మంచి చెడులు

Monkey Helps Rabbit Kids Story - Sakshi

పిల్లల కథ

చంద్రగిరి అడవుల్లో క్రూర మృగాలు ఉండేవి కావు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కుందేళ్ళు, ఉడుతలు... మొదలైన సాధుజంతువులు నివసించేవి. జంతువులన్నీ ఎంతో స్నేహంగా, సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలో నివసించడానికి కార్వేటినగరం అడవులనుండి ఒక కోతి వచ్చింది. కొత్తగా వచ్చిన కోతిని చూసి, పరుగున వెళ్ళి వనరాజైన గజరాజుకు కోతి సంగతి చెప్పింది జింక. గజరాజు వెంటనే అడవిలోని జంతువులన్నింటినీ కాలువ గట్టుపై సమావేశపరిచాడు. సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోతికి ఉడుత ద్వారా సమాచారాన్ని పంపించాడు.

గజరాజు ముందు చేతులు కట్టుకొని నిల్చుంది కోతి. తక్కిన జంతువులన్నీ కోతిని చాలా కోపంగా చూస్తున్నాయి.
‘‘మా అడవిలో కోతులకు ప్రవేశం లేదు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్లిపో !’’  కోతిని ఆజ్ఞాపించాడు గజరాజు.
‘‘గజరాజా! నేను అడవిలో ఉండడం మీకు ఇష్టం లేకపోతే, అడవి నుండి తక్షణం వెళ్ళిపోతాను. కానీ నాదొక  సందేహం! తీర్చగలరా?’’  అంటూ వినయంగా అడిగింది కోతి.
‘‘ఏమిటి నీ సందేహం?’’  గంభీరంగా అడిగాడు గజరాజు.
‘‘ఈ అడవిలో కోతులకు ప్రవేశం లేకపోవడానికిగల కారణం తెలుసుకోవచ్చా?’’ అడిగింది కోతి.
‘‘కోతులు తుంటరి స్వభావంగలవి. అడవిలో చెట్ల కొమ్మలపై ఆడుతూ, కొమ్మలను విరిచేస్తాయి.’’ ఆవేశంగా  చెప్పింది జింక.
‘‘అవసరం లేకున్నా ఆకులు, పళ్ళు తుంచిపడేస్తాయి.’’ ఆక్రోశించింది ఉడుత.
‘‘కోతి చేష్టల గురించి కొత్తగా చెప్పేదేముంది? కోతి చేష్టలు రోత చేష్టలు అని ఊరికే అన్నారా?’’  దెప్పిపొడిచింది గుర్రం.
‘‘తాను చెడ్డ కోతి, వనమంతా చెడిపింది అనే సామెత ఎప్పటినుండో ఉన్నదే కదా!’’ నొసలు చిట్లిస్తూ నిష్టూరమాడింది కుందేలు. కోతి ఏనుగు వైపు చూస్తూ....
‘‘గజరాజా! అన్ని  జీవుల్లోనూ మంచి వారూ ఉంటారు. చెడ్డవారూ ఉంటారు. మా కోతి జాతిలో కూడా అంతే. కొన్ని కోతులు చెడుగా ప్రవర్తించి ఉండవచ్చు. అడవికి, అడవి జంతువులకూ హాని చేసి ఉండొచ్చు. అలాగని మా కోతి జాతి మొత్తాన్నీ తప్పుబడితే ఎలా? నేను ఎప్పటికీ అలా నడుచుకోను. అడవి నియమాలకు అనుగుణంగానే నడుచుకొంటాను. దయచేసి నాకు ఈ అడవిలో మీతోపాటు నివసించడానికి అనుమతినివ్వండి.’’ బతిమాలింది కోతి.

వాదనలు పూర్తయ్యాయి. గజరాజు  తీర్పు కోసం కోతితో సహా జంతువులన్నీ ఎదురుచూస్తున్నాయి. గజరాజు ఆలోచనలో పడ్డాడు. కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతోంది. కానీ అడవి జంతువులన్నీ ఏకగ్రీవంగా కోతిని వ్యతిరేకిస్తున్నాయి. ఇంతలో కాలువగట్టుపై ఆడుకొంటూ ఉన్న ఒక కుందేలుపిల్ల కాలుజారి కాలువలో పడిపోయింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితోపాటు కొట్టుకుపోతోంది. జంతువులన్నీ హాహాకారాలు చేస్తున్నాయి తప్ప, ప్రవహిస్తున్న కాలువలోకి దిగి కుందేలుపిల్లను కాపాడే సాహసం చేయలేక పోయాయి.
కోతి వెంటనే కాలువకు ఇరువైపులా ఉన్న చెట్లపై వేగంగా గెంతుతూ ముందుకు వెళ్ళి, కాలువలోకి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మను ఆసరాగా తీసుకొని కాలువలో కొట్టుపోతున్న కుందేలు చెవులను ఒడిసి పట్టుకొని దాన్ని కాపాడింది. కాలువగట్టుపై దాన్ని పడుకోబెట్టి, తన చేతులతో దాని పొట్టను నొక్కి, అది మింగిన నీటిని కక్కించింది. చెకుముకి రాళ్ళతో ఎండుటాకులకు నిప్పుపెట్టి , దాని శరీరానికి వెచ్చదనాన్ని అందించింది. కుందేలు పిల్ల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కుందేలుపిల్ల ప్రాణాలు కాపాడినందుకు జంతువులన్నీ కోతిని చుట్టుముట్టి కృతజ్ఞతలు తెలిపాయి.

పరిస్థితి సద్దుమణిగాక గజరాజు తీర్పుచెప్పడం ప్రారంభించాడు. 
‘‘కోతి చెప్పినట్టే అన్ని రకాల జీవుల్లోనూ మంచివారూ ఉంటారు. చెడ్డవారూ ఉంటారు. నాకు ఈ కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతోంది. పైగా ఈ కోతి  మన కుందేలుపిల్లను ప్రాణాపాయం నుండి కాపాడింది కూడా. అందువల్ల అడవిలో మనతోపాటు  నివసించడానికి ఈ కోతికి అనుమతినిస్తున్నాను.’’ అని ప్రకటించింది.
గజరాజు నిర్ణయంతో జంతువులన్నీ సంతోషించాయి. అకారణంగా  నిందలు వేసినందుకు తమను క్షమించాల్సిందిగా కోతిని మనస్ఫూర్తిగా వేడుకొన్నాయి తక్కిన జంతువులు.

- పేట యుగంధర్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top