శుక్రాచార్యుడి శపథం | shukracharya history | Sakshi
Sakshi News home page

శుక్రాచార్యుడి శపథం

Dec 3 2016 11:43 PM | Updated on Sep 4 2017 9:49 PM

శుక్రాచార్యుడి శపథం

శుక్రాచార్యుడి శపథం

రాక్షసుల గురువు ఉశీనుడు శుక్రాచార్యుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు.

రాక్షసుల గురువు ఉశీనుడు శుక్రాచార్యుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు. రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు చాలా మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలున్నాయి. వాటిలో మొదటిది సురాపానమైతే, రెండవది కూతురిపట్ల గల ప్రేమానురాగాలు. శుక్రాచార్యునికి  అపురూపమైన, అత్యద్భుతమైన మృతసంజీవనీ విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై, మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ, రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దాంతో రాక్షసుల బలం పెరుగుతూ, దేవతల బలం తగ్గుతూ వస్తోంది. ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు. ఎలాగైనా సరే, రాక్షసగురువు నుంచి మృతసంజీవని విద్యను నేర్చుకోవాలి. చూస్తూ చూస్తూ శుక్రుడు దేవతలకు ఆ విద్యను బోధించడు కాబట్టి ఎలాగోలా నేర్పుగా శుక్రుడి నుంచి ఆ విద్యను సంగ్రహించాలి. 
 
 అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యమూ కలిగిన వారు కావాలి. అంత ఒడుపుగా ఆ విద్యను సాధించగలవారెవ్వరా అని ఆలోచిస్తుండగా, నేనున్నానంటూ కచుడు ముందుకొచ్చాడు. కచుడు ఎవరో కాదు, బృహస్పతి కుమారుడే. దేవతల ందరూ వెనుకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చిన కచుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి. ‘‘కుమారా! ఎంతో నేర్పరితనం, తెలివితేటలూ నీకున్నాయని తెలుసు. అయితే, ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు. తంత్రం కూడా తెలిసుండాలి. అదేమంటే, శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో. అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు’’ అంటూ చక్కటి మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి. 
 
 కచుడు మానవరూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. ఎంతో వినయంతో ఆయనకు తనను తాను ఎవరూ లేని అనాథనని, మీవద్ద విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. ముందు ఒప్పుకోకపోయినా, విద్యపట్ల అతనికున్న తపన, అతని వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడి, తన వద్దనే ఉంచుకున్నాడు శుక్రుడు. గురువు బోధించిన విద్యలన్నిటినీ నేర్చుకుంటూ, ఎంతో వినయంతో, భక్తి గౌరవాలతో గురువుకు సేవలు చేయసాగాడు కచుడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది. ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేశారు రాక్షసులు.
 
  త ర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు. ఏమి జరిగిందో దివ్యదృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. మృతసంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు. ఈవిధంగా రెండుమూడుసార్లు జరిగింది. చివరికి రాక్షసులు కచుణ్ణి చంపి, కాల్చి బూడిదచేసి, ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు. కచుడు ఎక్కడున్నాడా అని దివ్యదృష్టితో చూసిన శుక్రుడికి కచుడు బూడిదరూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది.  పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి, తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు. 
 
 ‘పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా, రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చింది,’ అని ఆలోచించిన శుక్రుడికి సిగ్గు వేసింది. జీవితంలో ఇక మద్యం ముట్టనని, ఎవరి మీదా మక్కువ పెంచుకోననీ శపథం చేశాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement