కొత్త పుస్తకాలు (21-12-2014)

కొత్త పుస్తకాలు (21-12-2014)


కతలమ్మ కతలో.... వేడి వేడి కతలో వాడి వాడి కతలో...  కొన్ని సంవత్సరాల క్రితం సం.వె.రమేశ్ తన నెత్తి మీద గంప పెట్టుకొని ‘కతలమ్మో...కతలు’ అని అరిచాడు. మార్కెట్‌లో కల్తీ కతల బెడద ఎక్కువైన రోజుల్లో ‘ఆ...ఏమింటాం లే’ అనుకున్నవాళ్లు కూడా ఆ నోట ఈ నోట విన్న సమాచారంతో ఉరుకులు పరుగుల మీద రమేషు కతల గంప ముందు క్యూ కట్టారు.

 

‘అరపడి వడ్లకు ఒక కత.  పడి తైదుకులకు ఒక కత....’ ఇట్లా ఆయనేమీ ‘ఇది కావాలి...అది కావాలి’ అని అడగలేదు. ఆశించలేదు. ‘‘మీరు వింటానంటే... ఎన్ని కతలైనా చెబుతాను’’ అన్నాడు. ‘ప్రళయ కావేరి’ని అవిభక్త ఆంధ్రదేశంలో ఊరూరికి పరిచయం చేశాడు. ‘శబ్బాష్’ అనిపించుకున్నాడు. ఇప్పుడు అదే రమేషు మరో సారి గంప పట్టుకొని వచ్చాడు. గంపలో ఉన్న రెండు తక్కువ ఇరవై కతలన్నీ వేడి వేడి ముద్దగారెల వలే ఉన్నాయి. నారపరెడ్డి అనే కాపాయన కథ కావచ్చు, ఆ కథలో చివర్లో ఉన్న మెరుపు కావచ్చు, ‘తల్లి బాసను వొద్దనుకున్న  ఊరి కంటే, తెలుగే కావాలన్న మాలాడే నాకు గుడి’ అనే సుబ్బరాజు కన్నీటి మాట(మీసర వాన కథలో)కావచ్చు, ‘కుంటి మల్లారెడ్డి గుర్రాన్ని ఎక్కే-గంట శంకూ తిత్తీ బుజాన బెట్టే’ అని సాగే పాట కావచ్చు...ఒక్కటా రెండా ఈ  కతల గంప నిండా మనం ‘ఆవురావురుమని’ వినదగిన కతలెన్నో ఉన్నాయి.

 ఈ కథల్లో కథలు మాత్రమే ఉన్నాయంటే, మొహమాటానికి  కూడా ఎవరూ ఒప్పుకోనక్కర్లేదు. రచయిత ఒక గైడ్‌గా మారి, ఆయా ప్రాంతాల నైసర్గిక సౌందర్యాన్ని ఎంతో గొప్పగా వర్ణించాడు. అలాంటి వాటిలో నుంచి కుప్పలు కుప్పలుగా కవిత్వాన్ని ఏరుకోవచ్చు. కథ చివర్లో ఇచ్చిన పదాల అర్థాలు తెలుసుకోవడం మజా అనిపిస్తుంది. ఆ రకంగా ఒక నిఘంటువును కూడా రచయిత మన చేతిలో పెట్టాడు.

 

 కొద్దిమంది రచయితలు ‘మాండలికం’రాసి చివర్లో దానికి కత జోడిస్తారు. ఈ దెబ్బతో పక్కప్రాంత వాసులను పక్కన పెట్టండి... ఆ మాండిలికవాసులకే కత అర్థం కాదు. అదృష్టవశాత్తు అట్టి ప్రమాదమేదీ ఈ కతల్లో మనకు కనిపించదు, ఒక కొత్త ఊరిని చూసిన ఆనందమే తప్ప ఏ ఇబ్బందీ ఉండదు. ‘సామాజిక స్పృహ’ అనేది విడిగా ఒంటరి దీవిలో కాలు మీద కాలేసుకొని ఉండదనీ, అది కతలోనే లీనమై మౌనంగా ఉంటుందనీ చెప్పిన కతలు ఇవి. రండి మరి, కతల బండి దగ్గరికి!

 

 కతల గంప

 రచన: స.వెం.రమేశ్

 పేజీలు: 216; వెల: 200

 ప్రతులకు: అన్ని ముఖ్య పుస్తకకేంద్రాలతోపాటు, 1-2-740,

  హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట, బోధన్-503180,

 నిజామాబాద్ జిల్లా. ఫోన్: 9010153505

 - యాకూబ్ పాషా

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top