
ఎస్‌బీఐ నివేదిక
ముంబై: యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీల ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకి మద్దతునిచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేటాయించిన రూ. 437 కోట్ల వార్షిక సబ్సిడీ మొత్తాన్ని మరింతగా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐకి చెందిన ఎకానమిస్టులు ఒక నివేదికలో పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం ఈ వ్యవస్థ నిర్వహణ కోసం పరిశ్రమవర్గాలు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు భారాన్ని మోస్తున్నాయని తెలిపారు.
2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,000 కోట్లుగా ఉన్న సబ్సిడీ మొత్తాన్ని ఈ బడ్జెట్‌లో భారీగా కోత పెట్టడంతో కొన్ని యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని నివేదిక తెలిపింది. దీని ప్రకారం వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.30 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) వసూలు చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతిస్తోంది.
అయితే, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి రూపే డెబిట్ కార్డు, భీమ్–యూపీఐ ద్వారా చెల్లింపులపై చార్జీలను తొలగించింది. మరోవైపు, చిన్న వర్తకులకు యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఉండదు. పైగా రూ. 2,000 వరకు లావాదేవీ మొత్తాలపై 0.15 శాతం వరకు ప్రోత్సాహకాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాన్ని వ్యాపారి బ్యాంకునకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని కస్టమర్ బ్యాంకుతో పాటు మిగతా వర్గాలన్నీ కలిసి పంచుకుంటాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో అమెరికన్ సంస్థలకు చెందిన ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యం నెలకొనడమనేది దేశీ ఫిన్‌టెక్ సంస్థలను తొక్కేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.