ఎదలో గానం... పెదవే మౌనం...

ఎదలో గానం... పెదవే మౌనం...


సినిమా వెనుక స్టోరీ - 30

 ఇంకా పూర్తిగా తెల్లారలేదు. వెలుతురు గుమ్మంలోకి రావడానికి కొత్త పెళ్లికూతుర్లా సిగ్గుపడుతోంది. అలాంటి టైమ్‌లో నిద్ర లేస్తాడు శేఖర్. గ్రామఫోన్ ఆన్ చేస్తాడు. ‘మనసున మల్లెల మాలలూగెనే’ అంటూ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ సాంగ్ అలలు మొదలవుతాయి. చేతిలో పొగలు కక్కుతూ కమ్మని ఫిల్టర్ కాఫీ. గుమ్మం దగ్గర కూర్చుని కాఫీ తాగుతూ ప్రకృతి తొలి పరిమళాన్ని ఆస్వాదించడం ఎంత బాగుంటుంది? ఇవన్నీ అమెరికా వెళ్తే దొరకవ్. అమెరికా ఫ్లయిట్‌లో కూర్చున్నా డన్నమాటే గానీ శేఖర్ మనసంతా ఇండియా మీదే ఉంది. అది కూడా హైదరాబాద్ మీద. ముఖ్యంగా పద్మా రావునగర్‌లోని తమ ఇంటి మీద!



 డిగ్రీ చదివిన ప్రతివాడి గోల్ అమెరికానే. శేఖర్‌కి ఇంట్రస్ట్ లేదు. కానీ గుంపుతో గోవింద కొట్టక తప్పలేదు. అమెరికా జీవితం గొప్పగా అనిపించలేదు శేఖర్‌కి. ఏదో అసంతృప్తి. జాబ్‌లో చేరాక మనసు పంపే సిగ్నల్స్ సారాంశం తెలిసొచ్చింది. ఇలా కాదు. క్రియేటివ్‌గా ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకు సినిమా ఫీల్డ్ కరెక్ట్. శేఖర్ డిసైడైపోయాడు. జాబ్‌కి రిజైన్ చేసేసి, హావర్డ్ యూని వర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్‌లో జాయినై పోయాడు. థీసిస్‌కి ఓ స్క్రిప్టు రెడీ చేయాలి. అమెరికాలో అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. దేనికీ చలించరు. అలాంటి స్వభావంతో ఓ హీరోయిన్ కేరెక్టర్ సృష్టిస్తే? సృష్టించాడు. స్క్రిప్టు రెడీ. ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేతికొచ్చింది. ఇక హైదరాబాద్ వెళ్లడానికి పెట్టే బేడా సర్దుకోవాల్సిందే!

   

 హైదరాబాద్ రాగానే సిటీ కార్పొరేషన్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ సంపాదించాడు శేఖర్. 20 వేల జీతం. సెలైంట్‌గా సినిమా ట్రయల్స్ మొదలెట్టాడు. అప్పుడు కృష్ణవంశీ ‘సింధూరం’ తీస్తున్నాడు. అతని దగ్గరకెళ్లి అసిస్టెంట్‌గా పెట్టుకోమని అడిగాడు. ఇలాంటి ఆబ్లిగేషన్లు కృష్ణవంశీకి లెక్కలేనన్ని. అందుకే శేఖర్‌కి పని కాలేదు. కానీ అవకాశం ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని తనకి తెలుసు. వచ్చేసింది. శేఖర్ అక్కయ్య గైనకాలజిస్ట్. ఆ రోజు ఆమె దగ్గరకెళ్లాడు.



 అదే టైమ్‌కి ఓ అమ్మాయి అబార్షన్ చేయించుకోడాని కొచ్చింది. తను త్వరలో యూఎస్ వెళ్తోంది. అక్కడే పిల్లల్ని కంటే పౌరసత్వం వస్తుంది కదా! అందుకే అబార్షన్. అమె రికా ఎన్ని జీవితాల్ని ఇలా ప్రభావితం చేస్తుందో కదా అనిపించింది. ఆ యాంగిల్‌లో కథ రాయడం మొదలు పెట్టాడు. దీంతో సినిమా తీయాలి. అన్నయ్య ఎలానూ బ్యాక్‌బోన్‌గా ఉంటాడు. ఇక ఫ్రెండ్స్ హెల్ప్ తీసు కోవాలి. ఎవరికి తోచింది వాళ్లు ఇచ్చారు. మొత్తం 18 లక్షలు పోగయ్యింది. బ్యానర్ పేరు ‘అమిగోస్’. అంటే స్పానిష్ భాషలో ‘ఫ్రెండ్స్’ అని అర్థం. 18 రోజులలో ‘డాలర్ డ్రీమ్స్’ సినిమా పూర్తి అయిపో యింది. కానీ దాన్నెలా మార్కెట్ చేయాలో, ఎలా రిలీజ్ చేయాలో అర్థం కాలేదు. ఏవేవో తంటాలు పడ్డాడు. చివరకు రిలీజైంది. చూసింది తక్కువమందే. వాళ్లందరూ బావుందన్నారు. కానీ బిగ్ లాస్. ఒకటే రిలీఫ్. బెస్ట్ డెబ్యూ డెరైక్టర్‌గా నేషనల్ అవార్డు. ఇండస్ట్రీలో చిన్న గుర్తింపు.

   

 ‘డాలర్ డ్రీమ్స్’కొచ్చిన లాస్ కవర్ చేసుకోవడానికి మూడేళ్లు పట్టింది శేఖర్‌కి. ఆ పడవ ఒడ్డుకి చేరుకుందనిపించగానే మళ్లీ ప్రయాణానికి సిద్ధమైపోయాడు. థీసిస్ స్క్రిప్టు బయటకు తీసి ఫిల్మ్‌నగర్ బయలుదేరాడు. పాతిక ముప్ఫై మందికి స్క్రిప్టు వినిపించాడు. ‘‘గ్రామ్‌ఫోన్ తిరుగు తోంది. ‘మనసున మల్లెల మాలలూగెనే’ పాట వస్తోంది. ఒక అందమైన అమ్మాయి, బయట వాన’’ అని కథ చెప్పడం మొద లెట్టగానే ప్రొడ్యూసర్లు ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు. ఇదంతా క్లోజ్‌ఫ్రెండ్ అనీష్ కురువిల్లా అబ్జర్వ్ చేసి ‘ఆ గ్రామ్‌ఫోన్ విషయం ఆపేయరా బాబూ’ అన్నాడు. ‘పోనీ స్క్రిప్టు ఇస్తాను. చదువుకోండి’ అంటే ఒక్క పేజీ చదివే తీరికా ఓపికా ఏ నిర్మాత దగ్గరా కనబడలేదు. పెద్ద పెద్ద వాళ్లందర్నీ కలిశాడు. నో యూజ్. ఇక సొంతగా ప్రొడ్యూస్ చేసుకోవాల్సిందే. బడ్జెట్ లెక్కవేస్తే 80 లక్షలు తేలింది. ఫ్రెండ్సంతా హెల్ప్ చేసినా, అంత మొత్తం అంటే కష్టం. అంతలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ గురించి తెలిసింది. వాళ్లకు సబ్జెక్ట్ నచ్చితే పెట్టుబడి పెడతారు. వాళ్లకు ప్రపోజల్ పంపించాడు. 40 లక్షలు పెట్టడానికి ఎన్.ఎఫ్.డి.సి. రెడీ!



 ఈ కథ రాసుకుంటున్నప్పుడే శేఖర్ మైండ్‌లో పవన్‌కల్యాణ్ ఉన్నాడు. శేఖర్ ట్రై చేశాడు. వర్కవుట్ కాలేదు. అదే టైమ్‌లో రాజాని చూశాడు. ఓ చినదాన, విజయం, అప్పుడప్పుడు, కల, అర్జున్ సినిమాలు చేశాడప్పటికి. టైటిల్ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ల నాన్న పేరు కూడా ఆనందే. మిగతా క్యారెక్టర్స్ కూడా సెట్ అయ్యాయి. కానీ హీరోయిన్ రూప దొరక లేదు. సినిమా అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఎవరైనా పాపులర్ ఫిగరైతే బాగుంటుంది. అసిన్, సదా... చాలామందిని ట్రై చేశాడు. ఇక కొత్తవాళ్లే బెటర్. టీవీలో ‘ఆయుష్’ షాంపూ యాడ్ వస్తోంది. దాన్లో ఓ కోడలు అత్తగారు మార్చుకోమన్నవన్నీ మార్చుకుం టుంది, ఒక్క షాంపూ తప్ప.



ఆ కోడలి గార్జియస్ లుక్, యాక్షన్ అన్నీ చూస్తే రూపలా కనబడింది. వెంటనే ఎంక్వైరీ చేశాడు శేఖర్. ఆమె పేరు కమలినీ ముఖర్జీ. బెంగాలీ అమ్మాయి. బాంబేలో థియేటర్ ఆర్ట్స్ చేసి, మోడలింగ్ చేస్తోంది. ‘ఫిర్ మిలేంగే’ అనే హిందీ సినిమాలో కూడా చేస్తోంది. ఆమెకి శేఖర్ నుంచి కాల్ వెళ్లింది. ఆమెకేమో సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ లేదు. ఒకేసారి హిందీ, తెలుగుల్లో చేస్తామని చెబితే ఒప్పుకుంది. శేఖర్ స్క్రిప్టు ఇచ్చేసి వెళ్లిపోయాడు. రాత్రంతా చదివి రూప క్యారెక్టర్‌కి ఫ్లాటైపోయింది. మ్యూజిక్ డెరైక్టర్‌గా కె.ఎం.రాధా కృష్ణన్ సెలెక్ట్ అయ్యాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ నాలుగు గోడల మధ్య కాకుండా నెక్లెస్ రోడ్డులోనూ యూని వర్సిటీ క్యాంపస్‌లోనూ తిరుగుతూ చేశారు.



శేఖర్‌కు వేటూరి లిరిక్స్ అంటే ప్రాణం. అనీ ఆయనతోనే రాయించు కున్నాడు. ఇలాంటి సినిమాలకు అను భవం ఉన్న కెమెరామ్యాన్ కావాలి. విజయ్. సి.కుమార్ దొరికాడు. అమ్మోరు, అంకుశం, ఆగ్రహం లాంటి సినిమాలకు పనిచేశాడు. శేఖర్ ‘నాకు వెన్నెల రాత్రి కావాలి’, ‘మంచు బిందువులు కావాలి’ అని అడుగుతుంటే, విజయ్ ఆ విజువల్స్ అన్నీ కెమెరాతో ఒడిసిపట్టి ఇచ్చాడు.  ఎక్కువ శాతం షూటింగ్ శేఖర్ సొంత కాలనీలోనే. శేఖర్ అతి శ్రద్ధ వల్లో, క్వాలిటీ కోసం అతి తపన వల్లో బడ్జెట్ అంతై ఇంతింతై రెండున్నర కోట్లు తేలింది. శేఖర్‌కి తన ప్రొడక్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. కానీ బయ్యర్సే శేఖర్ గాలి తీయడం మొదలు పెట్టారు.



హీరోయిజం లేదు... పెద్ద కామెడీ లేదు... హీరోకి బాత్రూమ్ లేకపోవడ మేంటి... ఏముందని దీనికింత ఖర్చు పెట్టావు... ఇలా బాణాలు సంధించేసరికి శేఖర్‌కి ‘సినిమా అంత అసహ్యంగా ఉందా?’ అనే డౌట్ వచ్చింది. ఫ్రెండ్ అనీష్ మాత్రం భుజం తట్టాడు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత ఎ.రమేశ్ ప్రసాద్ కూడా ‘ఈ సినిమాకు డబ్బులు రావేమో’ అని డౌట్ వ్యక్త పరిచారు. నిండా మునిగాక చలేముం టుంది! మొండిగానే ముందుకెళ్తున్నాడు. రకరకాల మార్కెటింగ్ వ్యూహాలు ఆలో చిస్తున్నాడు. ‘మంచి కాఫీ లాంటి సినిమా’ అనే క్యాప్షన్ తగిలించాడు. ‘బ్రూ’ కంపెనీతో టై అప్ అయ్యాడు. ఓన్ రిలీజ్‌కే సిద్ధమయ్యాడు. అది కూడా తన ఫేవరేట్ హీరో చిరంజీవి సినిమా మీద పోటీ.



 ‘శంకర్‌దాదా ఎంబీబీయస్’ 2004 అక్టోబర్ 15న రిలీజ్. అదే రోజు ‘ఆనంద్’ రిలీజ్ చేయాలని శేఖర్ ప్లాన్. జనరల్‌గా టాప్‌స్టార్స్ సినిమాల మీద ఎవ్వరూ పోటీకి దిగరు. కానీ శేఖర్ దిగాడు. అదే కలిసొచ్చింది కూడా. మార్కెట్‌లో శేఖర్ డేరింగ్ గురించి డిస్కషన్. ఆడియన్స్‌లో కూడా క్యూరియాసిటీ. ఐదంటే ఐదు ప్రింట్లతో హైదరాబాద్, వరంగల్, విజయ వాడ, విశాఖపట్నాల్లో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌పై శేఖర్‌కి నో హోప్. త్రీ వీక్స్ ఆడితే చాలు అనే ఫీలింగ్. కానీ సినిమా చూసిన వాళ్లందరికీ మంచి కాఫీ తాగిన ఫీలింగ్. ఆ పరిమళం అలా అలా పాకుతూ 23 ప్రింట్ల దాకా ఎగిసింది. ఈ ‘ఆనంద’ ప్రవాహంలో ప్రేక్షకుడి మనసు కాగితపు పడవలాగా ప్రయాణించేసింది.



విమర్శకులు  గొప్ప గొప్ప సమీక్షలు రాశారు. ‘‘నిద్రపోతున్న పసిపాప దగ్గరుండే నిశ్శబ్దం... గోరింటాకు పండక పోతే వచ్చే బాధ... రాత్రంతా మొక్క ముందు కాపలా కాసినా మొగ్గ పువ్వు ఎప్పుడవుతుందో కనిపెట్టలేని మిస్టరీ... ఈ ‘ఆనంద్’ సినిమా’’ అంటూ వచ్చిన సమీక్షతో శేఖర్‌కి తానెంత గొప్ప సినిమా తీశాడో అర్థమైపోయింది. సినిమాలో అన్నీ నేచురల్ డైలాగ్స్. తెలుగు, ఇంగ్లిష్, హిందీ మిక్సింగ్ ఫ్లేవర్ నచ్చేసింది. ఆర్టిస్టులూ దాదాపు కొత్తవాళ్లే. వాళ్ల బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీల్లో న్యూ ఎట్రాక్షన్. రాజా, కమలినీలు అచ్చం ఆనంద్, రూపల్లాగానే బిహేవ్ చేశారు.



 కమలినీకి సింగర్ సునీత డబ్బింగ్ భలే హెల్ప్ అయ్యింది. ఆరు పాటలూ శ్రోతల్ని కొత్త రాగాల్లో తేలియాడించాయి. హిట్ టాక్ రావడంతో బయ్యర్లూ వచ్చారు. హైదరాబాద్ ఉంచేసుకుని మిగతాదంతా అమ్మేశాడు శేఖర్. హైదరాబాద్‌లో 130 రోజులు ఆడింది. అదే శేఖర్‌కు మిగిలింది. 2005 జనవరి 28న హండ్రెడ్ డేస్ ఫంక్షన్. చీఫ్ గెస్ట్ దాసరి నారాయణరావు. అప్పుడాయన కేంద్ర బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి. ఆయన ప్రసంగిస్తూ... ‘‘రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిల్లో గొప్ప ఫిల్మ్ ఇది. న్యూ జనరేషన్‌కి గైడ్ లాంటిది’’ అని ప్రశంసించారు.



 ‘‘బాగా చేశావ్ శేఖర్’’ అని బాపు నుంచి ప్రశంస. శేఖర్‌కి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందం. శేఖర్ వాళ్ల నాన్న ఒకటే మాటన్నారు. ‘‘పేరూ డబ్బూ వచ్చి నందుకు కాదు... నువ్వు అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ శేఖర్ లాంటి కొడుక్కి ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది!

 

 వెరీ ఇంట్రస్టింగ్

  ‘వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా’ పాటకు ముందు కమలినీ ముఖర్జీని ఇంటి ముందు డ్రాప్

 చేసే ఆటోడ్రైవర్‌గా శేఖర్ కమ్ముల క్షణంసేపు కనిపిస్తారు.

 - పులగం చిన్నారాయణ

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top