
బాపట్ల జిల్లా పోలీసులు తమ అరికాళ్లపై కొట్టిన గాయాలు చూపుతున్న ప్రమోద్, పోతులూరి
అరికాళ్లపై లాఠీలతో కొట్టి గులకరాళ్లపై నడిపించిన వైనం
తెల్లకాగితాలపై సంతకం పెట్టించుకుని.. ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరిక
అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో కీలకంగా ఉన్నారనే అక్కసు
టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారన్న తప్పుడు ఫిర్యాదుతో రెచ్చిపోయిన సీఐ
మార్టూరు: బాపట్ల జిల్లాలో ఇద్దరు దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్‌లో దారుణంగా హింసించారు. టీడీపీ నేతలు చేయించిన తప్పుడు ఫిర్యాదుతో శుక్రవారం వారిని స్టేషన్‌కు పిలిపించి బూటుకాళ్లతో సీఐ తొక్కిపట్టి ఇద్దరు పోలీసులతో అరికాళ్లపై లాఠీలతో కొట్టించారు. తరువాత మరింత అమానుషంగా గులకరాళ్లపై నడిపించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించారు. మార్టూరు మండలం డేగరమూడికి చెందిన బాధిత యువకులు శుక్రవారం డేగరమూడిలో ఈ దారుణం గురించి వివరించారు.
సీఐ మీద చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల కథనం మేరకు.. డేగరమూడిలో నెలరోజులుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహస్థాపన విషయమై వివాదం నెలకొంది. సర్పంచ్ భర్త, వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్ జంపని వీరయ్యచౌదరి సహాయంతో స్థానిక ఎస్సీ కాలనీ యువకులు అల్లడి ప్రమోద్‌కుమార్, జ్యోతి పోతులూరి ఈ విగ్రహస్థాపనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిమీద కక్షగట్టిన స్థానిక అధికారపార్టీ నాయకులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారు.
గ్రామానికి చెందిన అన్నం హనుమంతరావుతో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. తరువాత హనుమంతరావును పోలీస్ స్టేషన్‌కు పంపించి.. దళిత యువకులు ప్రమోద్‌కుమార్, పోతులూరి ఫ్లెక్సీలు తొలగించారంటూ తప్పుడు ఫిర్యాదు చేయించారు. రంగంలోకి దిగిన సీఐ శేషగిరి శుక్రవారం ఉదయం ప్రమోద్‌కుమార్, పోతులూరిలను స్టేషన్‌కు పిలిపించారు. వాళ్లు వచ్చీరాగానే రాజకీయాలు మీకు అవసరమంట్రా అంటూ నానా దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. వారిని గదిలో గోడపక్కన కూర్చోబెట్టి వారి కాళ్లను సీఐ శేషగిరి బూటుకాళ్లతో తొక్కిపట్టారు.
ఇద్దరు సిబ్బంది లాఠీలతో ఆ యువకుల అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలతో వారి అరికాళ్లపై బొబ్బలొచ్చాయి. తరువాత సీఐ ఆ ఇద్దరిని బొబ్బలు తగ్గేవరకు కంకరరాళ్లపై నడిపించారు. తరువాత వారిద్దరితో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించి మధ్యాహ్నం వదిలిపెట్టారు.
తప్పుడు ఫిర్యాదు చేయించారు
స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన బాధిత యువకులు తమపై తప్పుడు ఫిర్యాదు చేసిన అన్నం హనుమంతరావును ఇలా ఎందుకు చేశావని నిలదీశారు. గ్రామ నాయకులు మద్యం పోయించి, కొట్టి, తనచేత ఫ్లెక్సీలు తొలగింపజేశారని, తరువాత డబ్బిస్తామని ఆశచూపి ఫిర్యాదు చేయమంటే చేశానని హనుమంతరావు చెప్పాడు. హనుమంతరావు చెప్పిన ఈ విషయాన్ని బాధిత యువకులు వీడియో రికార్డు చేశారు. తమను హింసించిన సీఐపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు.