ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?

ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?


గర్భధారణకు ముందు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయగలరు. ‘అల్ట్రాసౌండ్‌ స్కాన్‌’ ఎందుకు చేయించుకోవాలి? గర్భధారణకు ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

– ఆర్‌.రేఖ, తుని



గర్భం కోసం ప్రయత్నం చేయకముందు నుంచే కొన్ని జాగ్రత్తలు, పరీక్షలు చేయించుకోవటం వల్ల, గర్భం దాల్చిన తర్వాత, తల్లికి, బిడ్డకి చాలావరకు సమస్యలు ఎక్కువ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ముందుగా అధిక బరువు ఉంటే తగ్గటం, మరీ సన్నగా బలహీనంగా ఉంటే పౌష్టికాహారం తీసుకుని కొంచెం బరువు పెరగటం మంచిది. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం, షుగర్‌ లెవెల్స్, థైరాయిడ్‌ హార్మోన్‌ లెవెల్స్‌ వంటి అవసరమైన పరీక్షలు గర్భం కోసం ప్రయత్నించక ముందే చేయించుకుని, వాటిలో సమస్య ఉంటే ముందుగానే చికిత్స తీసుకోవటం మంచిది. ముందు నుంచే షుగర్, బీపీ, ఫిట్స్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే, వారు డాక్టర్‌ని సంప్రదించి, వాడే మందులలో ఏమైనా మార్పులు ఉంటే గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు, మార్పులు చేసుకొని వాడటం మంచిది. గర్భం కోసం ప్రయత్నించేటప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తప్పనిసరిగా చేసుకోవలసిన అవసరం లేదు. పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవటం, ఇంకా పీరియడ్స్‌లో ఇతర సమస్యలు ఉంటే, హార్మోన్ల సమస్యలు, గర్భాశయం, అండాశయాలలో నీటితిత్తులు, సిస్ట్‌లు వంటివి ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి స్కానింగ్‌ చేయించుకోవచ్చు. సమస్యలు నిర్ధారణ అయితే, గర్భధారణకు ముందే చికిత్స తీసుకుంటే, అబార్షన్లు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆహారంలో అన్నం తక్కువగా తీసుకుని, ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం తీసుకోవటం మంచిది. గర్భధారణకు మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్ర రోజుకొకటి తీసుకోవటం మంచిది. దీనివల్ల పుట్టబోయే బిడ్డలో చాలా వరకు మెదడుకి, వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.



ఎప్పుడూ శాంతంగా కనిపించే నేను కొన్ని సమయాల్లో మాత్రం చీటికీ మాటికీ అందరితో గొడవ పడుతుంటాను. హర్మోన్ల అసమతౌల్యం వల్ల నెలసరికి ముందు కోపం, విసుగులాంటి లక్షణాలతో  ఇలా జరగడం సహజమేనని అంటున్నారు. ఇది ప్రకృతి సహజమని సరిపెట్టుకోవాలా? లేక ఆ సమయంలో కూడా సాధారణంగా ఉండటానికి ఏమైనా పరిష్కారాలు, మందులు ఉన్నాయా?

– ఎన్‌.సి, చిత్తూరు



పీరియడ్స్‌ వచ్చే వారం పది రోజుల ముందు నుంచే కొందరిలో కొన్ని హార్మోన్ల అసమతుల్యత, మినరల్స్‌ లోపం వంటి కొన్ని ఇంకా తెలియని కారణాల వల్ల విసుగు, కోపం, ఆందోళన, ఏడుపు, డిప్రెషన్, ఒంట్లో నీరు రావడం, రొమ్ములలో నొప్పి వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. దీనినే ప్రిమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (pట్ఛఝ్ఛnట్టటu్చ∙టynఛీటౌఝ్ఛ, pఝట) అంటారు. వ్యాయామాలు, వాకింగ్, ధ్యానం వంటివి చేయడం వల్ల చాలామందిలో ఈ లక్షణాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి ప్రైమ్‌రోజ్‌ ఆయిల్, విటమిన్స్, మినరల్స్‌ కలిగిన మాత్రలు 3 నుంచి 6 నెలలు వాడి చూడవచ్చు. ఆ సమయంలో ఉప్పు, ఆహారంలో చక్కెర, కాఫీలు తగ్గించి తీసుకోవటం మంచిది. విసుగు, కోపం వంటి లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించి కొన్ని రోజులు యాంటీ డిప్రెసెంట్, టెన్షన్‌ తగ్గించే మందులు వాడి చూడవచ్చు.





ఆటిజమ్‌ కలిగిన స్త్రీలు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ కూడా ఆటిజమ్‌తో జన్మిస్తుందా? ఇతర సమస్యలు ఏమైనా ఉంటాయా? దీనికి ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయా?

– డి.కె, జిమ్మకుంట



ఆటిజమ్‌ అంటే పుట్టుకలో వచ్చే మెదడు లోపం, వినికిడి లోపం, దాని ద్వారా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. ఆటిజమ్‌ అనే సమస్య, జన్యుపరమైన సమస్యలు, పర్యావరణంలో మార్పులు, పుట్టుకతో వచ్చే మెదడు నిర్మాణం, పనితీరులో లోపాలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు రుబెల్లా వంటి ఇన్‌ఫెక్షన్‌లు, కొన్ని రకాల మందులు వాడటం వంటివి, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడుతుంది. తల్లిలో ఆటిజమ్‌ జన్యుపరమైన కారణాల వల్ల వచ్చి ఉండి, ఆ లోపం కలిగిన జన్యువు బిడ్డకు కూడా సంక్రమించి దానికి ఇంకో లోపం గల జన్యువు జతకలిస్తే బిడ్డలో ఆటిజమ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాన్పు సమయంలో ఇబ్బందుల వల్ల కూడా కొన్నిసార్లు ఆటిజమ్‌ ఏర్పడవచ్చు. పుట్టబోయే బిడ్డలో ఆటిజమ్‌ ఉందా లేదా అని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవటం కష్టం. ఐదవ నెల చివరిలో చేసే టిఫా స్కానింగ్‌లో బిడ్డలో మెదడు నిర్మాణంలో కొన్ని లోపాలను తెలుసుకోవచ్చు కాని, మెదడు పనితీరును కనుక్కోవటం కష్టం. బిడ్డ పుట్టి పెరిగే కొద్దీ కొన్ని లోపాలు బయటకు తెలుస్తాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top