
గత కొంత కాలంగా పలువురు యూట్యూబర్లు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. చేతిలో చానెల్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి జనం మీదకు వదులుతున్నారని వీరిపై అనేక మంది మండిపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొందరు విశ్లేషణాత్మక, ఆలోచింపజేసే వీడియోలను చేస్తూ ఆసక్తిని కలిగిస్తున్నారు. అలాంటిదే ఒక తాజా వీడియో ని యూ ట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేశాడు. తన వీడియో ద్వారా కనీస సామాజిక బాధ్యత లేకుండా డబ్బే పరమావధిగా ప్రకటనల్లో నటించేందుకు తెగబడుతున్న సెలబ్రిటీలు అందరికీ రాథీ వాతపెట్టాడు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలు తమ పాప్యులారిటీని పైసల కోసం ఎడాపెడా వాడుకుంటున్న నేపధ్యంలో ఈ వీడియో అనేకమందిని ఆకర్షించింది.
హాలీవుడ్ స్టార్స్‌ని దాటేసిన షారూఖ్
షారూఖ్ ఖాన్ కు నా ప్రశ్న‘ పేరుతో భారతీయ యూట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేసిన ఇటీవలి వీడియో లో చెప్పిన ప్రకారం... బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్ అధికారికంగా బిలియనీర్ ట్యాగ్‌ని అందుకున్నారు, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ఈ నటుడి నికర విలువను 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. ఈ నేపధ్యంలో ఈ బాలీవుడ్ స్టార్ నికర విలువ, సంపదల విషయంలో టామ్ క్రూజ్ ది రాక్ (డ్వేన్ జాన్సన్) వంటి టాప్ హాలీవుడ్ నటులను సైతం అధిగమించిట్టు వెల్లడించింది. ప్రస్తుతం షారూఖ్ ఆస్తుల విలువ అక్షరాలా.. దాదాపు రూ. 12,400 కోట్లు. మీరు విన్నది నిజమే ‘షారూఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. వార్తా నివేదికల ప్రకారం, ఆయన నికర విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే రూ. 12,400 కోట్లకు పెరిగింది‘ అని రాతీ చెప్పారు. ‘అది ఎంత డబ్బో మీకు తెలుసా? అబ్బో మనం ఊహించడం కూడా కష్టం,‘ అని అతను నొక్కి చెప్పాడు.
కూర్చుని తిన్నా తరగనంత...
పన్నులు వడ్డీ రేట్లు తీసివేసిన తర్వాత , ప్రతిరోజూ ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి, అత్యంత ఖరీదైన హోటళ్లలో జవాన్ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా, అతను తన మొత్తం నికర విలువలో దాదాపు రూ. 400–500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడని రాథీ వీడియోలో విశ్లేషించాడు. ఈ నేపధ్యంలో ‘షారూఖ్ ఖాన్‌కి నా ప్రశ్న, మీకు ఈ డబ్బు సరిపోలేదా? అది సరిపోతే, మీరు ఇంకా పాన్ మసాలా వంటి హానికరమైనదాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు ఇంకా ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు?‘అంటూ రాథీ బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాడు.
గత 2014లో పాన్ మసాలా బ్రాండ్ కోసం ఖాన్ వసూలు చేసిన ఎండార్స్‌మెంట్ రుసుము గురించి కూడా రాథీ చర్చించాడు ‘‘మీకు నిజంగా ఈ అదనపు రూ. 100–200 కోట్లు అవసరమా?‘ అని నిలదీశాడు‘ దాని గురించి మరొక విధంగా ఆలోచించండి: దేశంలోని అగ్ర నటుడు ఈ హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడాన్ని ఆపివేస్తే, అది దేశంపై ఎంతటి మంచి ప్రభావం చూపుతుంది?‘ అంటూ ఆలోచించమని కోరాడు. అంతేకాదు ఆ వీడియోను సదరు సూపర్‌స్టార్‌కి చేరేలా ప్రచారం చేయమని ప్రేక్షకులను కోరడం ద్వారా అతను వీడియోను ముగించాడు.
గత కొంతకాలంగా తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సహా అనేక రకాలైన సమాజ వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు. కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ సైతం ఓ మద్యం బ్రాండ్ కు ప్రచారం చేయడం తీవ్రమైన విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రతీ సెలబ్రిటీని, సినీ అభిమానిని ఆలోచింపజేసేలా థృవ్ రాథీ వీడియో ఉందనేది నిస్సందేహం.
My question to Shah Rukh Khan.@iamsrk pic.twitter.com/MZjCbsIkjx
— Dhruv Rathee (@dhruv_rathee) October 15, 2025