
డాక్టర్ మేఘా సక్సేనా.. ఉత్తరాఖండ్ నివాసి. అక్కడి అల్‌మోరా జిల్లా గవర్నమెంట్ కాలేజ్‌లో పనిచేసేవారు. ప్రజారోగ్యం నుంచి పర్యావరణం వైపు మళ్లారు. ఆమె మెడికల్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడే అల్‌మోరాలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్న ఓ క్లిష్టమైన సమస్యను పరిశీలించారు. అదేంటంటే.. అల్‌మోరాను ఆనుకుని ఉన్న అడవిలోని దేవదారు వృక్షాల మీద పండి రాలిపడి ఎండిన ఆకులు. ఎండిన ఆకులతో సమస్యేంటి అని విస్తుపోయే ముందు ఉత్తరాఖండ్ భౌగోళిక స్వరూపం తెలుసుకోవాలి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 71 శాతం అడవే! అందులో పదహారు శాతం దేవదారు వృక్షాలు! స్థానికంగా వాటిని చిర్ కా పేడ్ అంటారు. ఆ అడవిలో తరచు కారుచిచ్చు రగులుతూ ఉంటుంది. దీనివల్ల 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 54, 801 హెక్టార్ల అడవి తగలబడిపోయింది. కార్చిచ్చు వ్యాపించడానికి కారణం.. పండిపోయి నేలరాలి ఎండిపోయిన దేవదారు ఆకులు! ఇవి అగ్నికి ఆజ్యంలా పనిచేసి అడవిని బూడిదచేస్తూ కర్బన ఉద్గారాలకు తోడవుతున్నాయి.
జీవవైవిధ్యానికి ప్రమాదకారిగా మారుతున్నాయి. దీన్ని గ్రహించిన డాక్టర్ మేఘా సిరంజి సూది మీద నుంచి సూదుల్లాంటి దేవదారు ఆకుల మీద దృష్టిపెట్టారు. అదీగాక తన మెడికల్ ప్రాక్టీస్‌లో.. రసాయన ఎరువులు ప్రజల ఆరోగ్యం మీద చూపుతున్న దుష్ప్రభావాల కేసులనూ చూశారు. ఎండిపోయిన దేవదారు ఆకులతో ఇటు సాగుకు, అటు పర్యావరణానికి ఉపయోగపడే ప్రయోగాలేమైనా చేయొచ్చా అని ఆలోచించసాగారు.
బయోచార్.. ఎకోచార్
ఆలోచన రాగానే రంగంలోకి దిగారు మేఘా. అది 2019 సంవత్సరం. అప్పటికి ఆమె గర్భవతి. మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. ఆ సెలవులను తన ప్రయోగానికి వాడుకోవాలనుకున్నారు. కొంతమంది నిపుణులతో కలిసి ప్రయత్నం మొదలుపెట్టారు. 2021లో ఫలితం వచ్చింది. అది పర్యావరణ ప్రమాదానికి పరిష్కారాన్నే కాదు, తనను ఆంట్రప్రెన్యూర్‌గానూ నిలిపింది.
అదే బయోచార్ (కట్టెబొగ్గు). ఆ స్టార్టప్ పేరు ‘ఎకోచార్’. ఎండిపోయిన ఆకులన్నిటినీ ఏరేయడం వల్ల కార్చిచ్చు వ్యాప్తిని సాధ్యమైనంత వరకు అరికట్టడమే కాకుండా వాటినుంచి తయారైన బయోచార్ చక్కటి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. ఇది నేల సారాన్ని పెంచుతోంది. అంతేకాదు దీన్నుంచి పాలీఫామ్‌లోని కోళ్లకు, చేపల చెరువుల్లోని చేపలకూ కావల్సిన సేంద్రియ దాణానూ తయారు చేశారు.
ఒక కిలో బయోచార్.. పదహారు వందల గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ను నిరోధిస్తుంది. దీనికి ఉత్తరాఖండ్‌లోనే కాదు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ‘నేను పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్న రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం చూడాలని మాత్రమే అనుకున్నాను.
ఆ దిశగా వర్క్ చేశాను. దాని ఫలితం ఈ రెండిటికి పరిష్కారాన్నే కాదు నన్ను అంట్రప్రెన్యూర్‌గానూ మార్చింది. ఈ ఉత్సాహంతో స్థానికంగా దొరికే వనమూలికలు, వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేతనూ తయారుచేయాలనుకుంటున్నాను. నా ప్రస్తుత లక్ష్యం అదే’ అని చెబుతుంది డాక్టర్ మేఘా సక్సేనా.
(చదవండి: డిజిటల్ వేదికపై ఓ నారి పోరు! సామాన్యురాలి విజయగాథ)