ఉప్పుతిప్పలు

Funday page of the you - Sakshi

ఇది మీ పేజీ

నేను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులవి. మాది ఒక గవర్నమెంట్‌ హైస్కూల్‌. సుమారు పది ఎకరాల స్థలంలో బ్రిటిష్‌కాలంలో కట్టించిన స్కూల్‌ అది. స్కూలు ప్రాంగణంలో రకరకాల చెట్లు, అక్కడక్కడా పాడుబడిన కట్టడాలు, కాడమల్లె, పొగడమల్లె పూలచెట్లు, చింత, తాటి, మామిడి, రేగు వంటి పండ్ల చెట్లు, పెద్ద ఊడల మర్రిచెట్లు, పెద్ద బావి ఉండేవి. సువిశాలమైన మా స్కూలు ప్రాంగణం చిన్నసైజు పల్లెటూరిలా ఉండేది. మా స్కూలు ప్రాంగణం లోపల కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఉండేవి. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నా స్నేహితులు జ్యోతి, నాగలక్ష్మి; రాఘవ, బషీరు క్లాసులో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లం. మా క్లాసులో ఒక విరిగిపోయిన కిటికీ ఒక మనిషి పట్టేంత సైజులో ఉండేది. ఆ కిటికీకి కొంచెం దూరంలోనే ఎడంగా కొన్ని కుటుంబాలు నివసించేవి. మా క్లాసులోని అమ్మాయిలు, అబ్బాయిలు కలసి రకరకాల ఆటలు ఆడుకొనేవాళ్లం. అబ్బాయిలు మాకోసం మామిడి కాయలు, రేగుపళ్లు, రకరకాల పండ్లు కోసుకొచ్చి ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం లంచ్‌ అయ్యాక మేం చాలా ఎంజాయ్‌ చేస్తూ వాటిని తినేవాళ్లం.ఒకరోజు మాక్లాసు అబ్బాయిలు బోలెడు చింతకాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. నాకు చింతకాయలంటే చాలా ఇష్టం. అయితే అవి వట్టిగా తినలేంకదా. ఉప్పు రాసుకుని తింటే మరింత రుచిగా ఉంటాయని ఉప్పు కోసం వెతికాము. అయితే ఇంటి దగ్గ్గర నుంచి మజ్జిగ కోసం తెచ్చుకున్న ఉప్పు అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తే మాఫ్రెండ్‌ జ్యోతి ఒక ఐడియా ఇచ్చింది. అదేంటంటే పక్కనే ఇళ్ళు ఉన్నాయి కదా  వాళ్లని అడిగి తెచ్చుకుందాం అని.ఈ ఐడియా మాకు బాగా నచ్చింది.అయితే అప్పటికే ఇంటర్వెల్‌ టైం అయిపోయింది. క్లాసు టీచర్‌ వచ్చేస్తారు. కానీ చింతకాయల మీదకు మనసు లాగేస్తుంది ఎలా?? మా అబ్బాయిలను వెళ్ళమంటే ‘‘మేము వెళ్లము మీరే తెచ్చుకోండి’’ అనేశారు. 

ఇక సరే అని మేము ఆగలేక క్లాసు డోర్‌ నుంచి బయటకు వెళితే ఎక్కడ టీచరుకి దొరికిపోతామో అని మాక్లాసులో ఉన్న కిటికీ నుంచి ఒకళ్ల తరువాత ఒకళ్లం బయటకు దూకేశాము. నేను, రాఘవ, జ్యోతి, బషీరు, నాగలక్ష్మి మేము ఐదుగురం ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ ఇళ్ళు చాలా అందంగా రకరకాల పూలమొక్కలు, పందిళ్లు, చెట్లతో తాటాకు ఇళ్ళు అయినా చూడ్డానికి బొమ్మరిళ్లలా ఉండేవి. మేము ఒకపెద్ద నారింజ చెట్టు ఉన్న ఇంటికి వెళ్ళాము.ఆ చెట్టుకు పెద్దపెద్ద నారింజకాయలు మాకు అందేంత దగ్గరగా ఉన్నాయి. వాటిని చూడగానే మా జ్యోతికి నోరూరింది. ఇంతలో మేము ఇంట్లో వాళ్లని పిలిచాము ‘‘ఆంటీ.. అంకుల్‌’’ అని. ఇంటి లోపల నల్లగా లావుగా కుర్చీలో కూర్చున్న ఒక ఆకారం మాకు కనపడింది. ‘‘ఏమికావాలి?’’ అని అడిగాడాయన. వెంటనే మేము‘‘కొంచెం సాల్ట్‌ ఉంటే ఇస్తారా’’ అని అడిగాము. వెంటనే ఆయన ఒక అమ్మాయిని పిలిచి సాల్ట్‌ ఇమ్మని పురమాయించాడు. బయట ఉన్న మాకు ఆయన కనిపించట్లేదు. ఆకారం మాత్రమే కనిపిస్తోంది. 

ఇంతలో మా జ్యోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ‘‘ఒసేయ్‌! మీరు మాకు అడ్డుగా ఉండండి. నేను, బషీరు కాయలను కోసి స్కర్టులో వేసుకుంటాం. లోపల ఉన్న ఆయనకు మనం కనపడం’’ అని చెప్పింది. మేము ‘‘వద్దే బాబూ! ఎందుకు రిస్క్‌’’ అని చెప్పినా వినకుండా కాయలను కోసేసింది. అంతలో ఇంటి లోపల ఉన్న ఆయన  ‘‘ఏం చేస్తున్నారు మీరు’’ అని కేకలేస్తూ బయటికొచ్చాడు.  ఆ దెబ్బతో మా జ్యోతి భయపడిపోయి కోసిన కాయలను పక్కింట్లోకి విసిరేసింది. మేము ‘‘ఏమీ లేదు అంకుల్‌’’ అంటే ఆయన గబగబా వచ్చేసి ‘‘కాయలను ఎందుకు కోశారు? నన్ను అడిగితే ఇవ్వనా? అలా దొంగతనంగా కోయొచ్చా? ఉండండి ఈ విషయం మీ హెడ్‌మాస్టర్‌గారితో చెప్తాను’’ అని అన్నాడు. వెంటనే మా పై ప్రాణాలు పైనే పోయాయి. ‘‘సారీ అంకుల్‌ ఏదో తెలీక చేశాము’’ అని చెప్పినా అయన వినిపించుకోలేదు. అంతలో లోపల నుంచి సాల్ట్‌ తీసుకొస్తున్న అమ్మాయిని ఆపి ‘‘సాల్ట్‌ లేదు ఏమీ లేదు వెళ్లిపోండి’’ అని గద్దించే సరికి  దెబ్బతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాం. జ్యోతిని ‘‘ఇదంతా నీవల్లే అయింది. ఇంకెప్పుడూ ఇలాంటి చెత్తపనులు చేయకు’’ అని తిట్టాము.

ట్విస్ట్‌ ఏమిటంటే మేము ఒక లాజిక్‌ మిస్‌ అయ్యాము. చీకట్లో ఉన్నది ఆయనని మేము కాదని బయట ఎండలో వెలుతురులో నించున్న మమ్మల్ని ఆయన స్పష్టంగా చూడగలడని మా మట్టిబుర్రలకు తట్టలేదు. ఆయన అంత సీరియస్‌గా ఉంటే నేను మళ్లీ సాల్ట్‌ కోసం అడగడం ఇంకా విచిత్రం.  మా స్కూల్లో ప్రతి ఉదయం అసెంబ్లీ జరుగుతుంది. స్కూలుకి సంబంధించింది లేదా మరి ఏ ఇతర విషయాలైనా అసెంబ్లీలో చెప్పేవారు. ఆ సంఘటన జరిగిన వారంరోజుల వరకు మేమెవరం స్కూలుకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడ ఆయన మా సంగతి మా హెడ్మాస్టరుతో  చెప్తాడో ఆ విషయం అసెంబ్లీలో చెప్పి మమ్మల్ని తిడుతారన్న భయంతో స్కూలుకి డుమ్మా కొట్టేశాం. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూనే ఉంటాను.
– ఎం.సుధా మాధురి, కాకినాడ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top