ఫ్యామిలీ హెల్త్ కౌన్సెలింగ్‌ 

Family Health Counseling - Sakshi

డర్మటాలజీ కౌన్సెలింగ్‌ 
ఎండ పడే చోట్లా ఫెయిర్‌గా కావాలంటే...? 
నా వయసు 18 ఏళ్లు. నా ఒంటిలో దుస్తులు కవర్‌ చేస్తున్న ప్రాంతం తెల్లగానే ఉంది. మిగతాచోట్ల నల్లగా ఉంది. కనిపిస్తుంది. ఈ దుస్తులు కవర్‌ చేయని చేతులు వంటి భాగాలు కూడా  నిగారింపుతో కనిపించడానికి తగిన సూచనలు ఇవ్వండి. 
– సంజన, హైదరాబాద్‌ 

శరీరంలో దుస్తులు కప్పి ఉండే భాగాలపై సూర్యకిరణాలు పడవు. కాబట్టి అక్కడి భాగం తేమను కోల్పోదు. ఫలితంగా సూర్యకాంతి వల్ల జరిగే నష్టం జరగదు. దాంతో దుస్తులు కప్పి ఉండేచోట చర్మం, సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలతో పోలిస్తే కాస్త తెల్లగానూ, మెరుపుతోనూ ఉంటుంది. మీ శరీరంలో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలు నల్లబడకుండా ఉండటానికి సూచనలు ఇవి... 
- సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే మీ చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్‌ ఉండే  మంచి మాయిశ్చరైజర్‌ను పూసుకోండి.
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే శరీర భాగాలకు చెందిన చర్మంపై అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల ప్రతి మూడు గంటలకోసారి 50 ఎస్‌పీఎఫ్‌ ఉండే సన్‌స్క్రీన్‌ రాసుకుంటూ ఉండండి. సాధారణంగా మీరు ఫుల్‌స్లీవ్స్‌ వేసుకోవడం వల్ల మిగతా దేహానికీ అదే నిగారింపు వస్తుంది
గ్లైకోలిక్‌ యాసిడ్‌ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్‌ ఉన్న క్రీములను రాత్రివేళ మీ చర్మంపై పూసుకోండి.
పై సూచనలు పాటించినా ప్రయోజనం కనిపించకపోతే డర్మటాలజిస్ట్‌ను కలిసి కెమికల్‌ పీలింగ్‌ చేయించుకోండి. 

వేలిపై దురద, గీరుకుంటే నలుపు... ఏం చేయాలి? 
నా కుడి చేతి మధ్యవేలిపై వెంట్రుకలు ఉండే భాగంలో తీవ్రమైన దురద వస్తోంది. దాంతో అక్కడ గీరుకున్న కొద్దీ అక్కడి చర్మం నల్లబారిపోయింది. నాకు తగిన పరిష్కారం చూపండి. 
– జగదీష్‌ప్రసాద్, కర్నూలు 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి ఆ భాగంలో బహుశా మీకు అలర్జిక్‌ కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ వచ్చిందేమోనని అనిపిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అక్కడ ఉంగరం ధరించడం లేదా మీరు వాడుతున్న హ్యాండ్‌ వాష్‌ కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్యకు కారణాలు కావచ్చు, మీకు దేనివల్ల ఈ సమస్య వస్తోందో గుర్తించి దానికి దూరంగా ఉండటం నివారణ అంశాల్లో ప్రధానమైనది. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ కింది సూచనలు పాటించండి. 
- ప్రతిరోజూ మీకు దురద వస్తున్న భాగంలో మాయిశ్చరైజింగ్‌ క్రీమును రోజుకు రెండుసార్లు రాయండి. 
- మెమటోజోన్‌ ఫ్యూరోయేట్‌ లాంటి మాడరేట్‌ కార్టికోస్టెరాయిడ్‌ క్రీమ్‌ను ప్రతిరోజూ  మీకు దురద వస్తున్న ప్రాంతంలో రాయండి. దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున 3–5 రోజుల పాటు రాయాలి. అప్పటికీ దురద రావడం తగ్గకపోతే ఒకసారి మీ డర్మటాలజిస్ట్‌కు చూపించండి. 

మొటిమలు విపరీతంగా వస్తున్నాయి... తగ్గేదెలా? 
నా వయసు 19 ఏళ్లు. నా ముఖం మీద మొటిమలు, మచ్చలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా తగ్గడం లేదు. నేను బెట్నోవేట్‌ అనే క్రీమ్‌ వాడుతున్నాను. దాంతోపాటు ఐసోట్రెటినాయిన్‌ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ కూడా తీసుకుంటున్నాను. అయినా ఎలాంటి మార్పూ రావడం లేదు. దయచేసి మొటిమలు, మచ్చలు తగ్గడానికి నేనేం చేయాలో సూచించండి. 
– కె. రవి, విశాఖపట్నం 

మీ వయసు వారిలో ఇలా మొటిమలు రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. ఈ వయసు పిల్లల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల పాళ్లు పెరగడం వల్ల చర్మంపై మొటిమలు రావడం చాలా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మీ విషయంలో ఇది స్టెరాయిడ్‌ ఇండ్యూస్‌డ్‌ యాక్నే లా అనిపిస్తోంది. మీరు బెట్నోవేట్‌ క్రీమ్‌ రాస్తున్నట్లు చెబుతున్నారు. బెట్నోవేట్‌ అనే క్రీమ్‌లో స్టెరాయిడ్‌ ఉంటుంది. దీనిలోని స్టెరాయిడ్‌ వల్ల మొదట్లో కొంచెం ఫలితం కనిపించినట్లు అనిపించినా... ఆ తర్వాత మొండిమొటిమలు (ఒక పట్టాన తగ్గనివి) వస్తాయి. అందుకే మీరు ఈ కింది సూచనలు పాటించండి. 
- మొదట బెట్నోవేట్‌ క్రీమ్‌ వాడటాన్ని ఆపేయండి. 
క్లిండామైసిన్‌ ప్లస్‌ అడాపలీన్‌ కాంబినేషన్‌తో తయారైన క్రీమ్‌ను రోజూ రాత్రిపూట మొటిమలపై రాసుకొని పడుకోండి. 
అజిథ్రోమైసిన్‌–500 ఎంజీ క్యాప్సూల్స్‌ను వరసగా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా వేసుకోండి. ఇలా మూడు వారాలు వేసుకోవాలి. అంటే మొదటివారం సోమ, మంగళ, బుధ వారాలు తీసుకున్నారనుకోండి. దీన్నే రెండో వారం, మూడోవారం కూడా కొనసాగించాలి. ఈ అజిథ్రోమైసిన్‌ క్యాప్సూల్‌ను ఖాళీ కడుపుతో అంటే భోజనానికి ముందుగానీ... ఒకవేళ భోజనం చేస్తే... రెండు గంటల తర్వాత గానీ వేసుకోవాలి. 
మీరు వాడుతున్న ఐసోట్రెటినాయిన్‌ 20 ఎంజీ క్యాప్సూల్స్‌ను అలాగే కొనసాగించండి. 
అప్పటికీ మొటిమలు తగ్గకపోతే కాస్త అడ్వాన్స్‌డ్‌ చికిత్సలైన సాల్సిలిక్‌ యాసిడ్‌ పీలింగ్‌ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రెండువారాలకు ఒకసారి చొప్పున కనీసం ఆరు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. 
ఒకవేళ మీ మొటిమల వల్ల ముఖంపై గుంటలు పడినట్లుగా ఉంటే, వాటిని తొలగించడానికి ఫ్రాక్షనల్‌ లేజర్‌ వంటి చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. 
-డాక్టర్‌ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్‌ ట్రైకాలజిస్ట్‌ – డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్‌ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top