కూల్ అండ్ లవ్‌లీ.. నిహారిక | Niharika is a familiar anchor to television audience | Sakshi
Sakshi News home page

కూల్ అండ్ లవ్‌లీ.. నిహారిక

Sep 11 2014 12:55 AM | Updated on Sep 2 2017 1:10 PM

కూల్ అండ్ లవ్‌లీ.. నిహారిక

కూల్ అండ్ లవ్‌లీ.. నిహారిక

నేను పక్కా హైదరాబాదీనంటోంది నటుడు ప్రదీప్, సరస్వతిల గారాలపట్టి డాక్టర్ నిహారిక. నాలుగేళ్ల వయసులోనే యాంకరింగ్ చేసిన నిహారిక బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.

నేను పక్కా హైదరాబాదీనంటోంది నటుడు ప్రదీప్, సరస్వతిల గారాలపట్టి డాక్టర్ నిహారిక. నాలుగేళ్ల వయసులోనే యాంకరింగ్ చేసిన నిహారిక బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. తండ్రి వారసత్వంగా వచ్చిన నటన నిహారికను పలు సినిమాల్లో నటించేలా చేసింది. యాంకరింగ్‌తో పాటు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ పోషిస్తోంది. నటనను ప్రవృత్తిగా స్వీకరించిన నిహారిక వృత్తిపరంగా డెంటిస్ట్. సంప్రదాయానికి ప్రతీకగా కనిపించే ఈ అమ్మాయి.. ఆధునికతనూ సాదరంగా ఆహ్వానిస్తుంది. సిటీలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. మీ నిహారిక అంటూ పలు ముచ్చట్లు సిటీప్లస్‌తో పంచుకుంది.
 
 నాలుగేళ్ల వయసులోనే నా కెరీర్ మొదలైంది. అమ్మానాన్న ఇద్దరూ నటులే. వారి నటవారసత్వం నాకు లభించడం వరంగా భావిస్తున్నాను. దూరదర్శన్‌లో యాంకరింగ్‌తో నా కెరీర్ మొదలైంది. డీడీలో ప్రసారమైన బ్యాన్‌బ్యాంగ్‌తో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. తర్వాత 8 ఏళ్ల వయసులో డీడీలోనే ‘స్వరభారతి సుస్వరహారతి’ ప్రోగ్రామ్‌కు బెస్ట్ యాంకర్‌గా మరోసారి నంది అవార్డు అందుకున్నాను.
 
  తర్వాత పెళ్లిపందరి, మందాకిని, ప్రార్థన, పెళ్లి చూపులు, మరోచరిత్ర వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ప్రస్తుతం శశిరేఖాపరిణయంలో లీడ్ రోల్(శారద) పోషిస్తున్నాను. స్టైల్ సూత్ర, హంగామా అన్‌లిమిటెడ్, 24 క్రాఫ్ట్స్, షో రీల్, సౌత్ జంక్షన్ , టోటల్ టాలీవుడ్ ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా చేస్తున్నాను. డీడీ నేషనల్‌లో మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌కు ప్రయోక్తగా పని చేస్తున్నాను. అలాగే.. నేనున్నాను, కుచ్చికుచ్చి కూనమ్మ, వన్స్‌మోర్, దేవస్థానం సినిమాల్లో నటించాను.
 
 ఈవెంట్ మేనేజింగ్
 ఈవెంట్ మేనేజింగ్ కూడా చేస్తుంటాను. కార్పొరేట్ సంస్థల కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించే క్రియేటివ్ స్ట్రాటజీ కంపెనీ (క్రెస్ట్)కి సీఈవోగా వ్యవహరిస్తున్నాను. ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ తదితర కార్పొరేట్ సంస్థలకు ఈవెంట్ ఆర్గనైజ్ చేశాను. సరిగమల్లోనూ కాస్త పట్టుంది. పలు రియాల్టీ షోల్లో నా గొంతు సవరించాను కూడా.
 
 భలే సరదా
 హైదరాబాద్‌తో నా అనుబంధం మాటల్లో చెప్పలేను. కర్ణాటకలోని రాయచూర్‌లో మెడిసిన్ చేసిన ఐదేళ్లు సిటీని ఎంతో మిస్సయ్యానన్న ఫీలింగ్ కలిగేది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో చక్కర్లు కొట్టడం అంటే మహాసరదా. మా తమ్ముడు నితీష్‌తో సిటీలోని గల్లీగల్లీ తిరుగుతుంటాను. మంచి సినిమా అయితే రిలీజైన వారంలోనే చూసేస్తాను. అమ్మానాన్నతో కలసి వెళ్తుంటాను. ఒక్కోసారి నేను, నాన్న ఇద్దరమే వెళ్లి సినిమాలు చూస్తుంటాం.
 
 జీవితాన్నిచ్చింది..
 హిందీ, ఉర్దూ కలగలసిన హైదరాబాదీ స్లాంగ్‌లో ఓ మజా ఉంటుంది. ఆ భాషలో ఓ కమాండ్ ఉంటుంది. చార్మినార్ దగ్గర, శిల్పారామంలో ఎంతసేపైనా షాపింగ్ చే యొచ్చు. అక్కడ దొరకని ఐటం అంటూ ఉండదనుకోండి. గోల్కొండ కోట చూస్తే కాస్త గర్వంగా ఫీలవుతుంటాను. కోటపై నుంచి సిటీ వ్యూ భలే బాగుంటుంది. రాత్రి వేళలో ఐస్‌క్రీమ్ కోసం తమ్ముడితో కలసి బైక్ మీద వెళ్తుంటాను. హుస్సేన్‌సాగర్ వెళ్తే.. ముసురుకున్న చీకట్లలో.. వెన్నెల పరుచుకున్నట్టు కనిపించే బుద్ధుడి విగ్రహం ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌కు మించిన కూల్ అండ్ లవ్లీ ప్లేస్ మరెక్కడా ఉండదు. జన్మనిచ్చింది అమ్మానాన్నలైతే.. జీవితాన్నిచ్చింది మాత్రం హైదరాబాదే.
 - శిరీష చల్లపల్లి

Advertisement
 
Advertisement
Advertisement