అత్తారింటికి దారి దొరికింది..!

Short Story On 4th August Funday - Sakshi

ఈవారం కథ

మా అబ్బాయికి కల్యాణం నిశ్చయమైంది. ఇదేమీ పెద్ద విషయం కాదు. అందరి ఇళ్లలోనూ జరిగే సర్వసాధారణమైన ఉత్సవం. అందుకే నాకు పెద్దగా ఉత్సాహం లాంటివేమీ కలగలేదు. నా పని నేను మామూలుగానే చేసుకుంటున్నాను. నా పోలికే వచ్చిందేమో మా అబ్బాయికి, వాడిలోనూ పెద్దగా మార్పేమీ లేదు. ఎప్పటిలాగే ఉన్నాడు. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే రోజులు మామూలుగానే నడుస్తున్నాయి. 
ఇవన్నీ మామూలుగానే ఉన్నా – 
నా మనసు మాత్రం ఒక మాటకు పదే పదే ఉలిక్కి పడుతోంది. 
అదే అత్తగారు! పదం. 
అబ్బాయి పెళ్లి కుదిరింది అని ఎవరితో చెప్పినా, ‘అయితే అత్తగారు హోదా వస్తోందన్నమాట’ అంటున్నారు. అత్తగారు అనేది హోదా ఎందుకు అవుతుందో నాకు అర్థం కాలేదు. ప్రతివారి నోటిలో నుంచి ఈ చిలక పలుకులే వింటుంటే నా మనసు మాత్రం వాటిని కాకి అరుపుల్లా భావిస్తోంది. ఎవరైనా అత్తగారు అనే పదం అంటుంటే, నా నోటి నుంచి ‘ఆ మాట మాత్రం అనకండి’ అనే వాక్యం అప్రయత్నంగా వచ్చేస్తోంది. నా మాటలు అందరికీ విచిత్రంగా అనిపించే ఉంటాయి. నిజమే మరి, కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడుతోందంటే, సంతోషంగా ఉండక, ఇలా ఉలికిఉలికి పడుతున్నానని చెబుతుంటే, వాళ్లకి విచిత్రంగానే అనిపిస్తుంది కదా మరి!
ఈ విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది. అత్తగారు అనే పదం నాకు చెప్పులో రాయి, చెవిలో జోరీగ, కంటిలో నలుసు, ఇంటిలో పోరులా అనిపించసాగింది. అవును, ఒక్కోరు అత్తగారు అన్నప్పుడల్లా ఒక్కో రకంగా స్పందించింది నా మనసు.

దీని వెనకాల పెద్ద కథ కాదు... పే.... ద్ధ.... కథే ఉంది.
నాకు వివాహమై 30 సంవత్సరాలు కావస్తోంది. కారణాలు ఏమైతేనేమి నాకు అత్తవారింట్లో ఉండవలసిన అవసరం రాలేదు. మా ఆయన ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉండటంతో అత్తవారిల్లు అనే పదం నాకు ఆవలి ఒడ్డునే ఉండిపోయింది. అదృష్టంకొద్దీ నాకు అత్తగారి గురించి అత్తింటివారి గురించి తప్పుగా మాట్లాడే ఆలోచన రాకుండా భగవంతుడు నన్ను రక్షించాడు. థాంక్స్‌ ఎ లాట్‌ టు గాడ్‌. 
నా విషయం పక్కనపెట్టి, ప్రస్తుతంలోకి వద్దాం...
కొత్తగా పెళ్లయిన ఏ ఆడపిల్లను పలకరించినా, మా అత్తగారితో పడలేకపోతున్నాను. ఆవిడ వంట చేసిన తరవాత ఆ గది కడగలేకపోతున్నాను. వంట గట్టంతా పాడు చేసేస్తారు అని ఒకరు...
మా అత్తగారికి నేను ఏది చేసినా నచ్చదు. మా పెళ్లయినా కూడా మా ఆయనకు ఆవిడే అన్నీ చేసి పెట్టాలి, నేను చేస్తే నచ్చదు, ఆవిడతో పడలేకపోతున్నాను... అని ఒకరు...
మా అత్తగారికి నేను డ్రసెస్‌ వేసుకుంటే ఇష్టం ఉండదు, అమ్మమ్మలా చీరలే కట్టుకోవాలిట, నేను కొద్దిగా మోడరన్‌గా ఉంటానే కానీ, మరీ అసభ్యంగా ఉండను కదా. అలా ఎందుకంటుందో. మా అత్తగారికి మా వారు ఒక్కరే అబ్బాయి. అందుకే వాళ్లతో కలిసి ఉండకా తప్పదు, నేను మాటలు పడకా తప్పదు... ఇలా మరొకరు...
ఇవి మచ్చుకి మాత్రమే.

ఇందులో అత్తగారి తప్పు ఎంత ఉందో, కోడలి అనుమానం ఎంత ఉందో అనే చర్చ నాకు అనవసరం. కొత్త కోడలు అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్తల్లో అత్తగారిని ఒక తాటకిలాగో, ఒక లంఖిణిలాగో, ఒక సూర్యకాంతంలాగో చూస్తుందని మాత్రం ఆ వయసులోనే అర్థమైంది. మరి ఇప్పుడు నేను అత్తగారి హోదాలో ఉంటే నేను కూడా ఏదో ఒక రాక్షసినే అవుతాను కదా. చిన్నప్పుడు ఆడుకున్న ఒక ఆట నాకు ఈ సందర్భంలో బాగా గుర్తుకు వస్తోంది. చిన్నపిల్లలు అన్నం తినకపోతే, వాళ్ల అరచేతిని మన చేతిలోకి తీసుకుని, ‘అలికి, ముగ్గు పెట్టి, ఆకేసి, పీటేసి, పప్పేసి, కూర వేసి, నెయ్యేసి... అన్నీ కలిపి ఆం ఆం అని తినాలి’ అని చివరగా అత్తారింటికి దారేదంటే కిత కిత కిత కిత... అంటూ పిల్లల్ని నవ్వించేవారు. పిల్లలు అత్తారిల్లు అంటే కితకితలు పెడితేనే కానీ నవ్వలేనంత భయపెట్టారు అత్తారింటి గురించి అనిపిస్తోంది.

అందుకే వద్దు ... నాకు ఆ హోదా... ఆ పదవి అసలు వద్దే వద్దు.
‘అమ్మ’గా ఉండిపోతాను. ‘అమ్మలాగే’ ఉండిపోతాను. ‘అమ్మగానే’ నిలిచిపోతాను.
నిన్నమొన్నటి దాకా మా అబ్బాయి తన స్నేహితులందరితో ‘మా అమ్మ నాకు స్నేహితురాలు. అన్నీ నేను మా అమ్మకి చెప్తాను. మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికం ఉండదు. నేను ఉద్యోగం మానేయాలనుకున్నప్పుడు కూడా అమ్మ నన్ను ఒక్క మాట అనలేదు. నీ ఇష్టంరా, నీ కెరీర్‌ జాగ్రత్తగా చూసుకో.. అని నన్ను ప్రేమగా చూసింది’ అంటూ నా గురించి అందరితోనూ ఎంతో మంచిగా చెప్పాడు. ‘మీ అబ్బాయి మీరు తల్లికొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటారట కదా. చాలా సంతోషం. మంచి అమ్మ మీరు, మీ అబ్బాయి కూడా మంచివాడు’ అని అందరి చేత మంచి అనిపించుకున్నాను ఇప్పటివరకు. అందుకే నేను అమ్మగానే ఉండిపోవాలనుకున్నాను.

మరి అత్తగారి పదవి తప్పదు కదా. అలా ఉండాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. సరిగ్గా అప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అత్తాకోడళ్ల అంచు ఖాదీ పంచెలు తయారుచేస్తారు. ఒక అంచు ఆకుపచ్చ రంగు, ఒక అంచు ఎరుపు రంగు ఉన్న పంచెలను అత్తాకోడళ్ల అంచుల పంచె అనేవారు. పంచెను ఒక కుటుంబంగా భావిస్తే, ఆ కుటుంబానికి అత్తాకోడళ్లిద్దరే వారధులుగా ఉంటారనే ఉద్దేశ్యంతోనే ఇలా తయారుచేసి ఉంటారేమోనని నాకు ఈ సందర్భంలో అనిపించింది. నిజమే కదా! ఆ పక్కన ఒకరు, ఈ పక్కన ఒకరు ఉండి, కుటుంబాన్ని ఒక చట్రంలో బిగిస్తేనే కదా ఆ బంధం బలపడుతుంది అనిపించింది. అత్తాకోడళ్లు కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పంచెలను తయారుచేశారేమో!!! 
అయ్యో... 
దారి ఎటో వెళ్లిపోతోంది...
అసలు కథలోకి వద్దాం...

ఇప్పుడు ఈ కొత్త పదవితో నేను చెడ్డదాన్ని అవ్వాలా అనే అంతర్మధనం మొదలైంది నాలో. అబ్బాయి పెళ్లి కుదిరిన నాటి నుంచి ఈ కారణంగానే నేను చాలా నిద్ర లేని కాటుక చీకటి రాత్రులు గడిపాను. నేను ఎందుకు అలా ఉంటున్నానో ఎవరికీ అర్థం కాలేదు. ‘కోడలు వస్తుంటే హుషారుగా ఉండాలి. ఇక ఆ అమ్మాయే అన్నీ చేసిపెడుతుంది, నువ్వు హాయిగా కాలి మీద కాలు వేసుకుని కూర్చుని పెత్తనం చలాయించు’ అంటుంటే, నాకు చాలా బాధ వేసింది. కోడలంటే అత్తగారికి సేవలు చేయడానికేనా! ఏరోజూ అత్తగారికి సేవలు చేయలేని నేను మాత్రం దర్జాగా కూర్చుని, ఆ చిన్నపిల్లతో అన్నీ చేయించుకోవాలా! ఇంతకు మించిన అన్యాయం ఉందా?’ అని నా మనసు నా ఆలోచనల మీద అనునిత్యం కొరడా ఝళిపిస్తూనే ఉంది. ‘నేను ఏనాడైనా అత్తగారికి సేవ చేయవలసిన అవసరం వచ్చిందా! అసలు మా అత్తగారికి చేయించుకునే అలవాటే లేదు. ఇంక నేను ఎందుకు చేయాల్సి వస్తుంది? నేను కూడా అలాగే ఉండాలి’. అందుకే అత్తగారు పదవి వద్దనుకున్నాను.

పెళ్లికి ముందు రోజు వరకు నా దగ్గరే పడుకుని, నాతో ఎన్నో కబుర్లు చెప్పిన మా అబ్బాయి పెళ్లి చేసుకుని తీసుకువచ్చిన అమ్మాయిని వాడితో సమానంగానే చూడాలనే కనీస జ్ఞానం, సంస్కారం జన్మతః అలవడ్డాయి. అందుకే నాకు అత్తగారు పదవి వద్దనుకున్నాను.
అత్తవారింట్లో కుడి కాలు పెట్టిన కోడలిని, పుట్టిల్లు మరచిపోయేలా చూడాలే కాని, నిరంతరం పుట్టిల్లు గుర్తుకు వచ్చేలా చేయడం ఎంత అన్యాయం. పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులను, తనతో సమానంగా ఆడుకున్న అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములను విడిచి, ఎవ్వరూ తెలియని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలికి ఆ ఇల్లు పుట్టిల్లులాగే ఉండాలి. తన జీవితంలో ఎక్కువ భాగం అత్తవారింట్లోనే గడుస్తుంది. అటువంటి ఆ ఇల్లు నరకంగాను, అత్తగారు యముడిలాగాను ఉంటే, ఆడపిల్లకు పెళ్లి ఎందుకు. పెళ్లి మధువులు ఒలకపోయాలే కాని, విషచషకాలు మిగల్చకూడదు.

నా మనసు ఎటుపడితే అటుగా నిముషానికి ఒకలాగ ఊగిసలాడుతూనే ఉంది. ఒక్క క్షణం కూడా కుదురుగా నిలబడట్లేదు. నేను గట్టిగా పట్టి లాగి ఒక చోట కూర్చోపెడదామన్నా, నా మాట విననంటూ మొండికేసింది. ఎందుకు వినాలి? మనసుకు స్వేచ్ఛనిస్తేనే మనిషిని సక్రమ మార్గంలో పెడుతుంది!!!
శాఖాచంక్రమణం అవుతోంది కదూ! వర్తమానంలోకి వద్దాం!
‘అత్తగారు పదవి వద్దంటావెందుకు. ఆ పేరుకి మంచి పేరు తీసుకురావచ్చుగా’ అని మరి కొందరు అన్నారు. అది సాధ్యపడదని నాకు తెలుసు. సూర్యకాంతం పేరు పెట్టుకోవడానికి ఎవరైనా సాహసించగలుగుతున్నారా. సూర్యకాంతం మెత్తటి మనసు ఉన్న ఉత్తమురాలని అందరికీ తెలుసు. కాని ఆ పేరు పెట్టుకోవడానికి మాత్రం ధైర్యం చేయలేరు. అత్తగారు పోస్టు కూడా అంతే. అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడల్లేని అత్త గుణవంతురాలు... ఇలాంటి పాటలు మనుషుల మనసుల్లో మర్రి విత్తనంలాగ నాటుకుపోయాయి. అవి పెద్ద పెద్ద ఊడలుగా విస్తరించాయి. వాటిని పెరికివేయడం ఆ చెట్టును సృష్టించిన బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. అందుకే నేను అత్తగారు అనే పదవిని సునిశితంగా కాదు కొంచెం ఘాటుగానే తిరస్కరిస్తున్నాను.

చిన్నప్పటి నుంచి ఆడపిల్లకు అత్తవారిల్లు అంటే ఎన్నో జాగ్రత్తలు నేర్పిస్తారు. అంత అవసరమా. అత్తవారిల్లే ఆడపిల్లకు పర్మినెంట్‌ అడ్రస్‌ అయినప్పుడు, జీవితకాలం సద్దుకుపోతూనే ఉండాలా. స్వేచ్ఛ అక్కర్లేదా. స్వేచ్ఛను ఎవరైనా హరిస్తున్నారంటే నాకు ఎక్కడ లేని ఆవేశమూ వస్తుంది. సృష్టిలో ప్రతిప్రాణికీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ కోడలికి మాత్రం ఉండకూడదా. ఇదెక్కడి న్యాయం. కోడలు మనిషి కాదా, స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా. ఇలా ఆలోచిస్తూనే ఉంది నా మనసు. అందుకే నేను అత్తగారు పదం నా  దరి చేరకూడదనుకున్నాను. దగ్గరకు రాకుండా ఉండటం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. 
ఇంతవరకు బాగానే ఉంది.

అత్తగారు పదవి వద్దనుకోవడం, కావాలనుకోవడం నా చేతుల్లో ఉన్నదే. కాబట్టి నన్ను నేను ఎప్పటికప్పుడు తప్పులు చేయకుండా సంరక్షించుకుంటున్నాను. అయితే ఇంతలోనే ఏదో తెలియని బాధ ఒకటి నన్ను ఇబ్బందులకు గురిచేస్తోంది. నా మనసు తరచుగా తడి అవుతూనే ఉంది. ఇలా ఆర్ద్రం కావడం తప్పేనేమో. ఎంతైనా నేను కన్న కొడుకు, నేను ప్రేమగా పెంచుకున్న కొడుకు, ఇంతవరకూ నాకు మాత్రమే పంచిన తన ప్రేమను ఇప్పుడు కొత్త అమ్మాయితో పంచుకోవడాన్ని నా తల్లి మనసు అంగీకరించడానికి కొంచెం సమయం పడుతుందేమో. పంచేకొద్దీ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది, తరగదని తెలిసినా ఏదో తెలియని స్వార్థం నా ఆలోచనను కుంచించుకుపోయేలా చేస్తోంది. నెమ్మదిగా వికసించుకోవచ్చు. 

అసలు ఈ మాట అనటం కూడా తప్పేనేమో. అమ్మగా ఉండాలనుకున్న నేను, ఇంటికి రాబోతున్న అమ్మాయిని పరాయిపిల్లగా భావించకపోతే ఈ బాధ కూడా తీరిపోతుంది కదా అనిపించింది.
ఈ సంఘర్షణ నుంచి బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఇలా ఈ ఆలోచనలతో నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి.
ఒకరోజు కల వచ్చిందో, నిజంగానే జరిగిందో తెలియదు కానీ, నాలో కొత్త ఉత్సాహం బయలుదేరింది. ఆషాఢమాసం పూరై్త శ్రావణ మాసం ప్రారంభమైంది. ఆషాఢంలో అత్తకోడళ్లు ఒకే గడప దాటకూడదని ఎవరో ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అమ్మాయి ఆషాఢమంతా పుట్టింట్లోనే ఉండి, శ్రావణ మాసం నోములు కూడా ప్రారంభించి, వరలక్ష్మీ వ్రతానికిæ ఇంటికి వస్తోంది. నాలోని అమ్మ మనసు మరింత ఉరకలు వేయడం ప్రారంభించింది. అమ్మాయికి శ్రావణ శుక్రవారం నోముకి కావలసినవన్నీ సిద్ధం చేశాను, బంగారు నల్లపూసలు, పట్టు చీరతో పాటు, రకరకాల గాజులు, పండ్లు, పూలు తీసుకువచ్చాను. అమ్మాయికి ఇష్టమైనవన్నీ సిద్ధం చేశాను.

అసలు విషయం మర్చిపోయాను, ఇంటికి వచ్చిన అమ్మాయి, అత్తగారిని ‘అత్తమ్మా’ అని కూడా పిలుస్తుంది కదా. అలాగే ఇంగ్లీషులో మదర్‌ ఇన్‌ లా అంటారు. అంటే ‘చట్టప్రకారం తల్లి’ అనే అర్థం తోచింది నాకు. నిజమే... నేను అత్తమ్మనే.. కాకపోతే అందులో మధ్యన ఉన్న అక్షరం తీసేస్తున్నాను. అంతే. 
మా అబ్బాయి తన ప్రేమను ఇద్దరికీ సమానం పంచినట్లే, నేను కూడా నా ప్రేమను ఆ నూతన దంపతుల మీద సమానంగానే పంచాలని నిశ్చయించుకున్నాను. నా మనసు తేలికపడింది. హమ్మయ్య. నేను అమ్మనే. అత్తగారిని కాదు, అనుకునేసరికి గుండె బరువు పూర్తిగా దిగిపోయింది. మనసు గాలిలో కాదు, ధృవ నక్షత్రం మీద హాయిగా, తేలికగా విహరించసాగింది.
ఇంతలో ఎవరో తలుపు కొట్టారు, తలుపులు తీసేసరికి, మహాలక్ష్మిలా కోడలు గుమ్మంలో నిలబడింది. కోడలు కాదు, ఈ రోజు నుంచి నాకు కూతురితో సమానం. అమ్మాయిని ప్రేమగా లోపలకు తీసుకువెళ్లాను. మా అబ్బాయి నావైపు నవ్వుతూ ఆప్యాయంగా చూశాడు.
- వైజయంతి పురాణపండ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top