జీవిత చక్రం

జీవిత చక్రం - Sakshi


ఫేమస్ టూన్

కదిలేది, కదిలించేది, పెను నిద్ర వదిలించేది ‘కవిత్వం’ మాత్రమే కానక్కర్లేదు... ‘కార్టూన్’ కూడా కావొచ్చు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మఖ్మూద్ ఇశోంక్‌లోవ్ కార్టూన్లు. ఈ  ఉజ్బెకిస్తాన్ కార్టూనిస్ట్ గీసే రేఖలలో ‘హాస్యం’ మాత్రమే ఉండదు. మెదడుకు పదును పెట్టే ‘ఆలోచన’ కూడా ఉంటుంది. అవి మనసును తట్టి లేపి ‘హద్భుతం’ అనేలా చేస్తాయి! సిరియా శరణార్థుల కన్నీటిని ఒక్క మాట లేకుండా వేల పుటల్లో చెప్పినా, సామాజిక సహాయాన్ని కూడా ‘తిరుగులేని వ్యక్తిగత  వ్యాపారం’ చేసుకున్న నకిలీ మానవతావాదులకు చుర్రుమనిపించేలా చురక అంటించినా... ఇశొంక్‌లోవ్ కుంచె తీరే వేరు. నిజానికి అది కుంచె కాదు... అంకుశం!

 

ఉజ్బెకిస్తాన్‌లోని బేషరిఖ్ జిల్లాలో ఉన్న టెలొవ్ గ్రామంలో పుట్టిన ఇశోంక్‌లోవ్ గ్రాఫిక్ ఆర్ట్‌లో పట్టా తీసుకున్నాడు. ప్రస్తుతం తాష్కెంట్ సిటీలో నివాసం ఉంటున్నారు. ‘ఉజ్బెకిస్తాన్ ఆర్టిస్ట్స్ యూనియన్’, పోలెండ్ ‘గుడ్ హ్యూమర్ పార్టీ’లలో ఆయన సభ్యుడు.

 మనిషి ఈ భూమి మీదికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకు రాలేదు. పెరిగే క్రమంలో, పెద్దవుతున్న క్రమంలో, జీవితంలో స్థిరపడుతున్న క్రమంలో,  దర్జా చాటుకునే సమయంలో... ఆ మనిషికి ‘వాహనం’ కావాల్సి వచ్చింది. చివరికి మనిషిని, వాహనాన్ని వేరు చేయలేని పరిస్థితి వచ్చింది. తప్పుటడుగులు వేస్తున్నప్పుడు చిట్టి వాహనాన్ని ఆశ్రయించిన మనిషికి... చనిపోయిన తరువాత కూడా చిట్ట చివరి వాహనం ఒకటి కావాల్సి వచ్చింది. వాహనమయమైన మనిషి జీవితాన్ని, జీవిత చక్రాన్ని గురించి ఒక్క మాట కూడా లేకుండా చెప్పడానికి ఈ కార్టూన్‌ను మించింది మరేముంటుంది!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top