ధర్మజుని తొందరపాటు

special story to Dharmaraju - Sakshi

పురానీతి

అది మహాభారత సంగ్రామం... కురు పాండవుల మధ్య తీవ్ర పోరు సాగుతోంది. పాండు మధ్యముడైన అర్జునుడిపైనే కర్ణుని గురి. తాను ఇంద్రుని నుంచి వరంగా పొందిన శక్త్యాయుధాన్ని అర్జునుడిపై ప్రయోగించాలని వేచి ఉన్నాడు. ఇంతలో ఘటోత్కచుడు రణరంగాన ప్రవేశించాడు. అసలే రాక్షసుడు... ఆపై వీరుడు. మాయలు మంత్రాలు తెలిసిన మహా బలశాలి. దాంతో అందరూ కలిసి కర్ణుని శరణుజొచ్చారు. ఘటోత్కచుని రాక్షస మాయల ముందు కర్ణుని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. దాంతో విధిలేని పరిస్థితులలో అర్జున  సంహారం కోసం దాచి ఉంచిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. ఘటోత్కచుడు హతమయ్యాడు. 

ఘటోత్కచుడి మరణంతో ధర్మరాజు రథం మీద కూలబడి తీవ్రంగా రోదిస్తున్నాడు. కృష్ణుడు ధర్మజుని దగ్గరకు వెళ్ళి ‘ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధంలో వీరులు మరణించరా! అన్నీ తెలిసిన నీవే ఇలా చింతిస్తే సైన్యాన్ని నడుపగల వాడెవడు? నీ సోదరులను ఓదార్చగల వారెవరు? లేచి వారిని ఓదార్చి యుద్ధ సన్నద్ధులను చేయి‘ అన్నాడు.  ఆ మాటలతో తేరుకున్న ధర్మరాజు ‘‘కృష్ణా! దీనికంతటికి కారణం కర్ణుడు. నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణమయ్యాడు. నేడు ఘటోత్కచుడిని మట్టుపెట్టాడు. నేను కర్ణుడిని చంపుతాను, భీముడు ద్రోణుడిని చంపుతాడు’’ అంటూ తన రథాన్ని వేగంగా ముందుకు నడిపాడు. ముందు వెనకలు ఆలోచించకుండా సాగిపోతున్న ధర్మరాజు వ్యాసమహర్షి తన ఎదురుగా వచ్చి నిలవడంతో రథం దిగి, వినయంగా నమస్కరించాడు. వ్యాసుడు ‘‘ధర్మనందనా! కర్ణుడు శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. లేకుంటే, దానితో అర్జునుడిని చంపి ఉండేవాడు. అదే జరిగి ఉంటే నీ దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది దుఃఖంతో బయటపడ్డావు. కనుక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని కలుపుకొని యుద్ధం కొనసాగించు’’ అని ఊరడించాడు. 

నీతి: మనం దేవుణ్ణి ఎంతగా పూజించినప్పటికీ, ఏదో ఒక ప్రమాదమో, ఆపదో కలగకమానదు. అప్పుడు మనం నిర్వేదంలో కూరుకుపోతాం. జరగవలసింది జరగకమానదు. అయితే, భగవంతుని పూజించినందువల్ల దాని తీవ్రత తగ్గుతుంది. దుఃఖోపశమనం కలుగుతుంది. అది తెలుసుకోవాలి. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top