కరీంనగర్ కార్పొరేషన్: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్‌లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్ సిటీలోని రాఘవేంద్రనగర్‌లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్ నోట్ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్‌బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు.
తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్‌పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ తెలిపారు.


