పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్! - Sakshi


సినిమా వంద రోజుల పండుగలు జరుపుకోవడం మరచిపోయి చాలా కాలం అయింది.  ఒక సినిమా ఎన్ని రోజులు ఆడిందనేది రికార్డు కాదు. ప్రస్తుతం ఎంత కలెక్షన్ వసూలు చేసిందనేదే రికార్డుగా లెక్కిస్తున్నారు. బాలీవుడ్లో అయితే వంద కోట్ల రూపాయలు, రెండు వందల కోట్లు, మూడు వందల కోట్ల రూపాయలని లెక్కిస్తున్నారు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది?' చిత్రం చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. కలెక్షన్లలో కూడా రికార్డు సృష్టించింది. పవరున్న హీరో నటిస్తే ఈ రోజుల్లో కూడా  సినిమా వంద రోజులు ఆడుతుందని  పవన్ కళ్యాణ్ రుజువు చేశారు.  తెలుగు సినిమా రంగంలో మళ్లీ ఆ గోల్డెన్ డేస్ వస్తాయన్న ఆశ ఈ చిత్రంతో చిగురించింది.సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది?' సినిమా 170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 36 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఇంకా ఆడుతోంది.  తెలుగు సినిమా రంగంలో ఒక సినిమా విడుదల కాకముందే పైరసీ బయటకు రావడం ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా 'అత్తారింటికి దారేది?' సగం సినిమా పైరసీ సిడి బయటకు వచ్చింది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అల్లాడిపోయారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పారు. పైరసీ వచ్చినప్పటికీ సినిమా విడుదలైన తరువాత థియేటర్లు నిండిపోయాయి. కాసుల వర్షం కురిపించింది. నిర్మాత ఆనందానికి అవధులులేవు. పవన్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అభిమానులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు.  ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా టాలీవుడ్ రికార్డుని తిరగరాసింది. ఈ చిత్రంతో పవన్ పవర్ రేంజ్ ఏమిటో అందరికీ అర్ధమైంది.
 గబ్బర్ సింగ్ చిత్రం 57 కేంద్రాలలో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది. 2013లో హీరో ప్రభాస్ నటించిన మిర్చి, నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు కూడా 18 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. అయితే కలెక్షన్లలో మాత్రం  'అత్తారింటికి దారేది?' చిత్రం వాటన్నిటికంటే ముందుంది. ఈ సినిమా 85 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా కూడా వంద కోట్ల రూపాయలు వసూలు చేయగలదన్న ఆశ చిగురిస్తోంది.  పవన్ కళ్యాణ్ తన రికార్డును తానే అధిగమించారు. అత్తారింటికి దారేది? రికార్డుని కూడా తనే అధిగమిస్తారా? మరెవరైనా అధిగమిస్తారా? అనేది వేచి చూడాలి. మళ్లీ తన రికార్డుని తనే బద్దలు కొడతాడని పవన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంతోపాటు అతని మాటలు, ఆ మాటలను పవన్ పలికిన  స్టైల్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిపి ఈ చిత్రాన్ని సూపర్, డూపర్ హిట్ చేశాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి.

s.nagarjuna@sakshi.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top