వివేకం : శుద్ధికి ఉండాలి సందర్భశుద్ధి! | food items what to eat | Sakshi
Sakshi News home page

వివేకం : శుద్ధికి ఉండాలి సందర్భశుద్ధి!

Mar 16 2014 1:29 AM | Updated on Sep 2 2017 4:45 AM

వివేకం : శుద్ధికి ఉండాలి సందర్భశుద్ధి!

వివేకం : శుద్ధికి ఉండాలి సందర్భశుద్ధి!

వెనకటి కాలంలో చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని, ముడి రూపంలో వాడేవారు. వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని ఒక మోస్తరు రాళ్లుగా విడగొట్టి స్వీకరించేవారు.

ఈ రోజు మన ఆహారంలో దాగున్న కొన్ని విషపూరితమైన వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే మీరు చేర్చదగ్గ ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయాల గురించి కూడా!


 చక్కెర: వెనకటి కాలంలో చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని, ముడి రూపంలో వాడేవారు. వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి, దాన్ని ఒక మోస్తరు రాళ్లుగా విడగొట్టి స్వీకరించేవారు. కానీ ఈ రోజున, వాణిజ్యపరంగా దొరుకుతున్న చక్కెర చాలావరకూ రసాయన ప్రక్రియలకు గురైనది. శుద్ధి చేయబడిన చక్కెరను అధిక మోతాదులో స్వీకరించడం రక్తనాళాలు గట్టిపడడాన్ని తీవ్రం చేస్తుంది. మధుమేహ వ్యాధి నియంత్రణను కష్టతరం చేస్తుంది. చక్కెరకు ప్రత్యామ్నాయాలు:
 
 బెల్లం - చెరుకురసంలో ఉన్న పోషకాలు, విటమిన్లను బెల్లం తయారీలో కోల్పోదు. ఆయుర్వేదంలో దీన్ని జీర్ణవ్యవస్థ మెరుగుదలలో, ఎన్నో ఆరోగ్య సమస్యల వైద్యాలలో ఉపయోగిస్తారు. ఈ రోజున, కొన్ని రకాల బెల్లంలో సూపర్ ఫాస్ఫేట్ కలుపుతున్నారు. తెల్లటిది సూపర్ పాస్ఫేట్ బెల్లం. దీన్ని మానుకోవాలి. నల్ల బెల్లం వాడండి.
 
 తేనె- ఇది ప్రతిరోజూ స్వీకరించడం ఎంతో మేలు. అధిక శ్లేష్మం, ఆస్తమా ఉన్నవారికి మంచిది. బుర్రని చురుగ్గా ఉంచుతుంది. ఎలా స్వీకరిస్తున్నాం అనేదాన్ని బట్టి తేనె మానవ వ్యవస్థ మీద వివిధ రకాల ప్రభావాలను చూపిస్తుంది. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే, ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతుంది.
 
 శుద్ధి చేయబడిన ధాన్యాలు: ధాన్య నిర్మాణంలో మూడు భాగాలుంటాయి - బీజ పోషకం, పొట్టు, బీజం. బీజంలో మొక్క అండం ఉంటుంది. బీజ పోషకం బీజానికి ఆహార సరఫరా చేస్తుంది. ఇక పొట్టు - బీజాన్ని, బీజ పోషకాన్ని కప్పి వాటికి రక్షణ అందించే కవచం. బీజ పోషకంలోని ప్రధాన అంశం పిండి పదార్థం. బీజం, పొట్టులతో పోలిస్తే బీజ పోషకంలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం తక్కువ. దీనికి విరుద్ధంగా బీజం, పొట్టులలో ఈ పోషకాలు సంవృద్ధిగా దొరుకుతాయి. బీ విటమిన్లు, అమినో ఆమ్లాలు, పైటోకెమికల్స్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్ లాంటి ఖనిజాలు వీటిలో ఉంటాయి.


 ధాన్యాన్ని వ్యాపారపరంగా అమ్మే ముందు, ఎక్కువ నిల్వ ఉండటానికి వాటిని శుద్ధి చేస్తూ ఉంటారు. రిఫైన్డ్ గ్రైన్స్‌గా పిలవబడే ఈ ధాన్యాలలో బీజం, పొట్టు పారేయబడతాయి. ఫలితంగా మిగిలేది పోషకాలు, ఖనిజాలు, పీచు పదార్థం కోల్పోయిన ధాన్యం మాత్రమే.
 
 ప్రత్యామ్నాయాలు: పట్టు తక్కువ బియ్యం, దంపుడు బియ్యం, శుద్ధికి గురికాని గోధుమ ఈరోజుల్లో దొరుకుతున్నాయి. గుండె జబ్బు, క్యాన్సర్, ఊబకాయం, టైప్ 2 మధుమేహం లాంటివాటి ముప్పుని తగ్గించగల ఎన్నో పదార్థాలు ఈ ధాన్యాలలో మెండుగా ఉన్నాయి. మన ఆహారంలో ఒకటి లేదా రెండు ధాన్యాల కంటే ఎక్కువ ఉండటం ముఖ్యం
 
 రాగులు- అన్ని ధాన్యాల్లోకీ అధిక పోషణ విలువ కలిగిన ధాన్యం! శరీరంలోకి తేలిగ్గా స్వీకరించబడుతుంది. మానవారోగ్యంలో కీలకమైన పలు అమినో ఆమ్లాలు, ఖనిజాలు ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి. పాస్పరస్, ఐరన్ శాతం కూడా ఎక్కువే.
 
 జొన్నలు- వీటిలో అధిక మొత్తాలలో బి-విటమిన్లు, పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, మ్యాంగనీస్ లాంటి ఖనిజాలు ఉంటాయి. గోధుమ అలెర్జీలు గలవారికి బాగుంటుంది. బియ్యం, గోధుమల కంటే జొన్నలు పోషకపరంగా ఉత్తమం.
 
 పాలు: మూడేళ్లలోపు పిల్లలకు మాత్రమే పాలని పూర్తిగా జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ ఉంటాయి. అయితే, పాలని సంప్రదాయంగా కాల్షియం వనరుగా భావిస్తారు. క్యాల్షియాన్ని అందించే ఇతర వనరులు కూడా ఉన్నాయి.
 
 ప్రత్యామ్నాయాలు
 వేరుశనగ - ఇది సంపూర్ణ ఆహారం. చాలామంది యోగులు ఈ ఒక్కదానిమీదే ఆధారపడేవారు. అయితే, తినేముందు కనీసం 6 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. దీనివల్ల పిత్తానికి సంబంధించిన అంశాలు పక్కకు వెళ్లిపోతాయి.
 
 ఉలవలు- ఐరన్, క్యాల్షియంలకు మంచి వనరు. మొలకెత్తిన ఉలవలు సులభంగా జీర్ణమవుతాయి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు, ఉలవలు శరీరాన్ని వేడెక్కిస్తోంటే, మొలకెత్తిన పెసరపప్పుని తినడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు.మిమ్మల్ని శక్తితో నింపే ఆహారాలపై దృష్టి నిలిపి, సోమరుల్ని చేసే ఆహారాలను మానుకోండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement