
భీమేశ్వర్ ఐదవ తరగతి చదువుతున్నాడు.రోజూ స్నేహితులతో కలిసి స్కూల్‌కి వెళ్లి వస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటి నుంచి స్కూల్‌కి వెళ్ళే దారిలో పెద్ద ఖాళీస్థలం ఒకటి ఉంటుంది. ఆ ఖాళీస్థలంలో సాయంత్రం అయ్యేసరికి చాలా మంది పిల్లలు చేరి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ అక్కడ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. దేశంలో అనేక చోట్ల తయారైన వివిధ రకాలైన వస్తువులను ఒకచోట చేర్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. వ్యాపారస్తులు ప్రజల్ని ఆకర్షించే విధంగా ఎగ్జిబిషన్లను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తుంటే, పెద్ద లారీలో ఏవో సామగ్రితోపాటు కొన్ని జంతువుల బొమ్మలు కూడా వాటితో వచ్చాయి. వాటిలో ఏనుగు బొమ్మ పెద్దదిగా ఉండడంతో బయటకి కనిపించింది. అది నల్ల రంగులో ఉంది. అన్ని జంతువుల కన్నా పెద్దగా, చేటంత చెవులతో, తెల్లటి పొడుగాటి దంతాలతో చూడ ముచ్చటగా తమను చూసి నవ్వుతుందా అన్నట్లు అనిపించింది చూసేవాళ్ళకి. ఏనుగు బొమ్మను లారీలోంచి దింపగానే పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ ఊరికి ఎగ్జిబిషన్ వచ్చినందుకు సంబరపడ్డారు. వాటిని భీమేశ్వర్‌తో పాటు పిల్లలందరూ ఆసక్తిగా గమనించారు. ఎగ్జిబిషన్ లోపల రంగులరాట్నం, ఎన్నో ఆకట్టుకునే వస్తువులు ఉన్నా, ఏనుగు బొమ్మే నచ్చింది వాళ్ళకి. భీమేశ్వర్‌కి అప్పటికప్పుడు నిజం ఏనుగును చూడాలని అనిపించింది. ఇంటికి వెళ్లి అమ్మని అడిగాడు.. ‘అమ్మా! నాకు నిజమైన ఏనుగుని చూడాలని వుంది’.‘నిజమైన జంతువులు అడవుల్లోనే ఉంటాయి. లేదంటే జంతు ప్రదర్శనశాలలో ఉంటాయి. అది మన ఊరిలో లేదు. ఎప్పుడైనా హైదరాబాద్‌లో అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు చూద్దువులే’ అంది. ఆ మాటకి నిరాశ చెందాడు భీమేశ్వర్. నిజం ఏనుగుని చూడాలంటే, అన్ని రోజులు ఆగాలా అని. వాడి బిక్క మొహాన్ని అర్థం చేసుకొని ‘ఈసారి వేసవి సెలవులకి వెళ్దాం’ అని నచ్చజెప్పింది అమ్మ.
ఆరోజు... హోం వర్కు చేసి పడుకున్న భీమేశ్వర్‌కి పదేపదే ఆ ఏనుగు బొమ్మే గుర్తుకు వచ్చింది. అది కళ్ళతో తనని చూసి నవ్వుతున్నట్లే అనిపించింది. నిద్రలోకి వెళ్ళిపోయిన భీమేశ్వర్‌కి చుట్టూ తన స్నేహితులే కనిపించారు రంగురంగుల బట్టలేసుకుని తూనీగల్లా. ‘అరే, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా. అప్పుడే ఎలా వచ్చేశారు’ ఆశ్చర్యంగా చూడసాగాడు. వాళ్లందరూ తనలాగే నిజం ఏనుగుని చూడాలనే కోరికతో ఉన్నట్లు తెలిసింది. అందరూ కలిసి అడవి వైపు వెళ్ళసాగారు. ముందు భీమేశ్వర్ నడుస్తుంటే.. మిగిలిన పిల్లలందరూ వెనకాలే రా సాగారు. వారి ఆనందానికి అవధులు లేవు. అడవంతా బాగా తెలుసునన్నట్లు ఉత్సాహంగా గంతులేస్తూ ముందుకి వెళుతున్నారు. ఆ అడవి పూల మొక్కలతో, పండ్ల మొక్కలతో నిండి ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఓ జలపాతం కనిపించింది. జలపాతానికి అవతలి వైపున ఉన్న తటాకం వద్ద ఊడలమర్రి చాలా స్థలం ఆక్రమించుకుని దట్టంగా వ్యాపించి ఉంది. దాని మీద ఎన్నో పక్షులు, జంతువులు నివాసం ఏర్పరచుకుని ఉన్నట్లున్నాయి. కోలాహలంగా ఉంది. జలపాతంలో చాలా జంతువులు జలకాలాడుతూ కనిపించాయి. వాటిలో వాళ్ళు చూడాలనుకునే ఏనుగు కూడా కనిపించింది. నల్లని రంగులో భారీగా, పెద్ద తొండం, తలకి ఇరువైపులా చేటంత చెవులతో తెల్లని పింగాణీ దంతాలతో మిలమిల మెరుస్తోంది. అది తొండంతో నీళ్ళు పీల్చి, తోటి జంతువులపై తుంపరల జల్లు కురిపిస్తోంది. ఆ జల్లుల్లో అవి అన్నీ జలకాలాడుతూ సేదతీరుతున్నాయి.
చూడాలనుకుంటున్న ఏనుగు నిజంగా కనిపించేసరికి ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. అచ్చు ఎగ్జిబిషన్లో పెట్టినట్లే ఉంది అనుకుంటూ ఒకళ్ళను ఒకళ్ళు కూడబలుక్కుని, ‘గణపతి బప్పా మోరియా’ అని అరిచారు.
దాంతో పిల్లలందరినీ ఆ అడవిలోని జంతువులు చూశాయి. తమని చూడడానికి పట్నం నుంచి పిల్లలు వచ్చారని చాలా సంబరపడ్డాయి. సింహం సైతం శాంతంగా మారి, పిల్లలకి స్నేహహస్తం అందించింది. ‘ఏంటర్రా పిల్లలూ.. ఇలా వచ్చారు’ అంటూ ప్రేమగా అడిగింది.సింహాన్ని చూసి ముందు భయపడినా, దాని శాంత స్వభావాన్ని చూసి ధైర్యం తెచ్చుకుని చెప్పాడు భీమేశ్వర్ ‘మిమ్మల్ని అందర్నీ చూడాలని వచ్చాం. ముఖ్యంగా ఏనుగు.. గజరాజుని’.అలా అంటూ ఉంటే, మిగిలిన జంతువులు జింక, నక్క, ఎలుగుబంటి, కుందేలు, తాబేలు, పావురం, చిలుక, పులి, ఒంటె వాటి స్థావరాల నుంచి బయటకు వచ్చి అక్కడికి చేరుకున్నాయి. భీమేశ్వర్ మాటలకు పులి, ఏనుగు వంక అసూయగా చూస్తూ ‘ఏం.. ఏనుగునే అంత ముఖ్యంగా ఎందుకు చూడాలని అనుకున్నారు. మేమంతా జంతువులము కామా?’ అడిగింది కినుకగా.‘ఏనుగు అంటే గణపతి అవతారం. ఏ విషయంలోనైనా గణపతినే మేము ముందుగా పూజిస్తాం. విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గజాననుడు, మూషిక వాహనుడు అని చాలా పేర్లతో పిలుస్తుంటాం. అలాంటి ఏనుగు బొమ్మనే మా ఊరి ఎగ్జిబిషన్లో పెట్టారు. అది చాలా బాగుంది. అప్పటినుంచే నిజం ఏనుగు ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది’ చెప్పాడు భీమేశ్వర్.‘అవును. మేము కూడా అంతే, అందుకే అందరం కలిసి వచ్చేశాం’ చెప్పాడు విభువన్.
‘మీరందరూ దేవుళ్ళకు వాహనాలు. అయితే, గణపతి మాత్రం మాకు కనిపించే దేవుడు. పండుగ రోజుల్లో వీధికి ఒక చోట గణపతి విగ్రహాల్ని ప్రతిష్టిస్తాం’ చెప్పింది సుప్రజ.‘అవును. మేము పుస్తకాల పూజ అంటూ వినాయకుడికి తొలి పూజ చేస్తాం ప్రతి ఏటా. ఇప్పుడు నిజంగా గణపతి బప్పాని చూశాం’ సంతోషంగా చెప్పాడు అనిరు«ద్. ఆ ప్రశంసలకి గజరాజు సంతోషపడి, మురిపెంగా తలాడిస్తూ.. పిల్లలకి ఇష్టమని పొలంలోకి వెళ్లి కొన్ని చెరకుగడలూ, మొక్కజొన్న కండెలు కోసుకొని తెచ్చిచ్చింది. కోతి రేగుపండ్లు, కుందేలు కొన్ని రకాల దుంపలు, ఎలుగుబంటి పుట్టతేనె పట్టుకొచ్చి పెట్టాయి.పిల్లలందరూ ఇష్టంగా తిన్నారు. వాటితోపాటు కలిసి తనివితీరా ఆడి పాడారు. అమ్మాయిల కోసం చాలా పూలు కోసుకొచ్చి ఇచ్చాయి. అలా ఎంతసేపు గడిచిందో గాని... తెలతెలవారుతున్నట్లు తూర్పు రేఖలు విచ్చుకోవడంతో, ఎప్పుడు లేచిందో గాని ఓ కోడి సమస్త జనావళిని మేల్కొల్పడానికి ‘నేను సైతం’ అన్నట్లు ‘కొక్కొరోకో’ అంటూ గొంతెత్తి కూసింది.కలలో వినిపించినట్లు అనిపించినా అది పక్క ఇంట్లో కోడే కావడంతో మెలకువ వచ్చేసింది భీమేశ్వర్‌కి. అప్పటివరకూ ఉన్న కల కళ్ళ ముందు మెదిలింది. కలలో నిజం ఏనుగును చూసినందుకు సంతోషపడుతూ, విషయాన్ని తోటి స్నేహితులకి చెప్పాలని ఉత్సాహపడ్డాడు.