ మేనేజ్‌మెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’లో భాగమని అన్నారు. ఈ భయంతో రైతులు ఒక్కసారిగా షాపులకు చేరుకోవడం, దళారులు బ్లాక్ మార్కెట్ చేయడం వల్ల యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు.
‘పంట విస్తీర్ణంలో గతేడాదితో పోల్చితే ఏ మార్పూ లేకపోయినా అదనపు యూరియా ఎక్కడికి వెళ్లింది? నిజంగా రైతుల వద్దకు చేరిందా, లేక బ్లాక్ మార్కెట్ మాఫియా చేతికి చేరుతోందా? దీనిపై మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలి’అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్వహణా లోపంతో కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ఇఫ్కో, క్రిభ్‌కో, ఆర్‌సీఎఫ్ నుంచి 7,250 రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని, కరీకల్ పోర్ట్ దిగుమతుల నుంచి పదివేల మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చాయన్నారు.
‘మార్వాడీ గోబ్యాక్’ వెనుక అర్బన్ నక్సల్స్..
తెలంగాణలో శాంతి–భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. ‘మార్వాడీ గోబ్యాక్’నినాదాల వెనుక అర్బన్ నక్సల్స్ వంటి అనేక శక్తులు ఉన్నాయని ఆరోపించారు.
బీసీ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు?
కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించలేదని రాంచందర్‌రావు ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మప్ర బోధం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వి.హన్మంతరావు పేరును ప్రకటించాల్సింది కదా? అది ఎందుకు జరగలేదు’అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికతో బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటో వెల్లడైందన్నారు. కాంగ్రెస్‌కు కేవలం బీసీల ఓట్లు మాత్రమే అవసరం తప్ప, వారి అభ్యున్నతి అవసరం లేదన్నారు. దీనితో బీసీవర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇండీ కూటమి ఎంపీలందరూ ఇప్ప టికైనా ఆత్మప్రబోధం మేరకు ఎన్డీఏ ఎంబీసీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి ఓటేయాలని కోరుతున్నామన్నారు.