
దేశంలో 85 శాతం డిజిటల్ చెల్లింపులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రూపంలోనే జరుగుతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్ యూపీఐ లావాదేవీలు నమోదవుతున్నాయని, వీటి విలువ 280 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు.
సమ్మిళిత, సురక్షిత, విస్తరణకు అనుకూలమైన డిజిటల్ పబ్లిక్ ఫ్లాట్‌ఫామ్‌ల (డీపీపీలు) విషయంలో భారత్ ప్రపంచానికి ఒక కేసు స్టడీ (అధ్యయనం చేయతగిన) అవుతుందన్నారు. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా ఆర్‌బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు.
సమ్మిళిత వృద్ధి, ఆవిష్కరణలకు డిజిటల్ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రేరణినిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ గుర్తింపునకు ఉద్దేశించిన ఆధార్, రియల్‌టైమ్ చెల్లింపులకు వీలు కల్పిస్తున్న యూపీఐ ద్వారా.. తక్కువ వ్యయాలతో, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే వ్యవస్థలకు ఎలా నిర్మించొచ్చో విజయవంతంగా చూపించినట్టు పేర్కొన్నారు.
డిజిటల్ పరివర్తనను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తితో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. యూపీఐని ఒక ముఖ్యమైన డిజిటల్ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌గా పేర్కొంటూ, చెల్లింపుల ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చేసినట్టు చెప్పారు.