
లండన్: ఏళ్లతరబడి మద్యం సేవించిన వృద్థులు, ఆల్కహాల్ సేవించే నడివయసు మహిళల మరణాలు పెరుగుతున్నట్టు యూరప్‌లో వెల్లడైన తాజా అధ్యయనం తేల్చింది. దశాబ్ధాల తరబడి లిక్కర్ తీసుకున్న వారు 60 ఏళ్లు పైబడిన తర్వాత అర్థాంతరంగా మరణిస్తున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి.
ఆల్కహాల్ తీసుకునే 70 నుంచి 74 ఏళ్ల పురుషులు లక్షమందిలో 28 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. 2001లో లక్ష జనాభాలో ఈ తరహా మరణాలు కేవలం 18.7 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో 60 నుంచి 64 ఏళ్ల వయసున్న స్త్రీల మరణాలు ఏకంగా 35 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడించాయి.
వయసు మళ్లిన వారిలో ఆల్కహాల్ మరణాలు ఎక్కువగా స్కాట్లాండ్‌లో చోటుచేసుకుంటున్నాయి.ఆల్కహాల్ సేవించే తల్లితండ్రులతో చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారు మానసిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ గణాంకాలు వెల్లడించిన చిల్డ్రన్స్ సొసైటీ తెలిపింది. బాధిత చిన్నారులకు అన్ని రకాలుగా ఆపన్నహస్తం అందించాల్సి ఉందని సంస్థ పేర్కొంది.