పాపకు ముఖం నిండా మొటిమలు...సలహా ఇవ్వండి

Dermatology Counseling - Sakshi

డర్మటాలజీ కౌన్సెలింగ్‌

మా పాప వయసు 18 ఏళ్లు. గత కొంతకాలంగా ఆమెకు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. పాప ముఖం చాలా కళగా ఉంటుంది. అయితే ఈ వయసులో ఇలా మొటిమలు రావడంతో కాస్తంత న్యూనతకు గురవుతోంది. మా అందరికీ అవగాహన కలిగేలా మొటిమల గురించి పూర్తి వివరణ ఇస్తూ, ఆమె విషయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు/చికిత్స తీసుకోవాలో తెలియజేయండి.– కె. సురేఖ, సికింద్రాబాద్‌

మొటిమలు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి... 1) జిడ్డుస్వభావంతో కూడిన చర్మం (ఆయిలీ స్కిన్‌) 2) చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు పూడుకుపోవడం 3) చర్మంపైని స్వేద రంధ్రాలలో బ్యాక్టీరియా చేరడం 4) ఇన్‌ఫ్లమేషన్‌ (నొప్పి, వాపు, మంట). సాధారణంగా చర్మకణాలు పుట్టే క్రమంలో చర్మంపై ఉండే స్వేదరంధ్రాలు పూడుకుపోతాయి. దాంతో అక్కడ చర్మాన్ని తేమగా ఉంచేందుకు పుట్టే స్రావమైన ‘సీబమ్‌’ బయటికి రావడానికి మార్గం ఉండదు. ఫలితంగా అక్కడ పేరుకున్న ‘సీబమ్‌’ బ్యాక్టీరియా పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. ఫలితంగా అక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. ఇలా మొటిమలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో యుక్తవయసుకు రాగానే పెరిగే పురుష హార్మోన్లు మొటిమలకు కారణం అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మొటిమలు ఉన్న మగపిల్లల్లో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ పాళ్లను పరిశీలిస్తే అవి నార్మల్‌గా ఉండాల్సిన మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుక్తవయసులో ఉన్న ఆడపిల్లల్లో ఈ హార్మోన్‌ పాళ్లు పెరగడం వల్ల రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు రావడం కనిపించవచ్చు. అందుకే దాదాపు 25 ఏళ్లు దాటిన మహిళల్లో మొటిమలు రావడం జరుగుతుంటే వాళ్లలో హార్మోన్‌ అసమతౌల్యత ఉన్నట్లుగా అనుమానించాలి. పాలిసిస్టిక్‌ ఓవరీ (అండాశయాల్లో నీటితిత్తులు ఉండటం) అనే కండిషన్‌లో మహిళల్లో మొటిమలు చాలా ఎక్కువగా వస్తాయి. పైగా ఇవి చికిత్సకు ఒక పట్టాన లొంగవు. అందుకే మొటిమలు ఉన్న పురుషులలో కంటే మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యతకు అవకాశాలు ఎక్కువ అని తెలుస్తుంది. కొన్ని రకాల మందులు వాడటం వంటి అంశాలు కూడా మొటిమలను ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు సౌందర్యసాధనాలు (కాస్మటిక్స్‌) వల్ల కూడా మొటిమలు రావచ్చు. ఇక ఆహారం విషయానికొస్తే కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం, చాక్లెట్లతో మొటిమలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది అందరిలో జరగకపోయినా, మొటిమలు వచ్చే దేహ స్వభావం ఉన్నవారిలో మొటిమలు రావడం, అవి మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివారు కొవ్వులను, చాక్లెట్లను మినహాయించాలి.

మొటిమలు రావడం కూడా ఒక రకం వ్యాధే...
చాలామంది తల్లిదండ్రులు మొటిమలను ఒక వ్యాధిగా పరిగణించరు. కానీ చర్మానికి సంబంధించిన ఒక రుగ్మతగానే దీన్ని చూడాలి. సాధారణంగా ముఖం మీద, కొందరిలో ఛాతీ, వీపు మీద కనిపించే ఈ మొటిమలు చాలా తక్కువ తీవ్రత (మైల్డ్‌) మొదలుకొని తీవ్రమైన (సివియర్‌) వరకు వేర్వేరు స్థాయుల్లో కనిపిస్తాయి. కొందరిలో చాలా తీవ్రమైన (వెరీ సివియర్‌) స్థాయి మొటిమల తీవ్రత ఎంతగా ఉంటుందంటే అది కొన్ని జీవ వ్యవస్థలను (సిస్టమ్స్‌ను) కూడా ప్రభావితం చేస్తుంది. మొటిమ తన తొలిదశలో చిన్న బొడిపెలా కనిపిస్తుంది. దీని చివరిభాగం మూసుకుపోయి తెల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాతి దలో దీని చివరిభాగం నల్లగా మారి, తెరచుకుని కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ఎర్రగా బాగా ఉబ్బిపోయి లేదా వాపుతో కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మం గట్టిబారి పోయి ఒక పెద్దబొడిపె (నాడ్యూల్‌) లా అనిపించవచ్చు. ఇలా ముఖమంతా అనేక దశల్లోని మొటిమలు కనిపిస్తూ ఉండవచ్చు. ముఖం మీద ఉన్న గాట్లు వంటి భాగాలు, మచ్చలు (స్కార్స్‌) ఆధారంగా వీటిని ఐదు గ్రేడ్స్‌గా విభజించి చూస్తారు. కొందరిలో ఇవి నీరునిండినట్లుగా గట్టి పెద్ద బొడిపె  మాదిరిగా (నాడ్యులో–సిస్టిక్‌) పుండ్లలా కనిపిస్తూ జ్వరం, కీళ్లనొప్పులు కూడా కనిపించవచ్చు.

కొందరిలో అకస్మాత్తుగా మటుమాయమవుతాయి...
కొందరిలో ఇవి తమ కౌమార దశ నుంచి బయటపడగానే (అడల్ట్‌హుడ్‌కు రాగానే) అకస్మాత్తుగా మాయమైపోతాయి. లేదా తీవ్రత తగ్గిపోతాయి. అయితే మొటిమల అనంతర దశల్లో వచ్చే మచ్చలు మిగిలిపోవడం వంటి కొన్ని దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని చికిత్స కొనసాగించాలా, అయితే ఎంతకాలం కొనసాగించాలన్నది తెలుసుకోవాలి.

కొందరిలో చికిత్స అవసరం
చాలామంది పేరెంట్స్‌ యుక్తవయసులోని తమ పిల్లలకు మొటిమలు వస్తున్నప్పుడు కొంత వయసు తర్వాత అదే తగ్గిపోతుందంటూ చికిత్స ఇప్పించరు. ఇది సరికాదు. తీవ్రమైన మొటిమలు ఉన్నప్పుడు అవి ముఖం మీద గాట్ల వంటి మచ్చలను ఏర్పరుస్తాయి. అవి ఎదిగే వయసులోని పిల్లల్లో తీవ్రమైన న్యూనతను కలిగిస్తాయి. కాబట్టి ఆ వయసు పిల్లల ఎదిగే మానసిక ఆరోగ్య వికాసాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కౌమారంలో ఉన్న పిల్లల  నాణ్యమైన జీవితం కోసం, ఆత్మవిశ్వాసం పెంపొందించండం కోసం మొటిమలకు చికిత్స అవసరం. ఈ చికిత్స ఎంతగా జరిగితే మచ్చలను అంతగా రాకుండా చూడవచ్చు.
చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, క్లెన్సర్లు అందుబాటులో ఉంటాయి. అయితే మొటిమలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో పూతమందుల (టాపికల్‌ మెడిసిన్స్‌)తో పాటు నోటి ద్వారా తీసుకోవాల్సిన మందులు (ఓరల్‌ మెడిసిన్స్‌) కూడా వాడాల్సి ఉంటుంది.

నివారణకు ఉపయోగపడే క్లెన్సర్స్‌ ఇవి: ఇప్పుడు మార్కెట్‌లో మొటిమలను నివారించడానికి చాలా క్లెన్సర్‌ లభ్యమవుతున్నాయి. వీటిలో శాల్సిలిక్‌ యాసిడ్, గ్లైకోలిక్‌ యాసిడ్, సల్ఫర్‌ ఉంటాయి. ఇవి సబ్బులు, లిక్విడ్‌ ఫేస్‌వాష్‌ ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ఉపయోగిస్తూ,  ముల్తానీ మిట్టీ లాంటి వాటితో ఫేస్‌ప్యాక్‌లా వేస్తూ జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్‌) ఉన్నవారిలోని జిడ్డుపాళ్లను తగ్గించవచ్చు. ఇది మొటిమలు తగ్గించడానికి ఒక మార్గం. అయితే మొటిమలు తక్కువగా ఉన్నవారు మినహాయించి, ఒకింత ఎక్కువగా ఉన్నవారు ముఖాన్ని శుభ్రపరచుకునేందుకు ఫేషియల్‌ స్క్రబ్‌ వాడకపోవడమే మంచిది.

పూతమందులతో చికిత్స: మొటిమలు ఉన్న స్థాయిని, తీవ్రతను బట్టి పూత మందుల్లో అనేక రకాలు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు రెటినాయిడ్స్‌ అనే పూత మందులు స్వేదరంధ్రాలు పూడుకుపోయిన మొటిమలకు బాగా ఉపయోగపడతాయి. ఇక రెటినాయిడ్స్‌తో పాటు క్లిండమైసిన్, అజిథ్రోమైసిన్, నాడిఫ్లోక్లసిస్‌ వంటి  యాంటీబయాటిక్స్‌ పూతమందులుగా లభ్యమవుతున్న కాంబినేషన్లు మొటిమలపై మరింత ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని రెటినాయిడ్‌ కాంబినేషన్‌ పూత మందుల వల్ల చర్మంపై మంట, చర్మం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీన్ని తగ్గించడానికి అవి పూసి ఉంచాల్సిన వ్యవధిని తగ్గించడం, వాటర్‌ బేస్‌డ్‌ మాయిష్చరైజర్స్‌ వాడటం మేలు. ఒకవేళ పూతమందులతో మొటిమలు 6–8 వారాలు గడిచినా తగ్గనప్పుడు పూతమందులతో పాటు నోటిద్వారా తీసుకునే మందులు వాడాలి.

నోటి ద్వారా తీసుకునే మందులతో (ఓరల్‌ థెరపీ): ఒకింత తీవ్రత కలిగిన మొటిమలు మొదలుకొని తీవ్రమైన మొటిమలకు పూతమందులతో పాటు... నోటి ద్వారా తీసుకోవాల్సిన అరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్‌ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూడు వారాల పాటు వాడాక కూడా ఫలితం కనిపించకపోతే చికిత్స వ్యవధిని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక మహిళల్లో పాలీసిస్టిక్‌ ఓవరీస్‌ వంటి హార్మోన్ల అసమతౌల్యత లక్షణాలు కూడా కనిపిస్తే నోటిద్వారా తీసుకునే మందులతో చికిత్స అవసరం. మహిళల్లో మొటిమలతో పాటు హార్మోన్‌ అసమతౌల్యతలకు సైప్రోస్టెరాన్‌ ఎసిటేట్‌ వంటి యాంటీయాండ్రోజెన్‌ మందులు, గర్భనిరోధక మాత్రలు వాడుతుంటే అందులో కొద్దిపాటి ఈస్ట్రోజెన్‌తో పాటు లో–యాండ్రోజెనిక్‌ ప్రోజెస్టెరాన్‌ ఉన్న మందులను కనీసం ఆరు వారాల పాటు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. యాంటీబయాటిక్స్‌తో కూడా ఫలితం లేనప్పుడు ఐసోట్రెటినియాన్‌ వంటివి  మొటిమల చికిత్సలో మంచి ఫలితాలను ఇచ్చే మందులుగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తీవ్రమైన మొటిమల కోసం యాంటీబయాటిక్స్‌ కూడా ఉపయోగపడనప్పుడు వీటిని 16 వారాలపాటు వాడాలి. మొటిమలకు కారణాలు ఏవైనప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ఫలితం చూపే మంచి మందులివి. వాటితో పాటు ఇప్పుడు చవగ్గానే లభించే డర్మారోలర్, హైస్ట్రెంత్‌ ట్రైక్లోరో అసిటిక్‌ యాసిడ్‌ను పూసే చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి.

శస్త్రచికిత్స: ఇక ముఖంపైన మచ్చలు, గాట్లు మిగిలిపోయినవారికి ఒక్కోసారి వాటి తీవ్రతను బట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. అయితే ఇది చాలా అరుదు.
డాక్టర్‌ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్,కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top