దానివల్ల సంతానం కలగదా?

దానివల్ల సంతానం కలగదా?


పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) అనే దాని గురించి విన్నాను. ఇది ఉంటే సంతానం కలగదా? టీనేజర్లకు మాత్రమే ఈ సమస్య  వస్తుందా?  ఈ సిండ్రోమ్‌ గురించి వివరంగా చెప్పగలరు.

కె.నళిని, రామగుండం



పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) అంటే గర్భాశయం ఇరువైపులా ఉండే అండాశయాలలో ఎక్కువగా నీటి బుడగలు ఏర్పడటం, వాటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఏర్పడే లక్షణాలను పీసీఓఎస్‌ అంటారు. కేవలం అండాశయాలలో నీటి బుడగలు ఎక్కువగా ఉండటాన్ని పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ (పీసీఓ) అంటారు. ఇవి అధిక బరువు, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల ఏర్పడతాయి. వీటివల్ల మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఆడవారిలో ఎక్కువగా విడుదల అవ్వటం, తద్వారా కొందరిలో పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవటం, అవాంఛిత రోమాలు, మొటిమలు రావటం, మెడ చుట్టూ చర్మం మందంగా అయ్యి నల్లబడటం, కొందరిలో అండం విడుదల అవ్వకపోవటం, తద్వారా సంతానం కలగడంలో ఇబ్బంది, అబార్షన్లు అవ్వటం, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మధుమేహ వ్యాధి రావటం వంటి అనేక లక్షణాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, బరువుని బట్టి వారిలో విడుదలయ్యే హార్మోన్స్‌ని బట్టి, సమస్యల తీవ్రత ఆధారపడి ఉంటుంది. రజస్వల కాక ముందు నుంచి, టీనేజర్ల దగ్గర నుంచి, మధ్య  వయస్సు వరకు పీసీఓయస్‌ ఎప్పుడైనా ఏర్పడవచ్చు. దీనికి చికిత్స, లక్షణాలని బట్టి ఇవ్వడం జరుగుతుంది. చికిత్సతో పాటు, క్రమంగా వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు ఎంతో అవసరం.



ఈమధ్య ఒక చోట carrying multiple babies అనే వాక్యం చదివాను. దీని గురించి గతంలో ఎప్పుడూ విని ఉండలేదు. దీని గురించి వివరంగా చెప్పగలరు. ఝu ్టజీp ్ఛ b్చbజ్ఛీటవల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా వస్తాయా?

– వి.పల్లవి, కర్నూల్‌



గర్భం దాల్చినప్పుడు, సాధారణంగా గర్భాశయంలో ఒక పిండం ఏర్పడి, మెల్లగా అది శిశువుగా మారి పెరుగుతుంది. కొందరికి గర్భంలో ఒకటి కంటే ఎక్కువ శిశువులు పెరగవచ్చు. దీనినే మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీ అని లేదా మల్టిపుల్‌ బేబీస్‌ని క్యారీ చేయడం అని అంటారు. మల్టిపుల్‌ ప్రెగ్నెన్సీస్‌ సంతానం కోసం చికిత్స తీసుకునేవాళ్లలో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇందులో ఇద్దరు, ముగ్గురు ఇంకా ఎక్కువ శిశువులు పెరగవచ్చు. సాధారణంగా ఆడవారిలో గర్భాశయం ఒక బిడ్డ పెరగటానికి ఉద్దేశించబడినది. అందులో ఇద్దరు లేక ఇంకా ఎక్కువ మంది శిశువులు ఏర్పడినప్పుడు, గర్భాశయంలో ఆ శిశువులు పెరగటానికి స్థలం సరిపోకపోవచ్చు. దానివల్ల కొందరిలో ఐదవ నెలలో అబార్షన్లు, శిశువుల బరువు సరిగా పెరగకపోవటం, నెలలు నిండకుండానే పుట్టడం, ఒకరు పెరగటం, ఇంకొకరు పెరగకపోవటం, తల్లిలో పొట్ట బాగా ఎత్తుగా పెరగకపోవటం వల్ల బీపీ, షుగర్, ఆయాసం, నడుంనొప్పి వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు.



 ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్‌లలో ‘బ్యాక్‌ పెయిన్‌’ ఒకటని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? ఒకవేళ నిజం అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  herniated disc అంటే ఏమిటి?

– ఎన్‌.తులసి, తాడేపల్లిగూడెం



ప్రెగ్నెన్సీ సమయంలో, గర్భం నెలనెలా పెరగటం వల్ల పొట్ట ముందుకు పెరగటం, దాని బరువు మొత్తం నడుంపైన భారం పడటం వల్ల, బ్యాక్‌ పెయిన్‌ (నడుం నొప్పి) రావడం జరుగుతుంది. ఇది సైడ్‌ ఎఫెక్ట్‌ కాదు, గర్భిణీలలో జరిగే మార్పుల వల్ల కలిగే ఇబ్బంది. అలాగే గర్భిణీలలో ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల, పెల్విక్‌ ఎముకలు, జాయింట్స్, లిగమెంట్స్‌ కొద్దిగా వదులవుతాయి. వాటి మీద బరువు పడటం వల్ల కూడా బ్యాక్‌ పెయిన్‌ వస్తుంది.



 నొప్పి తీవ్రత, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, పెరిగే బరువుని బట్టి, ఇంకా ఇతర అంశాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి కొన్ని చిట్కాలను పాటించడం మంచిది. నడిచేటప్పుడు ఒంగి నడవకుండా, నిటారుగా నడవడం, హీల్స్‌ లేని మెత్తటి చెప్పులు వేసుకోవటం, గంటలు తరబడి నిలుచోకుండా మధ్యమధ్యలో కూర్చోవటం, అలాగే కూర్చున్నప్పుడు నడుంకి మంచి సపోర్ట్‌ తీసుకుని, కుర్చీకి ఆనుకుని కూర్చోవడం, అవసరమయితే కింది నడుము వెనకాల దిండు పెట్టుకోవడం, కాళ్లు మరీ కిందకి వేళ్లాడకుండా కొద్దిగా పైకి పెట్టుకోవడం వంటివి పాటించడం మంచిది.



మధ్యాహ్నం ఒక గంట విశ్రాంతి తీసుకోవటం మంచిది. నొప్పి ఉపశమనానికి అప్పుడప్పుడు నడుంపైన వేడినీళ్లతో గుడ్డ తడిపి కాపడం పెట్టుకోవచ్చు. రోజూ కొంతసేపు నడక, ప్రాణాయామం, చిన్న చిన్న వ్యాయామాలు డాక్టర్‌ సలహా మేరకు చెయ్యటం వల్ల కూడా నడుం నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కొందరిలో యూరిన్‌ ఇన్‌ఫెక్షన్స్, తొందరగా కాన్పు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు కూడా నడుంనొప్పి ఎక్కువగా ఉండవచ్చు. నొప్పి అధికంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.



వెన్నుపూసలో 33 వర్టెబ్రా అనే ఎముకలు ఒక దాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి. రెండు వర్టెబ్రాలు ఒకదానికొకటి రాసుకోకుండా వంగటానికి ఇబ్బంది లేకుండా మధ్యలో వర్టెబ్రల్‌ డిస్క్‌ అనే రబ్బర్‌లాంటి పదార్థం ఉంటుంది. నడుం మీద ఎక్కువ బరువు పడడం, వెన్నుపూస అరగటం వంటి అనేక కారణాల వల్ల కొందరిలో వర్టెబ్రల్‌ డిస్క్‌ రెండు వర్టెబ్రాల మధ్య నుంచి జారి కొద్దిగా బయటకు రావడాన్ని herniated disc అంటారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top