అస్పృశ్యతపై ఒక సమరయుని సమరం!

Doctor Prabhu Kiran Christian Devotional Message In Sakshi Funday

సువార్త

ఒకసారి ఎంతో భావగర్భితమైన ఉపమానాన్ని యేసుప్రభువు చెప్పాడు. ఇజ్రాయెల్‌ దేశంలో ఉత్తరాన యేసుప్రభువు నివసించిన నజరేతు గ్రామమున్న గలిలయ ప్రాంతానికి, దక్షిణంలోని యెరూషలేము పట్టణానికి మధ్య రాకపోకలకు రెండు మార్గాలున్నాయి. ఒకటేమో సమరయ గ్రామాల గుండా వెళ్లే దగ్గరి మార్గం. కానీ సమరయులు అంటరానివారు గనుక సనాతన యూదులు ఆ మార్గంలో వెళ్లేవారు కాదు. రెండవది దూరమార్గం కానీ సనాతన యూదులుండే యెరికో లాంటి పట్టణాల గుండా వెళ్లే మార్గం. అయితే దొంగల బెడద కూడా బాగా ఉన్న మార్గమది. ఒకసారి ఆ మార్గంలోనే సనాతన యూదుడొకతను ప్రయాణమై వెళ్తూ దొంగల బారినపడ్డాడు. దొంగలతన్ని బట్టలతో సహా పూర్తిగా దోచుకొని విపరీతంగా  కొట్టి కొనప్రాణాలతో దారిపక్కన పడేశారు. అపుడు అతనిలాగే సవర్ణులు, సనాతనులైన ఒక యాజకుడు, లేవీయుడు అటువైపు వచ్చికూడా అతన్ని పరామర్శించకుండా వెళ్లిపోగా, ఒక  సమరయుడు అటుగా వెళ్తూ అతన్ని చూసి, పరామర్శించి, అతని గాయాలు కట్టి, ఆ మార్గంలోనే ఉన్న  ఉన్న ఒక పూటకూళ్లవాని ఇంట్లో అతన్నిచేర్చి, అతనికయ్యే ఖర్చంతా భరించాడు.

మనవాళ్లే కదా అనుకున్న యాజకుడు, లేవీయుడు స్వార్ధపరులై అతన్ని  ముట్టుకోవడం కాదు కదా కనీసం చూడకుండా మొహం చాటేసి వెళ్ళిపోగా,  ఏ అంటరాని వాళ్లకయితే దూరంగా ఉండాలనుకొని యెరికో దారినెన్నుకొని ఆపదల్లో పడ్డాడో, ఆ అంటరానివాడే ఆప్తుడై అన్ని సపర్యలూ చేసి క్షతగాత్రుని బతికించాడు. మతపరంగా ప్రముఖులు, జ్ఞానులైన ఆ యాజకుడు, లేవీయుడి కన్నా. అంటరానివాడైన ఆ సమరయుడే నిజమైన పొరుగువాడు, అసలైన విశ్వాసి అని యేసుప్రభువు తేల్చి, విశ్వాసానికి నిజమైన ప్రామాణికతనిస్తూ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న నియమం కన్నా అతున్నతమైనది మరొకటి లేదని బోధించాడు. అలా క్రైస్తవానికి ఈ బోధే మూలరాయి అయ్యింది.

అయితే యేసుక్రీస్తు జీవితంలో నుండి పెల్లుబికిన ఇలాంటి విశిష్టమైన బోధలతో ఆవిర్భవించిన ‘క్రైస్తవం’,ఒక ‘మతం’ స్థాయికి దిగజారడంతో సమస్యలన్నీ మొదలయ్యాయి. నిజమైన ప్రేమ, సోదరభావం, సౌభ్రాతృత్వానికే  కాదు, స్వార్ధం, పగ, ద్వేషం, వివక్షకు కూడా కుల, మత, ప్రాంతీయాది విభేదాల్లేవు, సరిహద్దులు అసలే లేవన్నదే ఇందులోని తాత్పర్యం!! ఈ సూక్ష్మం అర్ధమైతే, క్రైస్తవంలోనే కాదు ప్రపంచంలోనే అసలు సమస్యలు లేవు. ’అయ్యో! మన మనవాడే కదా!’’ అన్న జాత్యాభిమానంతోనైనా ఆపదలో ఉన్న వాడిని ఆదుకోని ’పచ్చి స్వార్థపరులు’ ఆ యాజకుడు, లేవీయుడైతే,‘నన్ను అంటరాని వాణ్ని చేసిన దుర్మార్గుడితను’ అని ఈసడించుకోకుండా, అతన్ని కాపాడిన ‘మహోన్నతమైన ప్రేమ, మానవత్వం’ ఆ సమరయుడిది. మనం తరచుగా వాడే ‘మనవాడు’, ‘పగవాడు’ అన్న పదాలు ఎంత అర్ధరహితమైనవో తెలిపే బోధ ఇది.

మనల్ని ఆపదలో ఆదుకున్నవాడే మనవాడు, పొరుగువాడనీ, మొహం చాటేసే ‘మనవాళ్ళు’ పగవారికన్నా తక్కువైనవారేమీ కాదని తెలుపుతూ, మానవత్వాన్నే పునర్నిర్వచించిన పునాదిరాయి ఈ బోధ! పెద్దలు సౌకర్యార్థమై కొన్ని శాఖల్ని మనలో ఏర్పాటుచేసినా, ఒక డినామినేషన్‌ కాకి మరో డినామినేషన్‌ మీద వాలనంత వైషమ్యం, ప్రేమకు, ఐక్యతకు మారుపేరైన క్రైస్తవంలో మనకెందుకుందో లోకానికి, దేవునికి కూడా ఒకరోజున మనం సంజాయిషీ చెప్పాలి. ప్రాణం మీది తీపితో ఒక సర్జరీ చేయించుకునేటపుడు ‘డాక్టర్‌’ మనవాడా?’ అని ఆలోచించని వారికి, పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు ‘మనవాళ్ళా’? అని అడగని వారికి, కొన్ని సందర్భాల్లోనే ‘మనవాళ్ళా?’ అనడిగే సంకుచితత్వమా? పుట్టుకతోనే ఎవరూ విశ్వాసులు కాదు. అలాగని ఎన్నేళ్లైనా క్రీస్తు సారూప్యం ఏర్పడకుంటే, అసలు క్రైస్తవులమే కాదు!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 
సంపాదకుడు – ఆకాశధాన్యం
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top