సిగరెట్‌తో ఎముకలూ దెబ్బ తింటాయా?

Family health counseling 27-03-2019 - Sakshi

లైఫ్‌ స్టయిల్‌ కౌన్సెలింగ్‌

ఫ్యామిలీ డాక్టర్‌

నా వయసు 35 ఏళ్లు. రోజుకు రెండు పాకెట్ల సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్‌ డి పాళ్లు కూడా తగ్గాయి. ఫ్రెండ్స్‌ మాట్లాడుతూ సిగరెట్లతో ఎముకలు కూడా బలహీనమవుతాయని అంటున్నారు. సిగరెట్‌ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా?  – ఆర్‌. సమీర్, హైదరాబాద్‌ 
పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్‌ డి పాళ్లు తగ్గడం, ఎముకలు క్యాల్షియమ్‌ను గ్రహించడం కూడా తగ్గుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్‌ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్‌ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... 

∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్‌ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్‌ హార్మోన్‌ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్‌ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్‌ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది.   శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్‌ పెరగడం వల్ల క్యాన్సర్‌ రిస్క్‌ పెరుగుతుంది.   రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్‌ వాస్క్యులర్‌ డిసీజ్‌’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది.   పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ.  పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. 

∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతోపాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామి ప్యాసివ్‌ స్మోకింగ్‌ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్‌ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. 

సన్నగా ఉన్నాను... ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా?
నా వయసు 29 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. బరువు కేవలం 48 కేజీలు మాత్రమే. నా ఫ్రెండ్స్‌ అంతా నన్ను చాలా ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు.  – ఎ. సిద్ధార్థ, కర్నూలు 
కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు (ఈటింగ్‌ డిజార్డర్స్‌) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్‌ థైరాయిడిజమ్‌) ∙మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. 

మీకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో  తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్‌ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి.  కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్‌ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్‌ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్‌ డైట్‌ వద్దు  ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా  కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్‌ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక  నట్స్‌ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్‌ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్‌ ఆయిల్‌ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానినిక ఉపయోగపడతాయంటూ న్యూస్‌పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్‌ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు.
డా. సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,   కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top