కాటేస్తున్న 'ఖాకీ'! | Noida woman gang-raped and robbed, two constables among four arrested | Sakshi
Sakshi News home page

కాటేస్తున్న 'ఖాకీ'!

Sep 2 2013 5:11 PM | Updated on Sep 19 2019 2:50 PM

మహిళల పట్ల పోలీసుల ప్రవర్తనకు దర్పణం - Sakshi

మహిళల పట్ల పోలీసుల ప్రవర్తనకు దర్పణం

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మగువల మానాన్ని దోచుకుంటున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే అపర కీచకుల్లా మారుతున్నారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మగువల మానాన్ని దోచుకుంటున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే అపర కీచకుల్లా మారుతున్నారు. శరణు కోరిన స్త్రీలను చెరబడుతున్నారు. సహాయం అర్థించి వచ్చిన అబలను కనికరం లేకుండా కాటేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో వనితలు తమను ఆశ్రయించారన్న కనికరం కూడా లేకుండా కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోలీసు వ్యవస్థకు కళంకం తెస్తున్నారు. తాజాగా జరిగిన రెండు ఘటనలు ‘ఖాకీ’చక పర్వానికి పరాకాష్టగా నిలిచాయి.

అతివలపై అత్యాచారాలకు రాజధానిగా అపఖ్యాతి మూటగట్టుకున్న ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ సంచలనం రేపింది. ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఇద్దరు పీఏసీ కానిస్టేబుళ్లు వారి ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మహిళ(25)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుపడిన ఆమె స్నేహితుడిని కొట్టి మరీ ఈ దురాగతానికి ఒడిగట్టారు. నోయిడా ఢిల్లీకి చెందిన మహిళ నోయిడాలోని తన స్థిరాస్తి డీలరైన స్నేహితుడిని కలిసేందుకు శుక్రవారం రాత్రి అతని ఆఫీసుకు వెళ్లింది. అయితే 7-8 గంటల సమయంలో ముగ్గురు స్నేహితులతో పోలీసు జీపులో వచ్చిన ఇద్దరు పీఏసీ కానిస్టేబుళ్లు వారున్న ఆఫీసు గదిలోకి చొరబడ్డారు. ఆమె స్నేహితుడిని చితక్కొట్టి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్‌ను లాక్కెళ్లారు. ఆ ఏటీఎం కార్డును ఉపయోగించి జీపులో ఇంధనం నింపుకున్నారు. గ్యాంగ్‌రేప్ సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పీఏసీ హెడ్ కానిస్టేబుల్ బన్షీరామ్‌శర్మ, కానిస్టేబుల్ సుభాష్‌లతోపాటు వారి స్నేహితులు అరుణ్ కుమార్, బంటీలను అరెస్టు చేశారు.

విశాఖపట్నంలో ‘ఖాకీ’చకం ఆలస్యంగా బయటపడింది. ఓ అమాయకురాలిని బెదిరించి ఇద్దరు కానిస్టేబుళ్లు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.  విశాఖ జిల్లా పెందుర్తి మండలం కోట్నివానిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బంగారం చోరీ కేసులో ఈ ఏడాది జూలై 8 నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. అతని భార్య ములాఖత్ కోసం పలుమార్లు జైలుకు వచ్చి వెళ్లేది. జైలు వద్ద నిఘా విధులు నిర్వహించే రూరల్ కానిస్టేబుల్ జేవీవీ వర్మ, నగర కానిస్టేబుల్ అఖిల్ అలియాస్ ప్రవీణ్‌ ఈ మహిళపై కన్నేశారు. నీ భర్తను త్వరగా విడుదల చేయిస్తామని ఆమెను ప్రలోభ పెట్టి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. కొన్నిసార్లు ఇంటికి వెళ్లి కూడా బెదిరించి లోబరుచుకున్నారు. దీంతో మనోవేదనకు గురైన ఆమె తీవ్ర మానసిక క్షోభతో మంచంపట్టింది. జైలు విలుదలయిన బాధితురాలి భర్త విషయం తెలుసుకుని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో ఈ దారుణోదంతం వెలుగుచూసింది.

'మీకేదైనా అన్యాయం జరిగితే నిర్భయంగా మాకు ఫిర్యాదు చేయండి' అంటూ ఇంటాబయట పోలీసు బాసులు స్పీచ్లు దంచుతుంటారు. కానీ ఫిర్యాదు చేయడానికి వచ్చిన పడుతులనే చెరబడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలని మహిళా సమాజం ప్రశ్నిస్తోంది. తమకు రక్షణ ఎక్కడుందని వాపోతోంది. ‘ఖాకీ’చక పర్వం పునరావృతం కాకుండా కామంధులకు కఠిన శిక్షలు విధించాలని నినదిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement