
ఆ ఊరికి అంబులెన్స్ రాదు. రాలేదు. కారణం రోడ్డు పూర్తిగా పాడైంది. నెలలు నిండుతున్న గర్భవతి
లీలా సాహు తన ఇన్‌స్టా అకౌంట్‌ను ఆయుధంగా చేసుకుంది. ఎం.పి.ని, ఎం.ఎల్.ఏ.ని, ఆఖరుకు నితిన్ గడ్కరీని కూడా వదల్లేదు. ‘మా ఊళ్లో ఆరుగురు గర్భిణులు ఉన్నారు. మేము ప్రసవానికి ఎలా వెళ్లాలి?’ అని నిలదీసింది. చివరకు ఇది దేశం దృష్టినే ఆకర్షించింది. ఇప్పుడు ఆ ఊళ్లో రోడ్డు పనులు మొదలయ్యాయి. మధ్యప్రదేశ్ సిద్ధి జిల్లాలో ఒక సామాన్యురాలి విజయగాథ.
కొందరికి పోరాడాలంటే భయం. సమస్యలను నలుగురి దృష్టికి తీసుకెళ్లాలంటే భయం. ఇవన్నీ జరిగేవా చచ్చేవా అనే నిస్పృహ. ఈ దేశం బాగుపడదు అని ఎప్పటి నుంచో వినపడే అరిగిపోయిన డైలాగ్ ఒకటి. మనకెందుకు అనే ఫిలాసఫీ ఎలానూ ఉంది. దీని వల్ల ప్రశ్న మాయమైంది. పాలకుల నుంచి వినపడాల్సిన జవాబు కనపడకుండా పోయింది. కానీ 22 ఏళ్ల లీలా సాహుకి తెలుసు– ప్రశ్నిస్తే జనం తోడు నిలుస్తారని. ప్రశ్నలో బలం ఉంటే అది పోరాటంగా మారుతుందని. పోరాటానికి ఫలితం ఉంటుందని. అంతా చేసి ఆమె పెట్టిన ప్రశ్న ‘మా ఊరికి రోడ్డెప్పుడేస్తారు?’ అని.
అది మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా. ఆ జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లీలా సాహు పల్లె ఖడ్డీఖుర్ద్. ఆ ఊరు నుంచి హైవే ఎక్కాలంటే 8 కిలోమీటర్ల కచ్చారోడ్డు ఉంది. ఆ రోడ్డు ఎప్పటి నుంచో పాడైపోయింది. వాన వస్తే బురద. ఏ వాహనం తిరగలేదు. అన్నీ గుంటలే. దాని వల్ల కూడా అంబులెన్స్ రావడం కష్టమవుతోంది. ఆ రోడ్డును వేయించాలని కంకణం కట్టుకుంది లీలా సాహూ. 2023లో మొదటిసారి ఆమె మోదని ఉద్దేశిస్తూ వీడియో చేసింది. ‘మోదీ గారూ.. మధ్యప్రదేశ్ మీకు 29 మంది ఎంపీలను ఇచ్చింది. మా ఊరికి రోడ్డు వేయండి’ అని విన్నవించింది. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత లీలా సాహూ రోడ్డు గురించి కాకుండా ఊరి సమస్యల మీద వీడియోలు చేస్తూ వచ్చింది.
అయితే ఇప్పుడు ఆమె గర్భవతి. నెలలు నిండుతున్నాయి. ఏ క్షణాన్నైనా నొప్పులు వస్తే అంబులెన్స్ వచ్చి సిద్ధి వరకూ తీసుకెళ్తే డెలివరీ అవుతుంది. అయితే గతంలో చాలాసార్లు అంబులెన్స్ ఊరి పొలిమేరల వరకే వచ్చి ఆగిపోయిన సంఘటనలున్నాయి. చాలాసార్లు గర్భిణీలు ట్రాక్టర్లలో వెళ్లాల్సిన దుస్తితి. అందుకే లీలా సాహూ తిరిగి వీడియో యుద్ధం మొదలెట్టింది. ‘నితిన్ గడ్కరీ గారూ... మా ఊరి రోడ్డు చూశారా ఎలా ఉందో’ అని స్థానిక ఎంపీ రాజేశ్ మిశ్రాను ఉద్దేశిస్తూ ‘మా ఊళ్లో ఆరుగురు గర్భిణులు ఉన్నారు. మేమంతా ప్రసవానికి ఎలా వెళ్లాలి’ అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్నను మీడియా ఆ ఎంపీ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు అతను ‘డెలివరీ డేట్ ఉంటుందిగదా... ఆ సమయానికి ఆమెను టౌన్‌ను తీసుకొస్తాం’ అని జవాబు ఇవ్వడంతో సోషల్ మీడియాలో బాగా విమర్శ ఎదురైంది. లీలా సాహూ గర్భిణి కావడం ఆమె పోరాటం సహేతుకం కావడంతో మెల్లగా జనంలో కదలిక వచ్చింది. గ్రామీణులు ఆమెకు దన్నుగా నిలబడ్డారు.
దీంతో ప్రభుత్వం నుంచి ఏ సహాయమూ అందకపోయినా స్థానిక ఎం.ఎల్.ఏ తన జేబు ఖర్చులతో రోడ్డు రిపేరు పనులు మొదలెట్టించాడు. ‘రోడ్డు శాంక్షన్ అయ్యింది... ఈలోపు నా వంతు కృషి చేస్తున్నాను’ అని తెలియచేశాడతడు.రోడ్డు మీద రోడ్డు రోలర్, ఎస్సలేటర్‌లు తిరుగుతుంటే లీలా సాహు ముఖంలో చిర్నవ్వు వచ్చింది.పోరాడండి.. పోయేదేం లేదు... మీ సమస్యలు తప్ప’ అంటోందా విజేత తన విజయ దరహాసంతో.
(చదవండి: స్కాన్ అండ్ పేతో తప్పుతున్న లెక్క..! హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు)