పెద్దక్క

Funday new story of the week 09 dec 2018 - Sakshi

కొత్త కథలోళ్లు

‘‘హలో లక్ష్మి! బయలు దేరావా? వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌ నుంచి అమ్మోళ్ళింటికి వచ్చే లోపల మనం అక్కడకు చేరుకోవాలి. ఇప్పుడే శైలజకు కూడా ఫోన్‌ చేశాను. తనని కూడా అక్కడకు చేరుకోమని చెప్పాను. ఈ పాటికి తనూ ప్రయాణంలో ఉంటుంది. నీవు త్వరగా వచ్చేయ్‌!’’  అని ఫోన్‌ పెట్టేసింది అక్క నా సమాధానం కోసం  ఎదురుచూడకుండా మా పెద్దక్క ఎప్పుడూ అంతే. తనే మాకు మార్గదర్శి. మా అమ్మ తర్వాత అమ్మలాంటిది. మా సంతోషమే తన సంతోషం. మా చిన్నతనంలో నేను, మా చిన్నక్క శైలజ, అన్నయ్య రవి  అల్లరి పనులు చేసినప్పుడు  మా అమ్మ నుంచి దెబ్బలు తప్పించడంలో ఎప్పుడూ ముందుండేది. ‘‘ఏం ఆలోచిస్తున్నావు? మీ అన్నయ్య గురించేనా? హ్యాపీగా ఉందా!’’  కారు స్టీరింగ్‌ తిప్పుతూ పక్కనే కూర్చున్న నావైపు చూసి అడిగారు మా ఆయన.  ‘‘ఎప్పుడూ  ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో మాట్లాడుకోవడమే గానీ  నేరుగా చూసి ఎన్నాళ్ళైంది అన్నయ్యను. ఐదు సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు అన్నయ్య. మన పెళ్ళైన మూడేళ్ళకు అమెరికాకు వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. ఆ మాత్రం ఆనందం ఉండదా?‘’  అన్నాను.  ఇలా అన్నయ్య గురించి ఆలోచిస్తుండగానే  మళ్ళీ పెద్దక్క నుంచి ఫోన్‌ వచ్చింది... ‘‘ఎక్కడికొస్తున్నారు? నేనూ, మీ బావ ఇక్కడకు వచ్చేశాం.శైలజ, వాళ్ళాయన గురునాథం కూడా ఇక్కడకు చేరుకున్నారు.  మీకోసం ఎదురు చూస్తున్నాం. త్వరగా వచ్చేయండి.‘’ అని ఫోన్‌ కట్‌ చేసింది అక్క. మా కుటుంబంలో ఏ కార్యమైనా చేయాలంటే ముందుగా మా పెద్దక్క, బావతోనే సంప్రదిస్తారు మా అమ్మా,నాన్న. మా నాన్న స్కూలు టీచర్‌ అయినప్పటికీ, మా అక్క పెళ్ళికి బాగా ఖర్చవడం చేత  ఆ అప్పులను తీర్చడంలో మానాన్న ఇబ్బందులు పడుతున్నసమయంలో మా పెద్దక్కే మాకు ఎంతో సహాయపడింది. మేము వేసవి సెలవులకు పెద్దక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మాకు కావలసినవి అన్నీ కొనిచ్చేది. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు సంచి నిండా పచ్చిశనక్కాయలు, సున్నుండలు, పప్పుచెక్కలు, బొబ్బట్లు వేసి పంపించేది. అంతేకాదు మా అందరికీ బట్టలు కొని, కుట్టించి మరీ పంపేది. 

కారు మా ఇంటి ముందు ఆగింది. మేము కారు దిగి ఇంటి కాంపౌండ్‌ వాల్‌ గేటు తీసుకుని లోపలికి వెళ్తుండగా మా పెద్దక్క ఎదురొచ్చి.. ‘‘ఏంటి పిల్లాడు వంశీ రాలేదా!’’ అని అడిగింది.‘‘వాడు వాళ్ళ నానమ్మతో తర్వాత వస్తానన్నాడు. అందుకే మేమిద్దరమే వచ్చాం అక్కా’’ అన్నాను. ‘సరే లోపలికెళ్ళి ఫ్రెష్‌ అప్‌ అవ్వండి. ఈ లోపల కాఫీ తెస్తాను’’ అంటూ మా వెనుకే వచ్చి హాల్లోంచి వంటగదిలోకి వెళ్ళింది అక్క. హాల్లో ఉన్న మా అమ్మా నాన్న, మా చిన్నక్క, బావలతో కుశల ప్రశ్నల తర్వాత... నేను, మా ఆయన ఫ్రెష్‌అప్‌ అయ్యి మళ్ళీ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చోగానే కాఫీ మా చేతికి అందించింది మా పెద్దక్క. కాఫీ తాగుతూ అందరం సరదాగా మాట్లాడుకుంటుండగా... వీధిలోంచి కారు శబ్దం వినిపించడంతో అందరం ఇంటిగుమ్మం దాటి వీధిలోకి రాగానే మా అన్నయ్య పక్కన పాప సమీర, వదినతో బాబు సాహిత్‌ కారు దిగి వస్తున్నారు. మా అన్నయ్యను చూడగానే మా అందరి కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. అదే భావన అన్నయ్య, వదిన కళ్ళల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంటి గుమ్మం దాటి విశాలమైన హాలు మధ్య భాగంలో చతురస్రాకారంగా అమర్చిన సోఫాలలో ఒకదానిపై మా అన్నయ్య కూర్చోగానే,అన్నయ్యకు ఇరువైపులా అమ్మా నాన్న కూర్చున్నారు. వారికెదురుగా పెద్దక్క, చిన్నక్కకు మధ్యలో నేను కూర్చున్నాను. మాకు కుడివైపు బిందు వదిన. ఆమెకిరువైపులా సాహిత్, సమీర కూర్చుంటే, ఎడమవైపు ఉన్న సోఫాలో పెదబావ, చినబావకు మధ్యలో మా ఆయన కూర్చున్నారు. ‘‘ఏం అక్కా సౌమ్య, సుధ వాళ్ళు రాలేదా!‘’ అని ఇంజనీరింగ్‌ చదువుతున్న పెద్దక్క కూతుర్ని  గురించి అడిగాడు అన్నయ్య.‘‘వాళ్ళకి ఇవాళ్ట్నుంచి సెమిష్టర్‌ పరీక్షలురా. హాస్టల్లోనే చదువుకుంటున్నారు. ఈ ఆదివారం ఇంటికొస్తానన్నారు‘’ అని పెద్దక్క చెప్పింది. ఆ తరువాత...చిన్నక్క కొడుకు నవీన్‌ని దగ్గరకు తీసుకుని ‘‘ఏం చదువుతున్నావురా?‘’ అని అడిగాడు.‘సిక్త్స్‌ క్లాస్‌ మామయ్య’’ అన్నాడు వాడు.‘‘ఏం బుజ్జి! మీ వాడెక్కడ?’’ అని నాతో అనగానే–‘రేపు నాన్నమ్మతో వస్తాన్నాడు అన్నయ్య!’ అన్నాను. తర్వాత మా పెదబావ వ్యవసాయం, యల్‌.ఐ.సి పాలసీల గురించి, మా చినబావ స్కూలు విషయాలు, మా ఆయన మెడికల్‌ ప్రాక్టీసు గురించి వాకబు చేశారు అన్నయ్య.చాలాకాలం తర్వాత మా కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర చేరి పరస్పర ప్రేమానురాగాలు పంచుకోవడం చూసి మా అమ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మా నాన్న మనస్సులో ఉప్పొంగుతున్న ఉత్సాహం కళ్ళల్లో కనిపించడం నేను గమనించాను.  ఆరోజు నుంచి మా అన్నయ్య, వదినలకు  ఇష్టమైనవి అన్నీ.. మా అక్కాచెల్లెళ్లమే స్వయంగా వండి వడ్డించాము. 

చూస్తుండగానే వారం గడిచిపోయింది. ఈ మధ్యలో ఓరోజు అందరం  తిరుమలకు వెళ్ళొచ్చాము.  సినిమాలు, బంధువుల ఇండ్లకు తిరగడంతోనే  మరో వారం గడిచిపోయింది. అన్నయ్య అమెరికాకువెళ్ళడానికి ఇక రెండు రోజులే మిగిలింది. అప్పుడే అందరి గుండెల్లో గుబులు మొదలైంది. ఈ రెండురోజుల్లో ఒకరోజు ప్యాకింగ్‌ కే సరిపోయింది. ఇక అన్నయ్య వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. ఆరోజు సాయంత్రం అన్నయ్య బయలుదేరుతున్న సమయంలో అందరి కళ్ళల్లో బాధ దోబూచులాడుతోంది. అమ్మ కన్నీళ్ళను ఆపుకోలేకపోయింది. నాన్న మాత్రం మనస్సులోని బాధను బయటకుకనబడకుండా అవస్థ పడుతున్నాడు.. ఇది గమనించిన అన్నయ్య అమ్మా, నాన్నలను దగ్గరకు తీసుకుని ‘‘ఆరునెలల్లో మళ్ళీ వస్తానులేమా!’’ అని చెప్పడంతో అమ్మ మనస్సు కాస్త కుదుటపడింది. అన్నయ్య వాళ్ళు ఎక్కిన కారు వీధి మలుపు తిరిగేంతవరకు మేము చేతులు ఊపుతూనే ఉన్నాము నిర్లిప్త హృదయాలతో..ఆరోజు రాత్రి అమ్మోళ్ళింటిలోనే ఉండి, మరుసటిరోజు ఉదయమే మా ఇండ్లకు వెళ్ళిపోయాము. కానీ పెద్దక్క, బావ మాత్రం రెండ్రోజులాగి వెళ్తాము అని చెప్పి అక్కడే ఉండిపోయారు. 

మేము ఇంటికి వచ్చిన మరుసటిరోజు సాయంత్రమే పెద్దక్క నుంచి ఫోన్‌ వచ్చింది..‘హలో లక్ష్మి! నాన్న ఈరోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందని చెప్పిన కాసేపటికే కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే నేను, మీ బావ, అమ్మతో పాటు మన ఊరిలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. డాక్టర్లు పరీక్షించి ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఇంకా ఏమీ చెప్పలేదు. మీరు కంగారు పడతారని ఉదయం నుంచి చెప్పలేదు. మీరు వెంటనే హాస్పిటల్‌ దగ్గరకు వచ్చేయండి’’  అని మాట తడబడుతూ చెప్పడంతో ఇక నా మనస్సు మనస్సులో లేదు. కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. నోట మాటరావడంలేదు.వెంటనే నేను, మా ఆయన బయలుదేరి హాస్పిటల్‌ దగ్గరకు చేరుకునేసరికి రాత్రి ఎనిమిదైంది. అప్పటికే శైలజక్క, గురునాథం బావ అక్కడున్నారు. డాక్టర్‌ అన్నీ రిపోర్టులు చూసాక...‘‘ఈ పెద్దాయనకు రెండూ కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయి. వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తే తప్ప బతికే అవకాశాలు చాలా తక్కువ. మీరు సాధ్యమైనంత త్వరగా కిడ్నీ డోనర్ని సంపాదించగలిగితే అంత మంచిది. ఈ లోపల మేము డయాలసిస్‌ చేస్తూ కొంత వరకు కాపాడగలం’’ అని చెప్పడంతో మా అందరికీ నెత్తిమీద పిడుగు పడినట్లయింది. విషయం అన్నయ్యకు తెలిసినట్లుంది. అమెరికా నుంచి ఫోన్‌ చేశాడు పెద్దక్కకు.. ‘‘అక్కా!ఎంత ఖర్చైయినా పర్వాలేదు. నాన్నకు మెరుగైన వైద్యం అందించండి. నేను వీలు చూసుకుని వస్తాను’’ అని చెప్పాడు. డబ్బైతే ఖర్చుపెట్టగలంగానీ, కిడ్నీని ఎక్కడ్నుంచి తేగలం? తెలిసి, తెలిసి ప్రాణాన్ని ఎవరు పణంగా పెట్టగలరు!.‘‘ఏవండీ! నాన్నకు కిడ్నీ ఇస్తానండి!. ఒక కిడ్నీతో మనిషి బతకచ్చటగా!’’ అని నేను మా ఆయనతో చెప్పగానే..‘‘లక్ష్మీ! నీకేమైనా పిచ్చా! నీకేదైనా అయితే మా పరిస్థితి ఏంటి? నీవు ఎట్టి పరిస్థితులలో కిడ్నీ ఇవ్వటానికి లేదు’’ అని మా ఆయన ఖచ్చితంగా చెప్పడంతో నాన్నకు ఏమీచేయలేని నిస్సహాయక స్థితిలో మౌనంగా ఉండిపోయాను. ఇక చిన్నక్క ఇవ్వడానికి అవకాశమేలేదు.ఎందుకంటే తనకు ఈ మధ్యే గాల్‌ బ్లాడర్లో స్టోనుందని ఆపరేషన్‌ చేశారు. పెద్దక్క ఇస్తుందనుకుంటే మా ఆయన లాగ పెదబావ కూడా ఒప్పుకోకపోతే నాన్న పరిస్థితి ఏమిటి? అని నేను ఆలోచిస్తుండగా...‘‘ఏంటే! ఆలోచిస్తున్నావు? నాన్నకేమీ కాదు. ఎవరో ఒకరు డోనర్‌ దొరక్కుండా పోరు. నేను, మీ బావ అమ్మతో ఉంటాము. మీ ఆయనకు అక్కడ ప్రాక్టీసు దెబ్భతింటుంది. శైలజా! మీరు కూడా వెళ్ళండి. ఇద్దరూ రేపు స్కూలుకు వెళ్ళాలికదా! అవసరమైతే ఎల్లుండి వస్తురుగానీ’’ అని అక్క చెప్పడంతో మేము ఆ రాత్రి హాస్పిటల్‌ లోనే ఉండి, ఉదయమే ఇంటికి వచ్చేశాం.  రోజుమార్చి రోజు నేను, చిన్నక్క హాస్పిటల్‌కి వెళ్ళి నాన్నను చూసొస్తున్నాం. పెద్దక్కను మధ్యలో ఇంటికి పంపిస్తూ...ఇలా పదిరోజులు గడిచినప్పటికీ డోనర్‌ ఎవరూ దొరకలేదు. 

ఆరోజు నేను వంటింట్లో ఉండగా పెద్దక్క నుంచి ఫోన్‌... ‘‘ఏయ్‌ లక్ష్మీ! నాన్న ఇక మనల్ని వదలి ఎక్కడికీ పోరు. కిడ్నీ ఇచ్చే డోనర్‌ దొరికారు. రేపే ఆపరేషన్‌. అయితే డోనర్‌  తన పేరు బయటపెట్టొద్దనిడాక్టరుతో రిక్వెస్ట్‌ చేశాడంట. అందుకే డాక్టరు ఎంత అడిగినా చెప్పలేదు.రేపు సౌమ్య, సుధా వాళ్ళు హాస్టల్‌ నుంచి ఇంటికొస్తానన్నారు. వాళ్ళని కూడా తీసుకుని వీలైనంత త్వరగా హాస్పిటల్‌ దగ్గరకు వచ్చేస్తాను.హాస్పిటల్‌ వద్ద అమ్మా, నాన్న దగ్గర మీ బావ ఒక్కరే ఉన్నారు . మీరు ఉదయాన్నే వచ్చేయండి’’ అని ఉత్సాహంగా చెప్పింది పెద్దక్క.అక్క మంచి కబురు చెప్పటంతో  నా మనస్సు కుదుటపడింది. మరుసటిరోజు నేను, మా ఆయన హాస్పిటల్‌ దగ్గరకు వెళ్ళేసరికి పెదబావ ఒక్కరే అమ్మతో ఉన్నారు. అమ్మ ముఖంలో కాస్త తెంపు కనిపిస్తోంది. మేము వెళ్ళిన కాసేపటికి చిన్నక్క, బావ వచ్చారు. ఆపరేషన్‌కు ముందు ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసిన తర్వాత నర్సులు పెదబావ దగ్గరకు వచ్చి పేపర్స్‌ పై సంతకాలు తీసుకున్నారు. తర్వాత నాన్నను ఆపరేషన్‌ థియేటర్లోకి తీసుకెళ్ళారు.‘‘ఏంటి బావా! అక్క ఇంకారాలేదు. సౌమ్య, సుధా వాళ్ళను తీసుకుని త్వరగా ఇక్కడకు వచ్చేస్తానంది’’ అని అన్నాను.

‘‘పిల్లలు రావడం లేటైనట్టుంది. వచ్చేస్తుందిలే. మనమందరం ఉన్నాంగా!’’ అన్నాడు బావ. ఆపరేషన్‌ సక్సెస్‌ అవ్వాలని మనస్సులో దేవుణ్ణి  ప్రార్థించుకున్నప్పటికీ నాకు గుండెల్లో ఆందోళన తగ్గడంలేదు. నాకే కాదు మా అందరి పరిస్థితీ అలానే ఉంది. నాన్నను ఆపరేషన్‌ థియేటర్లోకి తీసుకెళ్ళిన మూడుగంటల తర్వాత తీసుకొచ్చారు. ఆపరేషన్‌ సక్సెస్‌ అని డాక్టర్లు చెప్పడంతో మేమందరం ఊపిరిపీల్చుకున్నాం. కానీ ఇంకో గంట వరకు ఎవ్వరూ పేషెంట్‌ను చూడటానికి వీల్లేదని డాక్టర్లు సూచించడంతో మేము వెయిటింగ్‌ హాల్లోనే కూర్చున్నాం. ఇంతలో నర్సు వచ్చి డాక్టర్‌ రమ్మంటున్నాడని పెదబావను తీసుకెళ్ళింది. బావ వెళ్ళిన కాసేపటి తర్వాత... డాక్టరు బావనెందుకు రమ్మన్నారో ఆత్రుతతో డాక్టర్‌ ఉండే రూము దగ్గరకు వెళ్ళాను. డాక్టర్‌ బావ భుజం తట్టి ఏదో చెప్తున్నాడు. డాక్టర్‌ రూమ్‌కి అద్దాలు ఉండడం వల్ల బయటకు ఏమీ వినిపించడంలేదు. అటుగా వెళ్తున్న నర్సును పిలిచి అడిగాను..‘‘సిస్టర్‌ మానాన్నకు ఏం పర్వాలేదు కదా! డాక్టర్‌ మా బావతో ఏం చెప్తున్నాడో అర్థం కావటంలేదు’’ అన్నాను. ‘‘మీ నాన్నకు ఏం పర్వాలేదు మేడమ్‌! సరియైన సమయానికి డోనర్‌ దొరకడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు’’ అని చెప్పింది.‘‘సిస్టర్‌ ఇంతకీ మా నాన్నకు కిడ్నీ ఇచ్చిన డోనర్‌ ఎవరో మీకు తెలుసా?’’ అని అడిగాను.
 
‘‘ఎవరో మాకు తెలియదు మేడమ్‌! ఇప్పుడు రూమ్‌ నెంబర్‌ 306 లో అబ్జర్వేషన్లో ఉంది. ఆ రూమ్‌ ఇన్‌చార్జ్‌ నర్సుని అడిగితే చెప్తుంది’’ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆ రూము దగ్గరకు వెళ్ళేసరికి అప్పుడే డోర్‌ తీసుకుని నర్సు బయటకు వచ్చింది. ‘‘సిస్టర్‌ కిడ్నీ డొనేట్‌ చేసిన వారి డీటెయిల్స్‌ చెప్పగలరా?’’ అడిగాను.‘‘ఇంతకీ మీరెవరు?’’‘‘ఈ రూములో ఉండే పేషంటే మానాన్నకు కిడ్నీ డొనేట్‌ చేశారని తెలిసింది.దయచేసి వారి డీటెయిల్స్‌ చెప్పగలరా సిస్టర్‌!’’ అని అడిగాను. ‘‘మేడమ్‌! ఆ పేషంట్‌ డీటెయిల్స్‌ ఈ ఫైల్‌లో ఉన్నాయి చూడండి’’ అని ఫైల్‌ నా చేతికందించింది. ఆ ఫైల్లో డోనర్‌ నేమ్‌ దగ్గర సుజాత, వైఫ్‌ఆఫ్‌ గురు దశరథప్రకాశరావు అని ఉంది. ఏంటి మా అక్కా, బావ పేర్లు ఉన్నాయి! అని ఆశ్చర్యంతో.. నేను చూస్తున్నది నిజమేనా అనుకుంటుండగా.. అప్పుడే  అక్కడికి మా పెదబావ వచ్చారు. ‘‘ఏంబావా! ఈ ఫైల్లో మీపేరు, అక్క పేరు ఉన్నాయి. కిడ్నీ ఇచ్చింది అక్కేనా!’’ అని ఆత్రుతతో అడిగాను. ‘‘అవును లక్ష్మి!  ఎంత వద్దంటున్నా.. మా నాన్నను ఎలాగైనా బ్రతికించుకోవాలని, మా నాన్నకు ఏమైనా అయితేనేను తట్టుకోలేనని,  దయచేసి నేను కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకోండి అని నాతో మీ అక్క అడిగేసరికి కాదనలేకపోయాను’’ అని బావ చెప్తుంటే..నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ‘‘సిస్టర్‌ ఇప్పుడు మా అక్కను చూడచ్చా’’  అని అడిగాను. ‘‘ఇక పది నిమిషాల్లో స్పృహ వస్తుంది. అప్పుడు మీరు చూడచ్చు. రూము లోపలికెళ్ళి కూర్చోండి’’ అని చెప్పింది.మేము రూములోకి వెళ్ళిన కాసేపటికి అక్కకు స్పృహ వచ్చింది. అక్క దగ్గరకు పోవడానికి నాకు ధైర్యం చాలడంలేదు.
 
మమ్మల్ని దగ్గరకు రమ్మని కళ్ళతో సైగ చేసింది.అక్కను చూస్తుంటే నాన్నను కాపాడిన ప్రాణదేవత మంచంపై పవళించినట్లు కనిపిస్తోంది. నేను అక్క దగ్గరకు వెళ్ళి రెండు కాళ్ళను నా చేతులతో పట్టుకోగానే నా మనస్సులోని బాధ కళ్ళ నుంచి కన్నీళ్ళ రూపంలో జాలువారి అక్క పాదాలపై పడింది. ‘‘ఏయ్‌! పిచ్చి పిల్లా! ఇప్పుడు నాకేం అయిందని! ఊరుకో. అవునూ నాన్న ఎలా ఉన్నాడు?’’ అని అడిగింది. అప్పుడే నర్సు లోపలికి వచ్చి ‘‘మీనాన్నగారికి స్పృహ  వచ్చిందంట. డాక్టరు మిమ్మల్ని రమ్మంటున్నాడు’’ అని చెప్పింది. ‘‘సిస్టర్‌  మా నాన్నను నేనూ చూడాలి. నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి’’  అని చెప్పింది పెద్దక్క.‘‘ఇప్పుడు మీరు నడవటానికి వీల్లేదండి. రెండు రోజుల వరకు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలి’’  చెప్పింది నర్సు. ‘‘ఏవండీ! నన్ను స్ట్రెచర్‌ పై నైనా నాన్న దగ్గరకు  తీసుకెళ్ళమని డాక్టర్‌తో చెప్పండి. నేను ఇప్పుడే నాన్నను చూడాలి. అయితే నాన్నకి నేను కనిపించకూడదు’’ అని అక్క  పట్టుపట్టడంతో  డాక్టరు పర్మిషన్‌తో నాన్న రూము దగ్గరకు అక్కను తీసుకెళ్ళాము. మేమందరమూ రూములోనికి వెళ్ళినప్పటికీ, అక్క మాత్రం బయట కిటికీ  నుంచే చూస్తానంది.నాన్న మా అందరితో ఉత్సాహంగా మాట్లాడుతుండడం వలన కలిగే ఆనందం... మా కంటే రూమ్‌ కిటికీ అద్దానికి  వేసిన కర్టెన్‌ నుంచి చాటుగా చూస్తున్న పెద్దక్క కళ్ళల్లోనే ఎక్కువగా  నాకు కనిపించింది.
- దేవీప్రసాద్‌ ఒబ్బు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top