మానడం కష్టంగా ఉంది

sakshi Special health counseling

నాకు స్మోకింగ్‌ హ్యాబిట్‌ ఉంది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ను. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ స్మోకింగ్‌ చేయడం ప్రమాదం అనే విషయం నాకు తెలిసినా... ఈ అలవాటును మానడం కష్టంగా  ఉంది. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ పొగ మానేయడానికి ప్రత్యేక పద్ధతులు ఏమైనా ఉన్నాయా? "text4baby' లాంటి పోగ్రామ్‌ల ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా?
– వి, హైదరాబాద్‌

స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి వాటికి బానిస అయిన తర్వాత, వాటి నుంచి బయటపడటం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్మోకింగ్‌వల్ల సిగరెట్‌లో ఉండే నికోటిన్, కార్బన్‌ మోనాక్సైడ్, లెడ్, ఆర్సినిక్‌ వంటి పదార్థాల వల్ల అబార్షన్లు, బిడ్డలో అవయవ లోపాలు, బిడ్డ కడుపులో చనిపోవడం, బిడ్డ బరువు పెరగకపోవటం, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, బిడ్డ పుట్టిన తర్వాత మానసిక ఎదుగుదలలో లోపాలు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. స్మోకింగ్‌ నుంచి బయటపడటానికి డాక్టర్‌ దగ్గర కౌన్సిలింగ్, మోటివేషన్‌ ఎంతో అవసరం.

అలాగే కొన్ని సపోర్ట్‌ గ్రూప్స్‌లో కలసి మాట్లాడటం మంచిది. స్మోకింగ్‌ నుంచి దృష్టి మళ్లించటానికి, పనిలో ఎక్కువగా నిమగ్నమవడం, స్నేహితులని, బంధువులని కలవడం, వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్‌ వంటివి చేయడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల కొన్నిసార్లు మొత్తంగా ఒకేసారి మానలేకపోయినా, అప్పుడప్పుడు తీసుకున్నా, గుడ్డిలో మెల్లలాగా కొంతవరకు ప్రెగ్నెన్సీలో సమస్యల తీవ్రత కొద్దిగా అయినా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకేసారి మానేయడం వల్ల తల్లిలో చిరాకు, కోపం, ఆరాటం, తలనొప్పి వంటివాటితో ఇబ్బందిపడటం జరుగుతుంది. ఇవి మెల్లగా 10–14 రోజులకు సర్దుకుంటాయి. ఈ సమయంలో కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం.

ఎంత ప్రయత్నించినా వీలు కానప్పుడు, నికోటిన్‌ గమ్స్, నేసల్‌ స్ప్రే వంటివి అతి తక్కువగా వాడవచ్చు. వీటి ప్రభావం స్మోకింగ్‌తో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది.  text4baby  ప్రోగ్రామ్‌ అనేది ప్రెగ్నెన్సీ సంబంధిత విషయాలను, తెలియజేసే ఒక ఫోన్‌ అప్లికేషన్‌ లాంటిది. దీంతో నీ వివరాలను లాగిన్‌ చేస్తే, తద్వారా నీ సందేహాలకు సలహాలను ఫోన్‌లో మెసేజ్‌ల ద్వారా అందజేయడం జరుగుతుంది. నీకు క్రమం తప్పకుండా సలహాలను, ఇంకా డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌లను గుర్తుచేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది. దాంట్లో రిజిస్టర్‌ చేసుకొని చూడవచ్చు.

స్మోకింగ్‌ నుంచి బయటపడటానికి డాక్టర్‌ దగ్గర కౌన్సిలింగ్, మోటివేషన్‌ ఎంతో అవసరం. అలాగే కొన్ని సపోర్ట్‌ గ్రూప్స్‌లో కలసి మాట్లాడటం మంచిది. స్మోకింగ్‌ నుంచి దృష్టి మళ్లించటానికి, పనిలో ఎక్కువగా నిమగ్నమవడం, స్నేహితులని, బంధువులని కలవడం, వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్‌ వంటివి చేయడం మంచిది.

పోస్ట్‌ డెలివరీ కాంప్లికేషన్స్‌ అంటే ఏమిటి?  ఎలాంటి సందర్భాల్లో ఇవి వస్తాయి? ముందు జాగ్రత్తలు తీసుకునే వీలుందా? తెలియజేయగలరు.
– కె.సుమతి, విజయవాడ

కాన్పు తర్వాత, ప్రెగ్నెన్సీ హార్మోన్ల, శారీరక మార్పుల వల్ల, కాన్పు సమయంలో జరిగే మార్పుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని పోస్ట్‌ డెలివరీ కాంప్లికేషన్స్‌ అంటారు. వీటిలో కొన్ని ప్రాణాంతకంగా కూడా మారుతాయి. మొదటిది పోస్ట్‌పార్టమ్‌ హేమరేజ్‌ అంటే కాన్పు తర్వాత అధికంగా, అదుపులో లేకుండా బ్లీడింగ్‌ అయిపోవడం, తర్వాత గర్భాశయ, జననేంద్రియాలలో, మూత్రాశయం, కుట్ల దగ్గర ఇన్‌ఫెక్షన్‌ సోకటం, అది మొత్తం రక్తం ద్వారా అన్ని అవయవాలకు సోకటం, బీపీ పెరిగి ఫిట్స్‌ రావటం, రక్తనాళాలలో రక్తం గూడుకట్టి, (ఎంబోలిసమ్‌) పల్మనరీ ఊపిరి ఆడకుండా ఆయాసపడుతూ, ప్రాణాంతకంగా మారడం, రొమ్ములలో పాలు గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్‌లు రావటం, పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యలు ఎవరికి, ఎప్పుడు, ఎందుకు వస్తాయి అనేది చాలావరకు చెప్పటం కష్టం.

అలాగే ముందు తెలుసుకోవటం కూడా కష్టం. రక్తహీనత, బరువు ఎక్కువ ఉండటం, మరీ బలహీనంగా ఉండటం, గర్భిణీ సమయంలో సరిగా జాగ్రత్తలు పాటించకపోవటం, రెగ్యులర్‌గా డాక్టర్‌ని సంప్రదించకపోవటం వంటి కారణాల వల్ల, పోస్ట్‌ డెలివరీ కాంప్లికేషన్స్‌ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా, వయసుని బట్టి, శరీర తత్వాన్ని బట్టి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల కాన్పు తర్వాత కాంప్లికేషన్స్‌ రావచ్చు. కాన్పు తర్వాత కాంప్లికేషన్స్‌ ఏవీ రాకుండా నివారించలేకపోవచ్చు కాని, ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల, చాలా వరకు కాంప్లికేషన్స్‌ రాకుండా, ఒకవేళ వచ్చినా, వాటి నుంచి చాలావరకు బయటపడే అవకాశాలు ఉంటాయి.

 ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచే డాక్టర్‌ని సంప్రదించి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, ప్రెగ్నెన్సీని ప్లాన్‌ చేసుకోవడం.

ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత క్రమంగా చెకప్‌లకు వెళ్లడం, డాక్టర్‌ సలహాలు పాటిస్తూ, పౌషికాహారం, ఐరన్, క్యాల్షియం మందులు వాడటం, ఇంకా అవసరమైన మందులు వాడటం, అవసరమైన రక్తపరీక్షలు, స్కానింగ్‌ వంటివి చెయ్యించుకోవడం.

కాన్పు సమయానికి రక్తహీనత లేకుండా చూసుకోవడం, బీపీ సాధారణంగా ఉందా లేదా అని గమనించుకోవటం. బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవటం.

కాన్పు ఇంట్లో కాకుండా, వసతులు సరిగా ఉన్న హాస్పిటల్‌లో చెయ్యించుకోవటం మంచిది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top