breaking news
Shukracharya
-
దానవులకు శుక్రాచార్యుని శాపం!
దానవులకు శుక్రాచార్యుని శాపందేవ దానవ యుద్ధంలో దానవులు ఓటమి పాలయ్యారు. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం తిరిగి వచ్చింది. శుక్రాచార్యుడు దేవతల పక్షంలోకి చేరాడు. అది చూసి రాక్షసులు కలవరపడ్డారు. ‘ఆచార్యా! మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లిపోతే, మేము దిక్కుకానని వాళ్లమవుతాము’ అని మొరపెట్టుకున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల మొరను ఆలకించి, ‘ఓషధులు, మంత్రాలు నా వద్దనే ఉంటాయి. వాటిలో నాలుగో వంతు దేవతలకు చెందితే చెందవచ్చుగాక. మిగిలిన సర్వస్వాన్నీ మీకు ఇస్తాను’ అని వారికి చెప్పాడు.దేవతలు ఈ రహస్యాన్ని తెలుసుకుని, కనిపించిన రాక్షసులనల్లా తుదముట్టించడం ప్రారంభించారు. రాక్షసులు శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నారు. శుక్రుడు దేవతల వద్దకు వెళ్లి, ‘పన్నెండు సంగ్రామాలలో రాక్షసులు ఎందరో హతులయ్యారు. ఇకనైనా మీరు పగను విడిచిపెట్టి, మిగిలిన రాక్షసులను బతకనివ్వండి’ అని చెప్పాడు.తర్వాత రాక్షసులతో రహస్యంగా సమావేశమై, ‘నేను శంకరుడి గురించి తపస్సు చేసి, మంత్రశక్తులను సంపాదించుకుని వస్తాను. అప్పుడు మీకు జయం కలుగుతుంది. అప్పటి వరకు నా తండ్రి భృగు మహర్షి ఆశ్రమంలో మీరంతా తలదాచుకోండి’ అని చెప్పి, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లాడు.శుక్రాచార్యుడు తపస్సు చేస్తుండగా, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ‘శుక్రా! నువ్వు తలకిందులుగా తపస్సు చేయి. అప్పుడే నీకు మంత్రాలన్నీ వశమవుతాయి’ అని చెప్పాడు.శుక్రాచార్యుడు ఘోరనిష్ఠతో శంకరుడు చెప్పిన ప్రకారమే తలకిందులుగా ఒక చెట్టుకు వేలాడుతూ తపస్సు చేయడం ప్రారంభించాడు.శుక్రుడు తపస్సు చేస్తున్న సంగతి తెలుసుకున్న దేవతలు రాక్షసుల మీదకు దండయాత్రకు బయలుదేరారు. దిక్కుతోచని రాక్షసులంతా శుక్రాచార్యుడి తల్లిని శరణు కోరారు.‘భయపడకండి. మీరు నా వద్దనే ఉండండి. మీకు ఏ భయం ఉండదు’ అని ఆమె అభయమిచ్చింది.అయినా, దేవతలు రాక్షసులను తరుముతూ వారిని పీడించసాగారు.దేవతల దుశ్చర్యకు కుపితురాలైన శుక్రమాత ‘మూర్ఖులారా! ఇంద్రుడితో సహా మిమ్మల్నందరినీ మట్టుపెట్టగలను’ అని హెచ్చరించి, తన యోగశక్తితో ఇంద్రుడి కాళ్లు చేతులు పనిచేయకుండా స్తంభింపజేసింది. ఇంద్రుడి పరిస్థితి చూసి, దేవతలు పరుగులు తీశారు. విష్ణువు తనలో ప్రవేశించమని ఇంద్రుడికి చెప్పాడు. శుక్రమాత ‘నిన్ను కూడా దహించివేస్తాను’ అని విష్ణువును హెచ్చరించింది. ఆమె శక్తిని తట్టుకోవడం దుస్సాధ్యమని తలచిన విష్ణువు, స్త్రీవధ కూడదని తెలిసినా, కత్తి దూసి ఆమె శిరస్సును ఖండించాడు.ఇదంతా తెలిసిన భృగు మహర్షి, నువ్వు ఏడు జన్మలు మనిషిగా జన్మిస్తావు’ అని విష్ణువును శపించాడు. తన భార్య శిరస్సును మొండేనికి తగిలించి, తన తపశ్శక్తితో ఆమెను తిరిగి బతికించాడు. ఇంద్రుడు, విష్ణువు సహా దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.శుక్రుడిని ఏం చేయాలో పాలుపోని ఇంద్రుడు తన కుమార్తె జయంతిని పిలిచి, ‘కుమారీ! శుక్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నాతో సహా దేవతలంతా అతడికి భయపడుతున్నారు. నువ్వు వెళ్లి, నీ సపర్యలతో అతడిని వశం చేసుకుంటే, నాకు అంతకంటే కావలసినది లేదు. నేను నిన్ను అతడికి ఇచ్చివేస్తున్నాను’ అని చెప్పాడు.తండ్రి ఆజ్ఞ మేరకు జయంతి శుక్రుడు తపస్సు సాగిస్తున్న చోటుకు చేరుకుంది. అతడికి సపర్యలు చేస్తూ, ఏళ్ల తరబడి ఓర్పుగా ఉంది. కొన్నాళ్లకు శుక్రుడి తపస్సు ఫలించి, శంకరుడు అతడికి ప్రత్యక్షమై మంత్ర శక్తులన్నీ అనుగ్రహించాడు.అన్ని రోజూలూ తనకు సపర్యలు చేస్తూ వచ్చిన జయంతిని చూసి, శుక్రుడు ఆమె వివరాలు కనుక్కున్నాడు. ఆమె కోరిక మేరకు పాణిగ్రహణం చేసి, ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి, అదృశ్యరూపంలో ఆమెతో గడపసాగాడు. శుక్రుడు జయంతితో ఉన్న సంగతి తెలుసుకున్న దేవగురువు బృహస్పతి ఇంద్రుడి ప్రోద్బలంతో తానే శుక్రుడి రూపం దాల్చి, రాక్షసుల వద్దకు వెళ్లాడు. ఆచార్యుడు తిరిగి వచ్చినట్లు భావించిన రాక్షసులు అతడిని పూజించసాగారు.జయంతితో అప్పటికే పదేళ్లు గడిపిన శుక్రాచారుడు తన శిష్యులైన రాక్షసులతో యజ్ఞం జరిపించాలని తలచి, తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన స్థానంలో తనలా ఉన్న బృహస్పతిని రాక్షసులు సేవిస్తుండటం చూసి, పట్టరాని ఆగ్రహంతో ‘మీరు మతిభ్రష్టులై సంచరించెదరుగాక’ అని శపించాడు.అసలు సంగతి గ్రహించిన రాక్షసులు శుక్రాచార్యుని పాదాలపై పడి పరిపరి విధాలుగా ప్రార్థించడంతో అతడు కొంత శాంతించాడు. ‘ఇప్పుడు దేవతలకు అనుకూలమైన కాలం. భవిష్యత్తులో ముల్లోకాలూ తిరిగి మీ వశం కాగలవు’ అని పలికాడు.పురావిశేషం..అసుర గురుడైన శుక్రాచార్యుడికి అరుదైన ఆలయం మహారాష్ట్రలో ఉంది. పురాతనమైన ఈ ఆలయం బేట్ కోపర్గాంవ్ గ్రామంలో గోదావరి తీరానికి చేరువలో ఉంది. ఇక్కడ పూజలు జరిపితే శుక్రాచార్యుడి అనుగ్రహం వల్ల పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇదేచోట శుక్రాచార్యుడు శివుడి గురించి తపస్సు చేసి, మృత సంజీవని విద్య పొందాడని ప్రతీతి. ఈ ఆలయంలో శుక్రాచార్యుడికి పాయసం, కోవా మిఠాయిలు, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. - సాంఖ్యాయన -
శుక్రాచార్యుడి శపథం
రాక్షసుల గురువు ఉశీనుడు శుక్రాచార్యుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. శుక్రాచార్యునికి తెలియని విద్య లేదు. రాని యుద్ధ తంత్రం లేదు. ఆయన ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఆచార్యునిగా శుక్రుడు చాలా మేటి. అయితే ఆయనకు రెండు బలహీనతలున్నాయి. వాటిలో మొదటిది సురాపానమైతే, రెండవది కూతురిపట్ల గల ప్రేమానురాగాలు. శుక్రాచార్యునికి అపురూపమైన, అత్యద్భుతమైన మృతసంజీవనీ విద్య తెలుసు. దాని సాయంతో ఆయన దేవతల చేతిలో పరాజితులై, మృతిచెందిన రాక్షసవీరులను బతికిస్తూ, రాక్షస జాతి నశించిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. దాంతో రాక్షసుల బలం పెరుగుతూ, దేవతల బలం తగ్గుతూ వస్తోంది. ఇలా లాభం లేదనుకుని దేవతల గురువు బృహస్పతి ఒక ఉపాయం ఆలోచించాడు. ఎలాగైనా సరే, రాక్షసగురువు నుంచి మృతసంజీవని విద్యను నేర్చుకోవాలి. చూస్తూ చూస్తూ శుక్రుడు దేవతలకు ఆ విద్యను బోధించడు కాబట్టి ఎలాగోలా నేర్పుగా శుక్రుడి నుంచి ఆ విద్యను సంగ్రహించాలి. అందుకు ఎంతో ఒడుపు, చాకచక్యమూ కలిగిన వారు కావాలి. అంత ఒడుపుగా ఆ విద్యను సాధించగలవారెవ్వరా అని ఆలోచిస్తుండగా, నేనున్నానంటూ కచుడు ముందుకొచ్చాడు. కచుడు ఎవరో కాదు, బృహస్పతి కుమారుడే. దేవతల ందరూ వెనుకాడుతున్న పనిని నేను చేయగలనంటూ ముందుకొచ్చిన కచుణ్ణి పితృవాత్సల్యంతో కావలించుకున్నాడు బృహస్పతి. ‘‘కుమారా! ఎంతో నేర్పరితనం, తెలివితేటలూ నీకున్నాయని తెలుసు. అయితే, ఆ విద్యను సాధించేందుకు కేవలం తెలివితేటలొక్కటే సరిపోదు. తంత్రం కూడా తెలిసుండాలి. అదేమంటే, శుక్రాచార్యుడికి కూతురంటే పంచప్రాణాలు. ఆమెకోసం ఆయన ఏమైనా చేస్తాడు కాబట్టి ముందుగా నీవు ఆయన కూతురు ప్రేమను సాధించుకో. అప్పుడు నీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు’’ అంటూ చక్కటి మార్గాంతరాన్ని ఉపదేశించాడు బృహస్పతి. కచుడు మానవరూపంలో శుక్రాచార్యుడి వద్దకు వెళ్లాడు. ఎంతో వినయంతో ఆయనకు తనను తాను ఎవరూ లేని అనాథనని, మీవద్ద విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని పరిచయం చేసుకున్నాడు. ముందు ఒప్పుకోకపోయినా, విద్యపట్ల అతనికున్న తపన, అతని వినయ విధేయతలకు, తెలివితేటలకు ముచ్చటపడి, తన వద్దనే ఉంచుకున్నాడు శుక్రుడు. గురువు బోధించిన విద్యలన్నిటినీ నేర్చుకుంటూ, ఎంతో వినయంతో, భక్తి గౌరవాలతో గురువుకు సేవలు చేయసాగాడు కచుడు. తమ గురువు కచుణ్ణి అభిమానించడం, గురుపుత్రిక దేవయాని కచుణ్ణి ఆరాధించడం రాక్షసులకు కంటగింపుగా మారింది. ఓసారి అదను చూసి అడవిలో ఒంటరిగా ఉన్న కచుణ్ణి కొట్టి చంపేశారు రాక్షసులు. త ర్వాత ఏమీ ఎరగనట్లుగా కచుడు కనబడటం లేదంటూ గురువుకు చెప్పారు. ఏమి జరిగిందో దివ్యదృష్టితో గ్రహించాడు శుక్రాచార్యుడు. మృతసంజీవనీ విద్యతో కచుణ్ణి బతికించాడు. ఈవిధంగా రెండుమూడుసార్లు జరిగింది. చివరికి రాక్షసులు కచుణ్ణి చంపి, కాల్చి బూడిదచేసి, ఆ బూడిదను మద్యంలో కలిపి మాటల్లో పెట్టి శుక్రాచార్యుడి చేత తాగించారు. కచుడు ఎక్కడున్నాడా అని దివ్యదృష్టితో చూసిన శుక్రుడికి కచుడు బూడిదరూపంలో తన ఉదరంలోనే ఉన్నట్లు తెలిసింది. పుత్రిక మీదున్న ప్రేమతో శుక్రాచార్యుడు తన ఉదరంలో ఉన్న కచుడికి మృతసంజీవనీ విద్యను ఉపదేశించాడు. కచుడు శుక్రుడి పొట్టను చీల్చుకుని వచ్చి, తనకు నేర్పిన విద్యతో తిరిగి గురువును బతికించుకున్నాడు. ‘పుత్రిక అంటే తనకున్న అపారమైన ప్రేమ, మద్యమంటే ఉన్న మక్కువ వల్లే కదా, రాక్షసులకు గురుస్థానంలో ఉన్న తనే తన నోటితో శత్రువులకు మృతసంజీవనీ విద్యను ఉపదేశించవలసి వచ్చింది,’ అని ఆలోచించిన శుక్రుడికి సిగ్గు వేసింది. జీవితంలో ఇక మద్యం ముట్టనని, ఎవరి మీదా మక్కువ పెంచుకోననీ శపథం చేశాడు.


