సమస్యల చొక్కా... | Problems shirt | Sakshi
Sakshi News home page

సమస్యల చొక్కా...

Jul 26 2015 1:16 AM | Updated on Sep 3 2017 6:09 AM

సమస్యల చొక్కా...

సమస్యల చొక్కా...

ఆనంద్ ఆఫీసునుంచి ఇంటికి వస్తూనే విసురుగా బైక్ స్టాండ్ వేశాడు. అంతే విసురుగా ఇంట్లోకి వచ్చాడు.

ఆత్మబంధువు
 ఆనంద్ ఆఫీసునుంచి ఇంటికి వస్తూనే విసురుగా బైక్ స్టాండ్ వేశాడు. అంతే విసురుగా ఇంట్లోకి వచ్చాడు. నాన్నా అంటూ దగ్గరకు వచ్చింది బిందు. పట్టించుకోలేదు. సోఫాలో కూర్చున్న నాన్న ఒళ్లో కూర్చోవాలని ప్రయత్నించింది. తీసి పక్కన కూర్చోబెట్టాడు. రోజూ రాగానే ఎత్తుకుని ముద్దాడే నాన్న ఈ రోజెందుకలా ఉన్నాడో అర్థం కాలేదు పాపం ఆ చిన్నారికి. మాట్లాడకుండా వెళ్లి తన పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది.  ఇంతలో ఇందిర వచ్చి భర్తకు కాఫీ ఇచ్చింది. ఇలా అందుకుని అలా తాగేశాడు. టీవీ ఆన్ చేశాడు. కానీ ఏ చానల్ కుదురుగా చూడటం లేదు. చకచకా మార్చేస్తున్నాడు. ‘‘ఏమండీ.. అత్తయ్యవాళ్లు ఫోన్ చేశారు. నెక్స్ట్ వీక్ వస్తారట’’... చెప్పింది ఇందిర. ఆనంద్ మాట్లాడలేదు. ‘‘మీకే చెప్తోంది. మామయ్యవాళ్లు నెక్స్ట్‌వీక్ వస్తారట’’.. మళ్లీ చెప్పింది ఇందిర.
 
 ‘‘వినపడింది.. ఎందుకలా అరుస్తున్నావ్?’’... అన్నాడు ఆనంద్.
 ‘‘నేను అరిచానా?!! వినపడలేదని మళ్లీ చెప్పానంతే.’’
 ‘‘వినపడకపోవడానికి నాకేమైనా చెవుడా?’’
 ‘‘నేనామాట అన్లేదండీ బాబూ... వదిలేయండి.’’
 ‘‘వదిలేయక ఇక్కడెవరూ పట్టుకుని కూర్చోలేదు.’’
 ‘‘ఎందుకంత చిరాకు? ఏమైంది?’’
 ‘‘ఏం కాలేదు.’’
 
 ఆనంద్ ఏదో చిరాకులో ఉన్నాడని ఇందిరకు అర్థమై ఆ సంభాషణను అంతటితో వదిలేసింది. రాత్రి భోజనాల సమయంలోనూ ఆనంద్ అలాగే ఉన్నాడు. సరిగా భోంచేయలేదు. రోజూ పాపకు గోరుముద్దలు తినిపించేవాడు. ఇవ్వాళ అలా చేయలేదు. బిందు నిద్రపోయాక నెమ్మదిగా అడిగింది ఏమైందని. ఏం కాలేదంటూ కట్ చేసేశాడు. కానీ ఏదో జరిగిందనీ, మనసులో బాధపడుతున్నా డనీ ఇందిర అర్థం చేసుకుంది.
 
 అది ఇంటి వ్యవహారమైతే కాదు, ఆఫీసు వ్యవహారమే అయ్యుండొచ్చు. కానీ అదేంటో తనతో చెప్పించడమెలా?... ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయం కూడా ఆనంద్ పరాగ్గానే ఉన్నాడు. ఇందిర కదిలించలేదు. తనకు కావాల్సినవి చేసి పెట్టింది. తినేసి ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఏం చేయాలా... అని ఆలోచిస్తూ కూర్చుంది ఇందిర.సాయంత్రం ఆనంద్ ఇంటికొచ్చి సోఫాలో కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చింది ఇందిర. ఆనంద్ కాఫీ తాగేసి టీవీ చానల్స్ మార్చేస్తున్నాడు. ఇదే చాన్సని బిందును కూర్చోబెట్టుకుని కథ చెప్పడం మొదలుపెట్టింది ఇందిర.
 
 ‘‘అనగనగనగా ఒక రాజ్యంలో ఒక మంత్రి ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చక్కగా  పరిష్కారం చూపించేవాడు. అందుకని ఆయన దగ్గరకు రోజూ ఎంతోమంది వచ్చి సమస్యలు చెప్పుకునేవారు. వీటికితోడు రాజ్యానికి సంబంధించిన ఇతర సమస్యలు. ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఆయనెప్పుడూ చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. ఇక ఇంటికొస్తే మరీ ప్రశాంతంగా ఉండేవాడు. ఆయనలా ఎలా ఉండగలుగు తున్నాడన్నది ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఆ రహస్యం కనుక్కోవాలని ఒక సహోద్యోగి ఆయనకు తెలియకుండా గమనించసాగాడు.
 
 మంత్రిగారు రోజువారీ పనులన్నీ ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. తన ఇంటి దగ్గరకు రాగానే ఒంటిపైనుంచి చొక్కా తీసినట్లుగా తీసి అక్కడున్న చెట్టుకు తగిలించినట్లుగా చేసి ఇంట్లోకి వెళ్లాడు. కానీ నిజానికి చొక్కా ఆయన ఒంటిమీదే ఉంది. ఆయనలా ఎందుకు చేశాడో ఫాలో అవుతోన్న సహోద్యోగికి అర్థం కాలేదు. తల గోక్కుంటూ ఇంటిదారి పట్టాడు. మర్నాడు మంత్రిగారు ఆస్థానానికి రాగానే అతన్ని పిలిచి... ‘‘ఏమిటీ నిన్న సాయంత్రం నా వెంటే వచ్చావ్ మా ఇంటివరకూ?’’ అని అడిగాడు. ‘‘అయ్యా... మీరు గమనించారా? క్షమించండి’’ అన్నాడు సహోద్యోగి. ‘‘అదిసరే.. విషయమేంటో చెప్పు’’ అన్నాడు మంత్రి.
 
 ‘‘మీరు రోజూ ఇన్ని సమస్యలను చూస్తున్నా చిరునవ్వుతో ఎలా ఉండగలుగుతున్నారన్నది తెలుసుకోవాలనీ’’ అంటూ నసిగాడు సహోద్యోగి.  ఓహ్.. అదా... అంటూ చిరునవ్వు నవ్వాడు మంత్రి. ‘‘అయ్యా.. ఇంతకీ మీరు ఇంటి బయట మీ చొక్కా తీసి తగిలించినట్లు నటించడమేమిటో అర్థంకాలేదు’’  అన్నాడు సహోద్యోగి.‘‘మనం రోజూ బయట సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటాం. వాటిని, వాటి బరువునీ ఇంటికి తీసుకెళ్తే ఇంట్లోకూడా మనశ్శాంతి కరువవుతుంది. అందుకే చొక్కాను బయటే తగిలించి లోపలకు వెళ్తా’’ అని చెప్పాడు మంత్రి.
 
 ‘‘కానీ అసలక్కడ చొక్కానే లేదుగా’’.. అనుమానం వ్యక్తం చేశాడు సహోద్యోగి.  ‘‘నిజమే అక్కడ నిజమైన చొక్కా లేదు. మనసులో ఉన్న సమస్యల చొక్కానే అక్కడ తగిలించి వెళ్లా’’... వివరించాడు మంత్రి.  సహోద్యోగికి విషయం అర్థమైంది. ఓ చెవి వేసి వింటున్న ఆనంద్‌కు కూడా. కాస్సేపటి తర్వాత ఇందిర దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. ఆఫీసులో తన సమస్యేమిటో పంచుకున్నాడు. ఇందిర కూడా తనకు తోచిన సలహా ఇచ్చింది.
 - డాక్టర్ విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement