మధురం శివమంత్రం... మరువకే ఓ మనసా!

Seen is yours title is ours 03-03-2019 - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

‘‘కాశయ్యా...కాశయ్యా’’ అనే పిలువు వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు కాశయ్య. అక్కడొక  పండు వృద్ధుడు.‘‘ఏమిటయ్యా...బొడ్డు కోసి పేరు పెట్టినట్లు పిలుస్తున్నావు. నా పేరు నీకెలా తెలుసు?’’ఆశ్చర్యంగా అడిగాడు కాశయ్య.‘‘నీ తాత ముత్తాతలందరూ నాకు తెలుసు కాశయ్యా. తిన్నయ్య ఇల్లు తెలుసా నీకు?’’‘‘ఏ తిన్నయ్య?’’‘‘బోయ తిన్నయ్య. అతనికి నేను బంటుని’’ అన్నాడు ఆ వృద్ధుడు.‘‘బాగుంది బాగుంది...మూరెడు మనిషికి బారెడు బంటు. బోయవాడంటావు...వాడికి నువ్వు బంటునంటావు. భలే గమ్మత్తుగా ఉంది’’ అని వెటకారం చేశాడు కాశయ్య.‘‘అతని సేవకునిగా ఉండాలనినాకు బుద్ధి పుట్టింది. ఉంటాను. ఇందులో తప్పేముంది?’’ అని అడిగాడు వృద్ధుడు.‘‘అడవిలో అవి ఇవి కొట్టుకొని తినేవాడు నీకేం ఇవ్వగలడు తాతా?’’ అడిగాడు కాశయ్య.‘‘తనువు, మనసు అన్నీఇస్తాడు. అతనిలాగా కోట్ల మంది ఉన్నా...వాళ్లకు నేను సేవ చేస్తాను’’ వివరించాడు వృద్ధుడు.‘‘ధనం లేకుండా మనసు, తనువు ఉన్నా ఏం చేసుకుంటావు తాతయ్యా? కూర వండుకుంటావా?’’వెటకారంగా నవ్వాడు కాశయ్య.

‘‘ధనం ఎందుకు కాశయ్యా...అది ఇవ్వాళ ఉంటుంది. రేపు వెళ్లిపోతుంది. అతని మంచితనానికి లొంగిపోయి అతనికి బంటుగా కుదురుకున్నాను...అయితే అతని ఇల్లు ఎక్కడ ఉందో తెలియదా? ఎవర్నైనా కనుక్కొని వెళతానులే...’’ అంటూ రెండడుగులు వేసి తుళ్లిపడబోయాడు తాతయ్య.‘‘అయ్యో పాపం ఈ వయసులో నీకు ఈ కష్టం ఏమిటి తాతయ్యా. ఏది అది నాచేతికివ్వు’’ అని తాతయ్య నెత్తి మీద ఉన్న మూటను తీసుకోబోతుంటే...‘‘వద్దు బాబూ...వద్దు. ఎవరి బరువు వారే మోయాలి. ఒకరి బరువు ఇంకొకరు మోయడం సాధ్యమవుతుందా’’ అంటూ వారించబోయాడు తాతయ్య.కాశయ్య వింటేగా!‘‘ఫరవాలేదు, ఇవ్వు తాతయ్యా’’ అని తాతయ్య నెత్తి మీది మూటను తీసుకొని తన నెత్తి మీద పెట్టుకున్నాడు.అంతే...బరువు భరించలేక ‘‘చచ్చాన్రోయ్‌’’ అని అరిచాడు. మూటను తిరిగి తాతయ్యకు ఇచ్చి...‘‘ఇదేమిటి! కైలాసపర్వతం ఎత్తిన రావణుడి పరిస్థితి అయింది నాకు. గుడ్లు ఊడి వచ్చాయి. చేతులు నొప్పెడుతున్నాయి’’ అన్నాడు బాధగా కాశయ్య.ఆ తరువాత...‘ఇంత బరువు ఉంది.ఏమిటున్నాయి ఇందులో?’’ అని అడిగాడు.‘‘బట్ట, పాత, ధనం, ధాన్యం, పాపం, పుణ్యం...ఇంకా ఏవేవో ఉన్నాయి. అందుకే వద్దని చెప్పాను’’ అన్నాడు ఆ పెద్దాయన.‘‘పాపం, పుణ్యమా!’’ ఆశ్చర్యపోయాడు కాశయ్య.‘‘నువ్వు చూస్తే మనిషి మాత్రుడిలా లేవు. నీపేరేమిటి తాతయ్యా?’’ అని అడిగాడు కాశయ్య.‘‘ఈ  పేదవాడి పేరుతో విలువ ఏముందయ్యా...ఈ లోకంలో చుట్టాలు,స్నేహితులు, నచ్చిన వాళ్లు నచ్చని వాళ్లు అందరూ...శివయ్య...శంకరయ్య...రుద్రయ్య అని పిలుచుకుంటారు. పాపం చేతులు నొప్పెడుతున్నట్లున్నాయి. పోతాయిలే’’ అంటూ బయలుదేరాడు తాతయ్య.‘‘ఇతని సంగతి చూస్తే ఏదో వింతగా ఉంది’’ అని ఆశ్చర్యపడేలోపే కాశయ్య చెయ్యినొప్పి క్షణాల్లో మాయమైపోయింది.‘‘శివయ్య...శంకరయ్య...రుద్రయ్య...ఏమీ అర్థం కాకుండా ఉంది’’ అన్నాడు అయోమయంలో నుంచి వచ్చిన ఆనందంతో!

‘‘అమ్మా...అమ్మా...’’‘‘ఎవరయ్యా?’’‘‘ఈ మూటను మీకు ఇవ్వమని పంపాడు మీ ఆయన. ఇందులో వడ్లు, ధాన్యం, బట్టలు, పండ్లు ఉన్నాయి. నా భార్య చిరిగిపోయిన కోక కట్టుకొని ఉంటుంది. నేను వచ్చేసరికి కొత్త కోక కట్టుకోమని పదేపదే చెప్పాడు’’ అని చెప్పాడు తాతయ్య.‘‘గాలివానలో మా బావ ఏమయ్యాడో తెలియక అల్లాడుతున్న నా ఆరాటాన్ని తగ్గించావు. నువ్వు ఎవరు తాతయ్య?’’ అని అడిగింది ఆ ఇల్లాలు.‘‘మీ బావకు నేను బంటునమ్మా’’ అని చెప్పాడు తాతయ్య.‘‘బంటువా!’’ పెద్దగా ఆశ్చర్యపోయింది ఆమె!!‘‘కాశయ్యా...కాశయ్యా’’ అని అరుచుకుంటూ వస్తున్నాడు తిన్నడు. ‘‘బాబోయ్‌ భూతం’’ అని జడుసుకున్నాడు కాశయ్య.‘‘నేను భూతాన్ని కాదయ్యా...నిన్న నీ బోధనలు విని కండ్లు తెరిచినవాడిని. ఈ పామరుడికి ఈశ్వర మహిమ చూపించావు. జ్ఞానభిక్ష పెట్టావు. నువ్వు చెప్పినట్లే ప్రార్థించాను. రెండు కుందేళ్లు దొరికాయి. ఒక కుందేలు మాంసం కాల్చి ఈశ్వరుడికి పెట్టాను’’ అన్నాడు భక్తి నిండిన కళ్లతో తిన్నడు.‘‘అన్నట్లు నీ పేరేమిటి?’’ అడిగాడు కాశయ్య.‘‘తిన్నడు’’‘‘కోయతిన్నడా...నీకు ఆ శివయ్య సేవకుడిగా ఉన్నాడా?’’‘‘అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడా కాశయ్యా...అసలే నేను ఒక కటిక దరిద్రుడిని. నాకు సేవకుడు కూడానా! అతనే ఈశ్వరుడు. భిక్షగాడిలా నాకు రెండుసార్లు కనిపించాడు! పేరేమిటి? అని అడిగితే శివయ్య అని చెప్పాడు. నేను తెలుసుకోలేకపోయాను. నేను ఇంట్లో లేనప్పుడు నా పెళ్లాం దగ్గరకు వచ్చి నా సేవకుడినని చెప్పినా పెళ్లానికి దర్శనం ఇచ్చి వెళ్లాడు’’ తన్మయంగా చెబుతున్నాడు తిన్నడు.‘‘మహానుభావా, నువ్వు చాలా ధన్యాత్ముడివి. కాశీ...నేనే ఈశ్వరుడినని చెప్పి ఉంటే నీ పాదాల దగ్గర పడి ఉందునే. నా మనసు తెలుసుకోలేకపోయావా’’ తనకు తారసపడ్డ తాతను గుర్తుచేసుకుంటూ అన్నాడు కాశయ్య.‘‘కాశయ్యా, విచారించకు. రా...గుడికి వెళదాం. అతనితో స్వయంగా మాట్లాడదాం. అతని కోసం చాలా చోట్ల వెదికాను. ఎక్కడా కనిపించలేదు. కాశయ్య ఈరోజు నుంచి నువ్వే నా గురువు’’ అన్నాడు తిన్నయ్య.‘‘మహానుభావా,  పరమపాపాత్ముడైన కైలాసశాస్త్రి కొడుకుని. నేను నీకు గురువా?’’ బెరుగ్గా అన్నాడు కాశయ్య.ఆ తరువాత....‘‘దా...గుడికి వెళదాం. మహేశ్వరుడిని ప్రార్థిద్దాం.ఈరోజు నుంచి నువ్వే నేను. నేనే నువ్వు’’ అన్నాడు.శివాలయంలో..తిన్నడు పాడుతున్నాడు.... ‘మధురం శివమంత్రం...మరువకే  ఓ మనసా’
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top