నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ... | Best Villain of Ashish Vidyarthi | Sakshi
Sakshi News home page

నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ...

Sep 17 2016 11:12 PM | Updated on Sep 4 2017 1:53 PM

నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ...

నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ...

‘గుడుంబా శంకర్’ సినిమాలో కుమారస్వామి నాయుడు డైలాగ్ ఇది. ఈ నాయుడు... ఆశిష్ విద్యార్థి.

ఉత్తమ విలన్
గౌరీ... ఇది ఆట కాదు. జీవితం. ఏదైనా సరే... నాకు ఓడిపోవడం  ఇష్టం ఉండదు. అలాంటి నన్ను ఓడించాలని చూస్తావా? నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ. పవర్ ఉంటే... అన్నీ కొట్టుకుపోతాయి. అది నాకు ఉంది కదా!
 
‘గుడుంబా శంకర్’ సినిమాలో కుమారస్వామి నాయుడు డైలాగ్ ఇది. ఈ నాయుడు... ఆశిష్ విద్యార్థి.
 నిజమే... ఆశిష్ దగ్గర పవర్ ఉంది.
 అది పొలిటికల్ పవర్ కాదు.
 కరెన్సీకి సంబంధించిన పవర్ కాదు... కలేజా పవర్! ‘నన్ను సవాల్ చేసే పాత్ర రావాలి...దాన్ని నేను సవాలు చేయాలి’ అనుకునే పవర్. ప్రాంతీయ టీవీ ఛానెళ్లలో మొదట్లో మైనర్ రోల్స్ చేసిన ఆశిష్ పెద్ద విలన్‌గా ఎదగడానికి ఈ పవరే కారణం.
 
‘ఒరేయ్ ఆనంద్...
 బ్రిటిష్ వాళ్లు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్లిపోయారని ఓ... ఏడుస్తుంటారు మనవాళ్లంతా.
 దాని పేరేమిటి? కోహినూర్ వజ్రం. ఎవరు చెప్పారురా బ్రిటిష్ వాళ్లు పట్టుకెళ్లారని?
 అదిగో... రోడ్ల మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్....’
  అందమైన  ఆడపిల్ల శ్రుతిని ఇలా కవితాత్మకంగా టీజ్ చేయడమే కాదు... ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలూ చేస్తాడు ‘పోకిరి’ సినిమాలో ఇన్‌స్పెక్టర్ పశుపతి(ఆశిష్). ఈ పశుపతి అంటే అందాల శ్రుతికి మాత్రమే కాదు ఆమె తమ్ముడికి, అమ్మకీ భయమే.

వీళ్ల సంగతి వదిలేయండి...పెద్ద పెద్ద గూండాలే ఇతనికి భయపడతారు. పనిగట్టుకొని దుర్మార్గాన్ని అదేపనిగా పండిస్తున్నట్లుగా ఉండదు ఆశిష్ విద్యార్థి నటన.
 సహజంగా ఉంటుంది. ఎంత సహజంగా  అంటే... తెర మీద విలన్ను చూస్తున్నట్లుగా ఉండదు. నిజజీవితంలో ఎప్పుడో, ఎక్కడో ఒక దుర్మార్గుడిని చూసినట్లుగానే ఉంటుంది. అతనిలోని ‘చెడు’ను చూస్తున్నట్లుగానే ఉంటుంది.
 ‘ఆశిష్ విద్యార్థి మంచి నటుడు’ అనే పేరు ఒకే ఒక సినిమాతోనో, రెండో సినిమాతోనో రాలేదు. అదొక అందమైన ప్రయాణం.
 
‘నటుడు అనే వాడు ఎప్పటికప్పుడు సవాళ్ల కోసం ఎదురుచూడాల్సిందే’ అంటాడు ఆశిష్.
 ‘ద్రోహ్‌కాల్’లో ‘కామ్రేడ్ భద్రా’గా తన అద్భుత నటనతో ప్రేక్షకుల  మెప్పును మాత్రమే కాదు... జాతీయ అవార్డ్‌ను కూడా అందుకున్నాడు ఆశిష్.
 ‘ఒక సంతృప్తికరమైన పాత్రను పోషించాను’ అని ఫుల్లుగా సంతృప్తి పడి ఎడాపెడా పాత్రలు చేసుకుంటూ పోలేదు. తనను సవాలు చేసే పాత్రల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ అతడి నిరీక్షణ ఫలించలేదు.
 ‘సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్’ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి ముంబై విడిచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నాడు.
 ఈలోపు ఒక పెద్ద నటుడిని కలిసి తన మనసులో బాధను  చెప్పుకున్నాడు.
 
‘‘చేసిన పాత్రలే చేసి బోర్ కొడుతోంది’’ అన్నాడు.
 ‘‘ఫరావాలేదు... మొదట బోర్ కొట్టినా... ఆ తరువాత అదే అలవాటైపోతుంది’’ అన్నాడు ఆ నటుడు. ఆయన సీరియస్‌గా అన్నాడో, నవ్వించడానికి అన్నాడోగానీ....
 ఆశిష్‌కు బోర్ పాత్రలు అలవాటైపోలేదు. మరింత బోర్ కలిగించాయి.
 ‘ఈమాత్రం దానికేనా నేను సినిమాల్లో నటించేది!’ అనుకున్నాడు. తక్షణం ముంబాయి విడిచాడు. ఒక పాత కథ ముగియలేదు.
 ఒక కొత్త కథ మొదలైంది...
    
ఆకలితో ఉన్న ఆశిష్‌కు దక్షిణాది సినీపరిశ్రమ కడుపు నిండిపోయే ఆతిథ్యాన్ని ఇచ్చింది.
 ఎలాంటి పాత్రలైతే చేయాలనుకున్నాడో అలాంటి పాత్రలు చేశాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలు. తృప్తితో కడుపు నిండే పాత్రలు.
 ‘బాబా’, ‘శ్రీరామ్’, ‘ఏకె-47’, ‘గుడుంబాశంకర్’, ‘నరసింహుడు’, ‘పోకిరి’, ‘చిరుత’, ‘అతిథి’, ‘తులసి’, ‘అలా మొదలైంది’, ‘కిక్-2’... మొదలైన సినిమాలు ఆశిష్‌కు మంచి గుర్తింపును ఇచ్చాయి.
 ‘‘సౌత్‌లో నేను పోషించిన పాత్రలు... నటుడిగా నన్ను నేను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడ్డాయి’’ అంటాడు ఆశిష్ కృతజ్ఞత నిండిన కంఠంతో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement