UV Radiation: ‘డిలేయ్‌డ్‌ ట్యానింగ్‌’.. అదేపనిగా సూర్యకాంతిలో ఉంటే మాత్రం ఇక అంతే!

Summer: Skin Problems We Can Face UV Radiation In Telugu By Expert - Sakshi

మారబోయే సీజన్‌లో మరింత జాగ్రత్త! 

అల్ట్రావయొలెట్‌ కిరణాలు... 

మన మనుగడకు ఎండ ఎంతో  అవసరం. కానీ అందులోని అల్ట్రా వయొలెట్‌ కిరణాలతో మాత్రం చర్మానికి హాని జరుగుతుంది, అలా ఇవి ఎప్పుడూ నివారించలేని ముప్పులా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పైగా రాబోయేది వేసవి. ఈ సీజన్‌లో ఎండ తీవ్రత ఎక్కువయ్యేకొద్దీ అల్ట్రావయొలెట్‌ కిరణాల తాకిడి కూడా క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. వాటితో హాని ఎలా, ఎందుకు కలుగుతుందన్న విషయాలు తెలుసుకుందాం. 

అల్ట్రావయొలెట్‌ కిరణాలు సూర్యకాంతి నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వీటిని సంక్షిప్తంగా యూవీ అంటారు. ఇందులో యూవీఏ, యూవీబీ, యూవీసీ అని మూడు రకాలు ఉంటాయి. సూర్యకాంతి తీవ్రంగా ఉన్నప్పుడు భూమి వాతావరణంలో యూవీఏ, యూవీబీ రెండూ ప్రవేశిస్తాయి. అవి మన చర్మానికి తగిలినప్పుడు కేవలం 5 శాతం మాత్రమే వెనకకు వెళ్తాయి. కొన్ని చెదిరిపోతాయి. చాలా భాగం చర్మంలోకి ఇంకి పోతాయి.

చర్మంలోని ‘ఎపిడెర్మిస్‌’  పొరలో ఉండే డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ట్రిప్టోఫాన్, టైరోజిన్, మెలనిన్‌లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకిపోయేలా చేస్తాయి. తర్వాత అవి  చర్మంలోని మరో పొర ‘డెర్మిస్‌’ను తాకుతాయి. ఈ క్రమంలో అల్ట్రావయెలెట్‌ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్‌ఏలో ఎంతోకొంత మార్పు వస్తుంది. ఆ మార్పు తీవ్రమైనప్పుడు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. 

దుష్ప్రభావాలివే... 
మామూలుగానైతే ఇంట్లో ఉన్నవారిపై అల్ట్రావయొలెట్‌ కిరణాల దుష్ప్రభావం ఉండదనుకుంటాం. బయటితో పోలిస్తే ఇన్‌డోర్‌లో తక్కువే అయినా... వాటి దుష్ప్రభావాలు ఎంతోకొంత ఉండనే ఉంటాయి. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పుడు ‘యూవీ’ కిరణాల తీవ్రత కాస్త  తక్కువగా ఉంటుంది. ఇళ్లలోని ట్యూబ్‌లైట్స్, ఎలక్ట్రిక్‌ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్‌ ఉంటుంది.

అన్నట్టు... భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అనుకుంటాం కదా. అది వాస్తవం కాదు. నిజానికి మంచుతో ఉన్న  ప్రాంతాల్లోనే ఎక్కువ. భూమధ్యరేఖ దగ్గర, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ, వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ  వాటి తీవ్రత పెరుగుతుంది. 

వేర్వేరు ప్రదేశాల్లో అల్ట్రా వయొలెట్‌ కిరణాల తీవ్రత... 
∙మంచులో ... 85శాతం వరకూ;  
ఇసుకలో ...  25శాతం;
మిలమిల మెరుస్తున్న నీళ్లలో: 5 శాతం... 

అల్ట్రా వయొలెట్‌ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల మనకు...  సన్‌ బర్న్స్‌ ∙సన్‌ ట్యానింగ్‌, చర్మం మందంగా మారడం, గోళ్లకు నష్టం కావడం, వాస్తవ వయసు కంటే పెద్దగా కనిపించడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. 

చర్మానికి జరిగే అనర్థాలు
సన్‌బర్న్స్‌ గురించి చెప్పాలంటే... తొలుత అల్ట్రా వయొలెట్‌ కిరణాల ప్రభావం కణాల్లోని డీఎన్‌ఏ పై పడుతుంది. మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట...  అంటే... ముఖంపై, చేతులపై త్వరగా కనిపిస్తుంది. తెల్లటి చర్మం  ఉన్నవారిలో సన్‌బర్న్స్‌ త్వరగా కనిపిస్తాయి. మన దేశవాసుల్లో సన్‌బర్న్స్‌ కాస్త తక్కువే.  

ట్యానింగ్‌ విషయానికి వస్తే..  సూర్యకాంతి తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగుమారిపోతుంది. అది కొద్ది నిమిషాల నుంచి కొద్ది గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్‌ ట్యానింగ్‌’ అంటారు. ఇలా మారిన రంగు తాత్కాలికంగానే ఉంటుంది. కానీ అదేపనిగా సూర్యకాంతిలో ఉండేవారిలో రంగు మారే ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అలా మారింది కాస్తా... చాలాకాలం ఉంటుంది. దీన్నే ‘డిలేయ్‌డ్‌ ట్యానింగ్‌’ అంటారు. 

అటు తర్వాత అలా చాలాకాలం పాటు సూర్యకాంతికి అదేపనిగా ఎక్స్‌పోజ్‌ అయినవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్‌ప్లేషియా’ అంటారు. తెల్లగా ఉన్నవారిలో ఈ ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది. చర్మంతో పాటు గోళ్లకు నష్టం జరుగుతుంది. అల్ట్రావయొలెట్‌ కిరణాలతో గోళ్లకు జరిగే అనర్థాన్ని వైద్యపరిభాషలో దీన్ని ‘ఒనైకోలైసిస్‌’ అంటారు.

అన్నీ నష్టాలేనా?
అల్ట్రా వయొలెట్‌ కిరణాల వల్ల అంతా అనర్థమేననీ, అవి పూర్తిగా ప్రమాదకరమేనని అనుకోడానికీ వీల్లేదు. కొన్ని విషయాలు/రంగాల్లో వాటితోనూ ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు...  
విటమిన్‌ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్‌ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ కాకపోతే అసలు విటమిన్‌–డి ఉత్పత్తే జరగదు. ఇది ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ ఎంతగానో అవసరం. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్‌ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదలకూ, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికీ, ఇన్సులిన్‌ ఉత్పత్తికీ కొంతమేరకు అల్ట్రా వయొలెట్‌ కిరణాలు అవసరం. 
కొన్ని చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటివాటి చికిత్సలకు.
నవజాత శిశువులో : పుట్టుకామెర్లు (జాండీస్‌) తగ్గించడం కోసం కూడా  ఉపయోగిస్తారు.  
-డాక్టర్‌ స్వప్నప్రియ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top