అలా చేస్తే ప్రమాదమా? | Sakshi
Sakshi News home page

అలా చేస్తే ప్రమాదమా?

Published Sun, Nov 12 2017 6:24 AM

sakshi special health counseling - Sakshi

నాకు బ్లాక్‌ టీ తాగడం బాగా అలవాటు. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ప్రెగ్నెన్సీ సమయంలో బ్లాక్‌ టీ తీసుకోవడం ప్రమాదమని ఒకరు సలహా ఇచ్చారు. ప్రెగ్నెన్సీ సమయంలో బ్లాక్‌ టీ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది?
–డి.కె, హైదరాబాద్‌

ప్రెగ్నెన్సీ సమయంలో బ్లాక్‌ టీ ఎక్కువగా తాగడం వల్ల, దానిలో ఉండే కెఫీన్‌ ప్రభావం వల్ల అబార్షన్లు అవ్వడం, పుట్టే పిల్లల్లో అవయవ లోపాలు, నెలలు నిండకుండా కాన్పు అవ్వడం, బిడ్డ ఎక్కువగా బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవటం, కాన్పు సమయంలో చనిపోవడం వంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు. బ్లాక్‌ టీ ఎక్కువగా తాగడం వల్ల, దాంట్లో ఉండే టానిన్‌ అనే పదార్థం, ఆహారంలో ఉన్న ఐరన్‌ను రక్తంలోకి చేరనీయకుండా చేస్తుంది.

దీని ద్వారా రక్తహీనత ఏర్పడవచ్చు. కెఫిన్‌ ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల మూత్రంకి ఎక్కువసార్లు వెళ్లవలసి రావటం, నిద్ర సరిగా పట్టకపోవటం, బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు, బ్లాక్‌ టీ తాగటం మానేయడం మంచిది. కుదరకపోతే, ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఒక కప్పు బ్లాక్‌ టీలో 40–60 ఎం.జి. కెఫీన్‌ ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో రోజుకి 20–30 ఎం.జి. కెఫీన్‌ కంటే ఎక్కువ తీసుకోవటం వల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరీ తాగకుండా ఉండలేనప్పుడు, రోజుకి ఒక కప్పు తీసుకోవచ్చు. ఇది తీసుకున్నప్పుడు, కోలా, చాకొలేట్‌ వంటివాటికి దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే వాటిలో కూడా కెఫీన్‌ ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో మరణించడానికి ‘హైపర్‌ టెన్షన్‌’  కారణం అనే వాదన ఒకటి ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది? నివారణ గురించి తెలియజేయగలరు.
–బి.విమల, విజయవాడ

ప్రెగ్నెన్సీ సమయంలో హైపర్‌ టెన్షన్‌ అంటే బీపీ పెరగడాన్ని, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్‌ హైపర్‌ టెన్షన్‌ అంటారు. కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాక ముందునుంచే బీపీ ఉండి ప్రెగ్నెన్సీలో ఇంకా పెరుగుతుంది. బరువు ఎక్కువగా పెరగడం, మరీ చిన్న వయసు లేదా ఎక్కువ వయసులో ప్రెగ్నెన్సీ రావటం, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉండటం, కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల, రక్తనాళాలు సరిగా వెడల్పు కాకపోవటం వంటి, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో బీపీ పెరగవచ్చు. బీపీ పెరగటం మొదలైన తర్వాత, డాక్టర్‌ పర్యవేక్షణలో సరైన బీపీ మందులు వాడటం, చెకప్స్‌ చెప్పిన సమయానికి చెయ్యించుకోవటం, బీపీ మానిటర్‌ చెయ్యించుకోవటం, బిడ్డ పరిస్థితి గురించి చెకప్‌లు వంటివి క్రమం తప్పకుండా చెయ్యించుకోవటం వల్ల, బీపీ మరీ పెరిగిపోకముందే కాన్పు చేయించుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్లిష్ట సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. బీపీ మరీ ఎక్కువగా పెరిగితే, తల్లిలో ఫిట్స్‌ రావటం (గుర్రపు వాతం), కిడ్నీలు, లివర్‌ పాడవటం, కళ్లు కనిపించకపోవటం, శరీరం నిండా నీరు చేరడం, తర్వాత ప్రాణాపాయం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బీపీ వల్ల బిడ్డకు కూడా రక్తప్రసరణ సరిగా లేకపోవటం, బిడ్డ బరువు పెరగకపోవటం, ఉమ్మనీరు తగ్గిపోవటం, మాయ ముందుగానే విడిపడి, బ్లీడింగ్‌ ఎక్కువగా అయిపోవటం, బిడ్డ కడుపులోనే చనిపోవటం వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉంటే, ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవటం వల్ల కొంతమందిలో బీపీ మరీ ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారంలో ఉప్పు తగ్గించుకుని తీసుకోవటం, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం, యోగ, ధ్యానం వంటివి చెయ్యటం వంటి వాటివల్ల కొందరిలో బీపీ ఎక్కువ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.

గర్భిణి స్త్రీలకు ‘స్వైన్‌ ఫ్లూ’ సోకకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రత్యేకమైన వ్యాక్సిన్‌లు ఏమైనా  అందుబాటులో ఉన్నాయా? మొదలైన వివరాలు తెలియజేయగలరు.
– సుమతి, వేటపాలెం

స్వైన్‌ ఫ్లూ అనేది హెచ్‌.ఎన్‌. అనే ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ సోకటం వల్ల వచ్చే వ్యాధి. దీని లక్షణాలు జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటివి. గర్భిణీలలో రోగ నిరోధకశక్తి మామూలు వారితో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల వీరిలో ఈ వైరస్‌ తొందరగా సంక్రమించి, వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉండి, కొన్నిసార్లు ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయి. అలాగే అబార్షన్లు, అధిక జ్వరం వల్ల, బిడ్డ కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటివి జరగవచ్చు. గర్భిణీలు, స్వైన్‌ ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది, చేతులు ఎప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి, రద్దీ ప్రదేశాలకు వీలైనంతవరకు వెళ్లకుండా ఉండటం మంచిది.

వెళ్లినా, జలుబు, దగ్గు ఉన్నవాళ్లకి దూరంగా ఉండటం, నోరు, ముక్కు, టిష్యూతో కప్పుకొని ఉండటం మంచిది. ఒకవేళ పైన చెప్పిన లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి, పరీక్ష చేయించుకుని చికిత్స మొదలుపెట్టడం మంచిది. స్వైన్‌ ఫ్లూకి వాడే మందుల వల్ల తల్లికి, బిడ్డకు ఎటువంటి హాని కలుగదు. చుట్టుపక్కల స్వైన్‌ ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు, స్వైన్‌ ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవటం మంచిది. ఇది మార్కెట్‌లో కొన్ని మందుల షాపులలో అందుబాటులో ఉంది. ఇది గర్భిణీలు ఏ నెలలో అయినా తీసుకోవచ్చు. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఎటువంటి దుష్ఫలితాలు లేవని పరిశోధకులు వెల్లడించడం జరిగింది.

Advertisement
Advertisement