
స్కాన్ అండ్ పే.. వినడానికి ఎంత సింపుల్‌గా ఉంది.. చిల్లర గొడవలేదు.. పెద్దనోట్ల బెడదలేదు.. అనిపిస్తోంది..కదా! అయితే స్కాన్ అండ్ పేతో ఆర్థిక నియంత్రణ కోల్పోతున్నామని, అకౌంట్‌లో డబ్బులు ఇట్టే ఖాళీ అయ్యేది కూడా తెలియడంలేదని పలువురు చెబుతోన్న మాట. డిజిటల్ పేమెంట్స్‌లో ఎంత సౌలభ్యం ఉందో.. అంతే ఇబ్బందులూ ఉన్నాయనేది వాస్తవం.. ఒకప్పుడు ఏదైనా ఖర్చు చేయాలంటే ముందుగా జేబు చూసుకునే అలావాటు ఉండేది. ఆన్‌లైన్ పేమెంట్స్ పుణ్యమాని అదికాస్త అదుపుతప్పింది.. ‘జస్ట్ స్వైప్ అండ్ బై’ ఆప్షన్‌తో నెమ్మదిగా నోట్ల కాలాన్ని మర్చిపోతున్న తరుణంలో ఒక సరికొత్త జీవన శైలికి అలవాటుపడ్డారు. ఈ సౌలభ్యంతో పాటు పెరిగిన ఖర్చులు, తగ్గిన పొదుపులు, అదుపులో లేని ఆర్థిక వ్యయాలకు సంబంధించిన అధ్యయనాలు ఆర్థిక క్రమశిక్షణ అవసరమని హెచ్చరిస్తున్నాయి.
ఆన్‌లైన్ పేమెంట్స్ సిటీ లైఫ్‌స్టైల్‌కు కొత్త ఊపునిచ్చాయి. వేగం, సౌలభ్యం, భద్రతను పెంచాయి. అయితే ఇదే క్రమంలో వ్యయం విషయంలో నియంత్రణను కోల్పోయేలా చేస్తున్నాయని, ఈ సౌలభ్యతతో పాటు ఖర్చులు పెరిగాయని, పుదపు పూర్తిగా తగ్గిపోయిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జీవన ప్రమాణాల పేరుతో అదుపులేని ఖర్చులతో అప్పుల భారం పెరుగుతోందని, ఇది భవిష్య ఆర్థిక భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సూచిస్తున్నారు.
సింగిల్ టచ్‌తో..
డిజిటల్ పేమెంట్స్ వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నామో మర్చిపోతున్నాం. సింగిల్ టచ్‌తో చెల్లింపులు జరిగిపోవడం వల్ల, ఆ ఖర్చు విలువ ఆ క్షణంలో తెలియడం లేదు. ఖరీదైన కాఫీ, ఫుడ్ డెలివరీ, కాస్మొటిక్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఫిట్‌నెస్ యాప్స్, విలాసవంతమైన గ్యాడ్జెట్లు.. ఇలా ప్రతి రోజూ చిన్న చిన్న ఖర్చులన్నీ కలిసిపోయి పెద్ద మొత్తాన్ని తినేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ విషయంలో నియంత్రణ కొరవడుతోంది.
డబ్బు నోట్లను చేత్తో పట్టుకున్నప్పుడు కలిగిన భావన, డిజిటల్ నెంబర్ల రూపంలో ఉండడంలేదని చెబుతున్నారు. పాత రోజుల్లో జీతం వచ్చిన వెంటనే ఒక భాగాన్ని పొదుపుకు ఉంచే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు డబ్బు బ్యాంకులో క్రెడిట్ అయినప్పటికీ, డిజిటల్ పేమెంట్స్ వల్ల ఒక్క రోజు గడిచేలోపు వేగంగా ఖర్చవుతోంది. నెల చివరికి మిగిలే డబ్బు మిగలకపోగా క్రెడిట్‌కార్డులకు చేరువ చేస్తోంది. ఈ కారణంగా, పొదుపు ఖాతాల్లో నిల్వలు కరిగిపోతున్నాయి. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే అలవాటు కూడా మందగిస్తోంది.
ఆర్థిక భద్రత తప్పనిసరి..
హైదరాబాద్ వంటి పట్టణాల్లో యువతరం అత్యంత ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరుపుతుంటారు. నేటితరం జీవనశైలిలో డిజిటల్ లావాదేవీలు.. షార్ట్స్ మెనూ డెలివరీలు, ఓటీటీ ట్రెండ్‌లు, ఇన్‌స్టంట్ బుకింగ్స్, ఈఎంఐలపై ఫోన్‌లు, గ్యాడ్జెట్లు, నిత్యం మారే డిజిటల్ ఖర్చులతో ఆర్థిక భద్రత కనుమరుగవుతోంది. పైగా ఇన్‌స్టెంట్ లోన్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. చిన్న వయసులోనే అప్పులు, క్రెడిట్ కార్డ్ బకాయిల సమస్య తలెత్తుతోంది. వ్యక్తిగత ఆర్థిక భద్రతపై అవగాహన కొరవడుతోంది.
డిజిటల్ డిపెండెన్సీకి వ్యతిరేకంగా..
‘పేమెంట్ సౌలభ్యం ఉండటం మంచిదే.. కానీ, అది మనం పొదుపు చేయడం మర్చిపోయే స్థాయికి వెళితే ప్రమాదమే’.. అన్నది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. డిజిటల్ ట్రాన్సాక్షన్ గణాంకాలు పెరగడమే కాకుండా, ఆర్థిక సమతుల్యత కూడా విపరీతంగా పెరుగుతోంది. సగం మందికిపైగా వినియోగదారులు తాము నెల మొత్తంలో చేసిన ఖర్చు ఎంతో గుర్తించలేని స్థితిలో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారని ఓ అధ్యయనం చెబుతోంది.
ఖర్చులను ట్రాక్ చేసే టెక్నాలజీ..
డిజిటల్ మానిటరింగ్ టూల్స్ వినియోగం ఈ సమస్యకు పరిష్కారంగా ఉంటాయని కొందరు సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో కాయిన్, వాల్‌నట్, ఈటీ మనీ వంటి కొన్న యాప్స్ నెలవారీ బడ్జెట్ అప్లికేషన్లు, ఖర్చులను ట్రాక్ చేయడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే, ‘స్పెండ్ బిఫోర్ యూ ఎర్న్’ తరహా మానసిక ధోరణికి బదులుగా ‘సేవ్ బిఫోర్ యూ స్పెండ్’ అలవాటుగా చేసుకోవాలి.